Wednesday, March 2, 2022

️మనసుకు కళ్లెం వేయడం ఎలా❓

నేటి జీవిత సత్యం.

❤️మనసుకు కళ్లెం

వేయడం ఎలా


కంటికి కనిపించకుండా జీవితమనే మహానాటకాన్ని నడిపించే ప్రధాన సూత్రధారి మనసు.

ఇది మనచేత మంచి చేయిస్తుంది. చెడూ చేయిస్తుంది. మన పాపపుణ్యాలకు, ఖ్యాతికి, అపఖ్యాతికి మూలమైంది ఇదే.

‘ఈ మనసు కోతిరా రామా!’ అన్నాడో కవి.

లోకంలో ధర్మప్రతిష్ఠాపనకు మహామహుల మనసునుంచి ఆవిర్భవించిన ఆలోచనలే మంత్ర బీజాక్షరాలు. మాన్యులైనా, సామాన్యులైనా మనసు చెప్పినట్లు నడచుకోవాల్సిందే!

మనం తినే ఆహారంలోని సూక్ష్మభాగాన్ని జఠరాగ్ని మథనం చేస్తుంది. అందులోని సూక్ష్మభాగం మనసుగా రూపొందుతుందని ఛాందోగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు చెబుతాడు.

అంటే మనం తీసుకునే సాత్వికాహారం ప్రభావం మనసుపైన పడుతుంది. అందుకే మనసుకు కళ్లెం వెయ్యాలి. దాన్ని నియంత్రించాలి. అదే మనోనిగ్రహం.

మహర్షులు సైతం సంయమనం కోల్పోయి అరిషడ్వర్గాలకు దాసులై అనవసరంగా, అసందర్భంగా శాపాలిచ్చి, శాపాలపాలై అపఖ్యాతి పొందారు. మనసు లోతును తెలుసుకోలేం. మనోవేగాన్ని అందుకోలేం. అందుకే అది మనల్ని ఆడిస్తూంటుంది. శరీర వ్యాపారమంతా మనసుపైనే ఆధారపడి ఉంది.

ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనసు ఉంటుందంటారు స్వామి వివేకానంద. ఆహార పరిశుభ్రత కచ్చితంగా మనసును ప్రభావితం చేస్తుంది. బాహ్య పరిశుభ్రతతో పాటు మనసులోని క్లేశాలను తొలగిం చుకుని, మనో శుభ్రతను కూడా పాటించాలంటాడు బుద్ధ భగవానుడు. ఇందుకోసం ఆయన విమలకీర్తి నిర్దేశక సూత్రాలను ప్రతిపాదించాడు.

మనసులోని అజ్ఞానాన్ని సాధన ద్వారా దూరం చేసుకోవడం ఆంతరంగిక శౌచం అవుతుంది అంటారు ఆదిశంకరులు.

మనసంత వేగంగా ప్రయా ణించేది ఏదీ లేదు. దాని వేగానికి బుద్ధి కళ్లెం వేయగలదు. బుద్ధి మెదడునుంచే పుడుతుంది. మనసు బుద్ధి అదుపులో ఉన్నంతవరకు దుర్మార్గానికి పాల్పడదు. మనసుకు బుద్ధే తల్లి, తండ్రి, గురువు, దైవం... అన్నీ! జ్ఞాన తపస్సుతో మనసును పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకోవడం సాధ్యం! మనిషి మనసే మిత్రుడిగాను, శత్రువుగాను పనిచేస్తుంది అంటుంది భగవద్గీత.

స్వీయనియంత్రణకు అడ్డుపడే ఆలోచనలను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని పతంజలి యోగశాస్త్రం చెబుతోంది.

మంధర మాటలకు కైక మనసు మారి, పెడదారిన పడిపోయింది.

కర్ణశకునుల మాటల దుష్ప్రభావం దుర్యోధనుడి మీద పడటంతో పతనమైపోయాడు.

ఆధ్యాత్మిక చింతన, ధ్యానం, యోగం... మనిషి మనసును ఆదర్శవంతమైన మార్గాన నడిపిస్తాయి. సానుకూల యోచనలు సంచరించే సాధనంగా మనసును మలచుకోవాలి. బుద్ధి మనసును వాక్కాయకర్మల్లో పరిశుద్ధంగా ఉంచుతుంది. తనను తాను ఉద్ధరించుకునేందుకు ఉపయోగపడే మనసు బుద్ధిచేసే మార్గనిర్దేశనాన్ని సద్వినియోగ పరచుకోవాలి.

సేవచేయడం, వినడం, గ్రహించడం, గుర్తుపెట్టుకోవడం, ఊహించడం, పొరపాటును సరిదిద్దడం, ప్రయోజనం కలిగించడం, తత్త్వజ్ఞానం అనే బుద్ధికున్న ఎనిమిది లక్షణాలు మానవుణ్ని మహోన్నతుడిగా కీర్తిశిఖరాలమీద కూర్చోబెడతాయి. ఇవే అద్వైత మార్గాన మనిషిని నడిపిస్తాయి. ‘అహం బ్రహ్మాస్మి’కి గల భాష్యాన్ని అందిస్తాయి.

ఇది గ్రహించిన మనిషి మనసు తామరాకు మీద నీటి బొట్టవుతుంది. స్వచ్ఛమైన స్ఫటికమవుతుంది. సానపట్టిన వజ్రమవుతుంది. ఇదంతా మనసుకు వేసే కళ్లెంమీదనే ఆధారపడి ఉంది.🙏

ఉషోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment