Wednesday, March 9, 2022

శ్రీరాముని రాజధర్మాలు

💐💐💐#శ్రీరాముని_రాజధర్మాలు.💐💐💐


రాజధర్మాలు....

నదులు పర్వతాలు ఉండే పర్యంతం రామాయణ కావ్యం ఉంటుందని, రామకథ నిలిచిపోతుందనేది బ్రహ్మ వాల్మీకి మహర్షికి ఇచ్చిన వరం. రామ, అయనం రామాయణం. అంటే రాముని ప్రయాణం. రాముని మార్గమంతా, ప్రయాణమంతా ధర్మమయం. రాముడు చేసినదంతా ధర్మహితం. ప్రజాహితం. జాతి హితం. ధర్మనిష్ఠని కార్యదీక్షని తను తన జీవితమంతా ఆచరించి చూపిన ధర్మమూర్తి, వేదమూర్తి. అందుకే రాజ్యం ‘రామరాజ్యం’ కావాలన్నాడు మహాత్మాగాంధీజీ. పైగా ఈనాడు అంతా ‘రామరాజ్యం’ కావాలి అంటుండడం మనం వింటుంటాం, కంటుంటాం. కలలు కంటుంటాం. అదీ రామాయణం విశిష్టత. అదీ రాముని పరిపాలనా ప్రత్యేకత. అదే.. ‘రామరాజ్యం’ పరమోత్కృష్టత.


పితృవాక్య పరిపాలనకోసం శ్రీరాముడు వనవాసానికి కొచ్చేడు. భరతుడు రాముడిని వెదుక్కుంటూ మందీ మార్బలంతో, పరివారంతో రాముడ్ని కలవడానికి వస్తాడు. భరతుడు రాముడు కలుసుకుంటారు. ఆ సందర్భంలో- భరతుడు రాజు కాబట్టి రాజనీతిజ్ఞతని, ఎన్నో రాజధర్మాలని శ్రీరాముడు భరతునికి చెప్తాడు.


రాముడు భరతునికి వివరించిన ఆ రాజ ధర్మాలను ఓసారి పరిశీలిద్దాం


1.  రాజ్యాన్ని పాలించే రాజు- దేవుడు లేడు, పరలోకం పర జన్మ లేదు. విశృంఖలత్వంతో ఇంద్రియములు ఏ రకంగా చెబితే ఆ రకంగా భ్రష్టుడేయ్య నాస్తికత్వాన్ని విడనాడాలి. 


2. ఆడిన మాట తప్పకూడదు. 


3. అసత్యాన్ని పలకరాదు. 


4. క్రోధము విడనాడవలెను. క్రోధమువల్ల అనరాని మాటలు మాట్లాడ్డంవలన పాపము వచ్చును. 


5. పెద్దలవలన పొరపాటు సంభవించినను తొందరపడి క్రోధము, కోపం తెచ్చుకోకూడదు. ఇంద్రియాలకు లొంగిపోకూడదు. 


6. వ్యసనాలకు బానిసైపోకూడదు. 


7. అలసత్వమును వదులుకోవాలి. అంటే సోమరితనాన్ని, మందబుద్ధిగా మత్తు మత్తుగా ఉండకూడదు. 


8.  నేను, చక్రవర్తి అనే అహంకారం ఉండకూడదు. తత్ఫలితంగా నేనే అధికుడ్ని అనుకుని జ్ఞానుల్ని, సిద్ధుల్ని దర్శించకుండా ఉండకూడదు. 


9. ఎప్పుడు చేయవలసిన పనిని అప్పుడే వెంటనే చేయాలి. తర్వాత్తర్వాత చేద్దామనే అశ్రద్ధ వదులుకోవాలి. 


10. రాజు ఎప్పుడూ అతి జాగరూకుడై ఉండి అప్రమత్తతతో మెలగవలెను. అప్పుడే రాచకార్యాలు సవ్యంగా సాగును. కాబట్టి మరపున కొనితెచ్చే ‘ప్రమాదము’ను వదులుకోవాలి. ఇవీ రాజు ఆచరించవలసినవి.. రాజు వదులుకోవలసినవీ. ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజు, పైన చెప్పిన వాటిలోని అవలక్షణాలను వదులుకుని సుగుణాలతో తను పాలన సాగించాలి.


ఇవీ సంక్షిప్తంగా శ్రీరాముడు భరతునికి చెప్పిన రాజధర్మాలు. రాజనీతిజ్ఞతలు. ఈ విధులను, విధానాలను, ధర్మాలను, కర్తవ్యాలను, బాధ్యతల్ని రాజు అనేవాడు మనసా వాచా కర్మణా త్రికరణశుద్ధిగా నమ్మాలి. ఆచరించాలి. అమలుచేయాలి. అమలు అయ్యేలా చూడాలి. ఆచరణలో రాజు సఫలీకృతుడు కావాలి. రాజ్యం సుభిక్షం కావాలి. సౌఖ్యవంతం కావాలి. సమృద్ధివంతం కావాలి. ప్రజలు సుఖ సంతోషాలతో భోగభోగ్యాలతో సిరిసంపదలతో తులతూగాలి. రామరాజ్యం నేపథ్యంగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా పాలకులు సంకల్పం చెప్పుకోవాలి. అప్పుడే శ్రీరాముడు అందించిన అసలు సిసలైన రామరాజ్యం మళ్లీ ఆవిష్కృతమవుతుంది.


  !🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

సేకరణ

No comments:

Post a Comment