సృష్థికి మూలమై నిలిచి ప్రకృతి లో సగమై గెలిచి
స్నేహమయిగా వలచి సోదరిగా వెంటనిల్చి
నీ చీకటిలో వెలుగిచ్చి అవసరానికి పనికొచ్చి
అన్నివేళలాచేయూత నిచ్చి వెనుకుండి నడిపించి
గుండె నిండా కోటి ఆశలు నింపుకున్న సుమతి
కంటినిండావేల వెలుగుల
పంచుతుంది సుదతి .
దుమ్ము దులిపి .. నట్లు బిగించడానికి
పైకెక్కేదాకా పొదివి పట్టుకోడానికి
ఆనక మడతెట్టి మూలన పడేయడానికి
కాదు సుమా ఆమెది నచ్చెన లాంటి గతి
చిన్న పలకరింపు కే పులకరించే స్రవంతి
నీవే తన లోకమని మురిసే మాతృ మూర్తి .
రిమోటు తో ఛానల్స్ మార్చే యడానికి
నచ్చక పోతే మ్యూటు బటను నొక్కేయడానికి
నీ మనసుకు నచ్చిందే ప్రదర్శించడానికి
కాదు సుమా ఆమె దూరదర్శిని
తాను ప్రాణమున్న మౌని తన మనసే ఓ ప్రేమగని
ఆమస్తిష్కం తెలివి తో నిండిన విజ్ఞాన ఖని .
ప్రాణ వాయువు నీ యింట నింపే ఇంతి
కరిగి ప్రేమ పరిమళం పంచే ఆ పడతి
అస్థిత్వాన్నే మరిచి ఆత్మార్పణ చేసే యువతి
నిన్నే నమ్మి నీవెంట అడుగు కలిపిన నాతి
నీజీవితాన్ని పంచుకున్న నీ ప్రియ సతి
కానీయకు ఆమె జీవితం కర్పూర హారతి.
అన్ని పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి
తన యిష్టాలన్నింటికీ తిలోదకాలిచ్చేసి
బరువు బాధ్యతలన్నీ భుజాలపైన మోసి
ఈదలేక అలసిపోయి మలి సంజన సొలసి
నిలిస్తే ఈ సమాజంపిచ్చి మాలోకమని ముద్రే స్తుంది
లేకపోతే బ్రహ్మ రాక్షసని బిరుదిస్తుంది.
ఆమెని వాడు కోవాలని చూడకు వెంటాడుతుంది .
ఆమెతో ఆడుకోవాలని చూడకు అంతు చూస్తుంది.
ఆమెను తొక్కేయాలని చూడకు తిరగబడుతుంది.
అర్ధంచేసుకోడానికి ప్రయత్నించు ఆనందం పంచుతుంది.
ఆమెకు కొంచెం ప్రేమని పంచి చూడు ప్రాణమిస్తుంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు🙏😊
No comments:
Post a Comment