Monday, March 14, 2022

బావిలోని నీరు !!

💫 బావిలోని నీరు !! 🎊
➖➖➖➖➖➖➖✍️

ఒకసారి, ఒక గ్రామపంచాయతీలో బహిరంగ న్యాయస్థానంలో ఒక సమస్యను పరిష్కరించడానికి పెద్దలు సమావేశమయ్యారు. కొంత దూరంలో, ఒక సాధువు ఎప్పటినుంచో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుని వుంటున్నాడు.

పెద్దల న్యాయస్థానం ఏ నిర్ణయానికి రాలేకపోవడం వలన, తమ సమస్య పరిష్కారం కోసం ఆ సాధువును సంప్రదించమని ఎవరో సూచించారు.

వారంతా సాధువు దగ్గరకు వెళ్లారు. అంతమందిని చూసి సాధువు వాళ్ళని ఏం కావాలని అడిగాడు.

"మహాత్మా, గ్రామంలో ఒకే ఒక బావి ఉంది. మేము ఆ బావిలో నీరు త్రాగలేకపోతున్నాము." అని గ్రామస్థులు సమాధానమిచ్చారు.

సాధువు, "ఎందుకు, ఏమి జరిగింది ? మీరు దాని నుండి నీరు ఎందుకు త్రాగలేకపోతున్నారు ?" అని అడిగాడు.

"మూడు కుక్కలు ఒకదానితో ఒకటి కొట్టుకుని బావిలో పడ్డాయి. అవి బయటకు రాలేక అందులో మునిగి చనిపోయాయి. ఇప్పుడు నీరు బాగా దుర్వాసన వస్తోంది, ఆ నీరు ఎలా తాగాలి ?" అని గ్రామస్తులు అన్నారు.

సాధువు "ఒక పని చేయండి, పవిత్రమైన గంగానది జలాన్ని ఆ బావిలో పోయండి" అని చెప్పాడు.

అలా ఎనిమిది నుంచి పది బకెట్ల గంగాజలం బావిలో పోసినా సమస్య అలాగే ఉండిపోయింది.

ప్రజలు మళ్ళీ సాధువు వద్దకు వెళ్ళారు. సాధువు, "సరే, మీరందరూ సమావేశమై భగవంతుని నామాన్ని జపిస్తూ, ప్రార్ధన చేయండి," అన్నాడు.

ప్రజలు‘అలాగే !’ అని, సాధువు సూచించినట్లు చేశారు. అయినప్పటికీ సమస్య అలాగే ఉంది.

ప్రజలు మళ్ళీ సాధువు వద్దకు వెళ్ళారు.

ఈసారి సాధువు "బావిలో కొన్ని సువాసన వచ్చే పదార్ధాలు వేయండి" అన్నాడు.

అది కూడా జరిగింది, కానీ ! సమస్య ఇంకా కొనసాగింది.

ఇప్పుడు ఇంక సాధువు స్వయంగా బావి వద్దకు వచ్చాడు.

ప్రజలు,"చూడండి స్వామీ, పరిస్థితి అలాగే ఉంది, మేం ప్రతిదీ ప్రయత్నించి చూసాం, పవిత్ర గంగాజలం పోశాం, ప్రార్థనలు, కీర్తనలు చేసాం, ప్రసాదం పంచాము, బావిలో సువాసనగల పువ్వులు, పదార్ధాలు వేసాం,ఇవన్నీ !"

సాధువు అయోమయంగా చూస్తూ అడిగాడు, "అన్నీ చేశారు, కానీ ఈ బావిలో పడి, చనిపోయిన మూడు కుక్కలను తొలగించారా ?"

గ్రామస్తులు, "అదేంటి, మీరు అలా చేయమని మాకు చెప్పలేదు కదా, మేం వాటిని బయటకు తీయలేదు, మిగిలినవన్నీ చేశాం, కానీ కుక్కలు ఇప్పటికీ బావిలోనే ఉన్నాయి !" అన్నారు.

సాధువు మొదట దిగ్భ్రాంతి చెందాడు, కాని ప్రశాంతంగా గ్రామస్తులకు ఇలా వివరించాడు… "నీటిలో పడి ఉన్న మూడు మృతదేహాలను బయటకు తీసే వరకు, ఎటువంటి బాహ్య చర్యలు ఎటువంటి ప్రభావం చూపవు, ముందుగా మీరు నీటి నుండి ఆ మురికిని బయటకు తీయాలి."

మన జీవితకథ కూడా అలాంటిదే. పల్లెటూరు వంటి మన దేహంలో… ‘కామం, క్రోధం, లోభం, అసూయ’ అనే అనేక జంతువులు పోట్లాడుకుని, ‘మనస్సాక్షి’ అనే బావిలో చెదపురుగుల్లా చిక్కుకుపోయాయి. అవి మెల్లగా మన మనస్సాక్షిని లోపలి నుండి తినేస్తున్నాయి.

ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే... ఈ తెగులు నుంచి బయటపడేందుకు మనం ఏం చేస్తున్నాం ?

మన జీవితాలను మెరుగుపరచు కోవడానికి బయటి నుండి చాలా కొత్త విషయాలను లోపలికి తీసుకుంటున్నాం, అయితే లోపల ఇప్పటికే కుళ్ళిపోయిన లేదా పేరుకుపోయిన వాటిని తొలగించడానికి మనం ఏమి చేస్తున్నాం ? దీని గురించి ఒకసారి ఆలోచిద్దాం.

♾♾♾♾♾♾♾♾♾

మనం మనస్సాక్షిని శుభ్రంగా ఉంచుకుంటే, బయట కూడా ప్రతిదీ స్పష్టంగా కనిపిస్తుంది, మన అంతరంగాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే, బయట ప్రతిదీ కూడా అందంగా అవుతుంది. ✍️

నా మనస్సాక్షిని ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నందుకు నేను కృతజ్ఞతతో ఉన్నాను.

🙏🇮🇳😷💉🎊🪴🦚🐍

సేకరణ

No comments:

Post a Comment