Monday, April 18, 2022

కథ: ఇల్లు సరిదిద్దుకో!

ఇల్లు సరిదిద్దుకో!

వైజాగ్ నుంచి బయలుదేరిన గోదావరీ ఎక్స్ ప్రెస్ రాజమండ్రీ చేరేసరికి పదిన్నర. అప్పటికే ఏసీ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో పక్కలు వేసేసుకుని నిద్రకుపక్రమిస్తున్నారు సువర్చలా, రామారావు గార్లు. అప్పుడు అడుగుపెట్టింది మెరుపుతీగలా ఆ అమ్మాయి. వెనకాలే తండ్రీ, తమ్ముడూ అనుకుంటా.. పెట్లు, బుట్టలూ పట్టుకుని ఎక్కి, గబగబా సీట్ల కింద సర్దేసారు. వారికి వెనకాల మూడేళ్ళ పాప, ఏడాది బాబునీ పట్టుకుని… ఆ అమ్మాయి తల్లనుకుంటా… గాభరాగా పిల్లలను సీటు మీద కూర్చోపెట్టి… కూతురికి ఏవో జాగ్రత్తలు చెప్తూనే , మిగిలిన వారితో పాటూ…కిందకు దిగిపోయింది. వెనకనే ఆ పిల్లలు “ అమ్మమ్మా! అమ్మమ్మా!”… అంటూ ఏడుపులు.

“ అంకుల్ ! నా పేరు స్వాతీ అండి. నాకు లోయర్ బెర్త్ కావాలి… పిల్లలతో పైకి ఎక్కడం ఇబ్బంది కదా!”…. అంటూ చాలా జబర్దస్త్ గా .. కనీస అభ్యర్ధన లేకుండా, డిమాండ్ చేస్తున్నట్టు అడుగుతుంటే…డెబ్భై యేళ్ళ రామం గారికి ఏం చెప్పాలో అర్ధమవలేదు.

“ కుదరదమ్మా! అంకుల్ కానీ, నేను కానీ పైకి ఎక్కలేము. నాకు ఆర్థ్రైటిస్, ఆయనకు మొన్ననే స్పైన్ సర్జరీ అయ్యింది. పైగా మేము పదే పదే బాత్రూమ్ కు వెళ్ళే అవసరం పడుతుంది. అన్ని సార్లు ఎక్కీ దిగలేం!”…. అంటూ సువర్చల ఖచ్చితంగా చెప్పేసింది.

ఆ అమ్మాయికి అప్పటికే కోపం వచ్చేసింది. “ మీరింత మీన్ గా ఎలా నో చెప్పేయగలరండి. ఇప్పుడు నేను పిల్లలతో ఎలా మేనేజ్ చెయ్యాలి ఈ రాత్రంతా? ఆ మాత్రం సర్దుకోలేరా?”… అంటూ కటువుగా ప్రశ్నిస్తుంటే… “ సర్దుకోలేమనే కదా చెప్తున్నాం!రెండు నెలల క్రితం రిజర్వేషన్ చేయించుకుంది లోవర్ బెర్త్స్ గురించే కదా!”… అంటూ ధీటుగా జవాబిచ్చింది సువర్చల.

స్వాతి ఫోన్ తీసి, కాల్ చెయ్యడం మొదలు పెట్టింది. “ జానూ! నువ్వొక ఇడియట్ వి. అప్పర్ బెర్త్ బుక్ చేసి, ఇక్కడ అడ్జస్ట్ చేసుకో అన్నావా… వీళ్ళెవరో చాలా సెల్ఫిష్ గా ఉన్నారు. తెగ పోజ్ కొడుతున్నారు బెర్త్ ఇవ్వడానికి!”… అంటూ చాడీలు చెప్పడం మొదలుపెట్టారు. అప్పటికే పిల్ల సువర్చల పక్క మీద సెటిల్ అయిపోయింది. పిల్లాడు వాళ్ళమ్మ కోసం ఏడుపు మొదలుపెట్టాడు. సువర్చలకు జాలే వేసింది.

“ స్వాతీ! బాబుకు చీరతో ఉయ్యాలలా కడదాం. పడుకుంటాడు. పాపా, నువ్వూ పైకెక్కెయ్యండి!”… అంటూ సలహా ఇచ్చింది. అలా అవ్వదని కాసేపు వాదించి… మొత్తానికి ఒప్పుకుంది స్వాతి. దానిక్కూడా సువర్చలే తన బేగ్ లోంచి కొత్త మెత్తని కాటన్ చీర , ఆయన కండువాలూ తీసి… రెండు బెర్తుల మధ్యా.. బాగా కిందకు వచ్చేలా… చక్కని కుదురైన ఉయ్యాలలా కట్టింది.

ఇంత చేస్తుంటే…ఆ అమ్మాయి మాత్రం ఫోన్ చూసుకుంటూ…ఉత్సవ విగ్రహంలా నిలబడింది తప్పా…… ఒక చెయ్యి వెయ్యాలన్న జ్ఞానం కూడా లేదు.

పక్క కేబిన్స్ వాళ్ళు ఈ గోలకు విసుక్కుంటున్నా… ఆ అమ్మాయి పట్టించుకోలేదు. ఆఖరుకి పదకొండున్నర అయ్యింది… మొత్తం అందరినీ సెటిల్ చేసేసరికి. ఆ చిన్నపిల్ల అమ్మమ్మతోనే పడుకుంటానని… సువర్చల బెర్తుని ఆక్రమించడంతో… సువర్చలకు ఆ పిల్లను పక్కన వేసుకోక తప్పలేదు. స్వాతి బేపూచీగా అప్పర్ బెర్త్ ఎక్కి సెటిల్ అయిపోయింది.

అంతటితో కధ పూర్తవలా. అక్కడ నుండి ఫోన్ పర్వం. ముందు వాళ్ళ అమ్మా, నాన్నలకి ..”అతి కష్టం మీద అడ్జస్ట్ అయ్యాము… నేనూ, పిల్లలం!”… అంటూ చెప్పీ, అత్తగారి మీద చాడీలు, మొగుడు అసమర్ధత, టైలర్ నుండి తీసుకోవలసిన డ్రస్సులు, అన్నగారి పెళ్ళి ఫోటోలు…లాంటి వివిధ సబ్జెక్టుల మీద అరగంట పైగా కబుర్లు చెప్పీ, ఆఖరికి మరో పై బెర్త్ అబ్బాయి…” మేడమ్! కాస్త మెల్లగా మాట్లాడుకోండి!”… అంటూ గట్టిగా చెప్పాకా… ఆ కాల్ మూసింది.

మరో గంట పోయాకా… ముసుగేసుకుని మరో కాల్. ఈసారి శాల్తీ పేరు రేవంత్. బహుశా కొలీగ్ అయివుంటాడు. ఓ ఇకఇకలూ పకపకలూ, స్వీట్ నథింగ్స్, అతని కొత్త గర్ల్ ఫ్రెండ్ గురించి ఈవిడ ఆరాలు, అలకలూ, ఇన్ సెక్యూరిటీలూ… మధ్యమధ్యలో స్వీట్ ఓల్డ్ బేంగుళూర్ బ్లూస్ తలుచుకుంటూ….ఫలానా రోజు ఫలానా ఇటాలియన్ రెస్టారెంట్లో కలుస్తానని వాగ్దానాలు…!

ఎంత చెవులు మూసుకుందామన్నా సువర్చల చెవిలో ఆ మాటలన్నీ పడుతూనే ఉన్నాయి.. “ ఏంటి ఈ అమ్మాయి మనస్థత్వం. ఓ పక్క జానూ అంటూ భర్తతో కబుర్లూ, పురమాయింపులూ చేసింది. మళ్ళీ ఈ రేవంత్ తో సరస సంభాషణలు. ఎంత ప్రమాదకరమైన ఆటలు ఇవన్నీ. కాపురాలు కూల్చుకునే పనులు!”… అనుకుంటూ ఆలోచిస్తూ… ఎప్పటికో నిద్రపోయింది. కరెక్ట్ గా మూడున్నరకు పిల్లాడు ఉయ్యాలలోంచి ఏడుపు మొదలు పెట్టాడు. సువర్చల లేచి, స్వాతిని కుదుపుతూ… నిద్రలేపడానికి ప్రయత్నించింది. నిజంగా నిద్రో, మరి నటనో… ఆ అమ్మాయి చచ్చినా లేవలేదు.

తిట్టుకుంటూనే… లైటు వేసి… డైపర్ బేగ్ తీసి… పిల్లాడికి పాలసీసా నోట్లో పెట్టి, డైపర్ మార్చి, మళ్ళీ పడుకోపెట్టింది. ఈలోపున పిల్ల ఆకలంటే ఓ నాలుగు బిస్కెట్లు చేతిలో పెట్టి, అటూ ఇటూ పారిపోకుండా కాపలా కాస్తూ కూర్చుంది. రామం గారు అదృష్టవంతులు. హియరింగ్ ఎయిడ్ తీసేసి.. హాయిగా పడుకున్నారు. తాపత్రయమంతా ఈవిడకే పాపం!

తెల్లవారి ఆరింటికల్లా స్వాతికి జానూగారి నుండి అలారం కాల్ వచ్చేసింది. చకచకా లేచిపోయి, తల దువ్వేసుకుని, మొహానికి టచప్ ఇచ్చి, లిప్స్టిక్ పులిమేసుకుని… పెట్టెలు, బుట్టలూ ఒకటొకటీ గుమ్మం దగ్గరకు చేరేసింది. సికింద్రాబాదు స్టేషన్ రావడమేంటి… పిల్లకు చెప్పులు తొడిగేసి, పిల్లాడిని ఉయ్యాలలోంచి లేపేసి, భుజాన వేసుకుని… టకటకలాడుతూ నడిచి వెళ్ళిపోయింది.

రాత్రంతా తన పిల్లలను కనిపెట్టుకుని ఉండి, అంత సాయం చేసిన ఆ దంపతులకు కనీసం తేంక్స్ కూడా చెప్పని కుసంస్కారం ఆ అమ్మాయిది. సువర్చలకు ఆ అమ్మాయి పొగరుబోతు తనానికి అసహ్యం వేసింది. కంపార్ట్మెంట్ ఖాళీ అయిపోయింది. ఉయ్యాలకు వేసిన ముడులు బాగా బిగుసుకుపోయి… ఇప్పడానికి రావడం లేదు. ఏమీ చెయ్యలేక… అక్కగారు పెట్టిన ఆ కొత్తచీర అలాగే వదిలేసి… ఈసురోమంటూ దిగారు సువర్చలా, రామారావుగారు.

అప్పటికే సామాన్లన్నీ కూలీకి అప్పచెప్తున్నాడు స్వాతి భర్త “ జానూ!”… ఒక చేత్తో పిల్లాడిని ఎత్తుకుని, మరో చేత్తో పిల్లను సంభాళిస్తూ. ఈవిడ మాత్రం… క్వీన్ విక్టోరియాలా స్టైల్ గా బేగ్ తగిలించుకుని… రాత్రంతా పిల్లలతో ఎన్ని ఇబ్బందులు పడిందో, అస్సలు నిద్రలేక ఎంత తలనొప్పిగా ఉందో, ట్రైన్ లో ముసలాడు బెర్త్ ఇస్తానని ముందుకొచ్చినా… ఆ ముసల్ది ఎలా అడ్డుపుల్ల వేసిందో… కథలా వినిపిస్తోంది అతనికి. పాపం మహానుభావుడు ఓపిగ్గా వింటూ.. “ సోరీ రా సోనూ!ఫ్లయిట్ బుక్ చెయ్యాలిసింది!”…. అంటూ సంజాయిషీలు ఇచ్చుకుంటున్నాడు.

వాళ్ళ వెనకాలే దిగిన సువర్చలకు … ఆ మాటలు చెవిన పడి…ఒళ్ళు మండిపోయింది. సాచిపెట్టి ఒక్కటిద్దామన్నంత కోపం వచ్చింది. ఇంతలో చిన్నపిల్ల.. “ అమ్మమ్మా!”… అంటూ వచ్చి సువర్చల చెయ్యిపట్టుకుని,” డాడీ! నేను ఈ అమ్మమ్మ పక్కనే పడుకున్నా!”… అంది.

సువర్చల ఒక్క క్షణం వేస్ట్ చెయ్యలేదు. స్వాతీ వాళ్ళాయన్ని సమీపించి… “ ఓ బాబూ! నువ్వేనా రేవంత్ అంటే! రాత్రంతా స్వాతి నీ పేరే కలవరిస్తూ! ఫోన్లో కబుర్లు తెగ చెప్పిందిగా! ఉంటానయ్యా రేవంత్! పిల్లలు జాగ్రత్తమ్మా!”… అంటూ చెప్పాలనుకున్నది చెప్పేసి… వడివడిగా భర్త వెనుక అడుగులేసింది! స్వాతి మొహంలో కత్తివాటుకు రక్తం చుక్కలేదు .

వెనక నుంచి మాటలు వినిపిస్తున్నాయి. “ రేవంత్ అంటే… వాడేనా… మీ ఆఫీసులో మన పెళ్ళికి ముందు ప్రపోజ్ చేసాడన్నావు…నీకు ఇంట్రస్ట్ లేదంటే అమెరికా వెళ్ళిపోయాడన్నావ్!…మరి వీడెవడూ...” … అంటూ జానూ జనార్ధన్ అందుకున్నాడు. “ అయ్యో జానూ! ఆ మెంటల్ది అన్నీ అబద్ధాలు చెప్తోంది. నాకు పిల్లలతోనే సరిపోయింది రాత్రంతా…”… అంటూ స్వాతి ఉక్రోషపు జవాబులూ!

“ తప్పు చేసానా…రేవంత్ ప్రసక్తి తెచ్చి! లేదు ! ఈ అమ్మాయికి జీవితంలో భయభక్తులు లేవు, డిసిప్లిన్ లేదు. మొరాలిటీ లేదు. ఒక తప్పుడు అడుగు జీవితాల్లో ఎలాంటి అఖాతాలు సృష్టిస్తుందో గ్రహించని డబుల్ స్టాండర్డ్స్ లో బతుకుతోంది. చక్కని భర్తా, పిల్లలతో ఎంతో హాయిగా ఉండక… వెధవ సాహసాలు చేస్తోంది. ఆమె భర్తకు తెలియాలి కొంతయినా. కనీసం ఇల్లాలిని నయానో భయానో చెప్పుకుని సరిదిద్దుకుంటాడు!”…. అనుకుంటూ స్టేషన్ బయటికొచ్చి…కార్లో కూర్చుంది సువర్చల.

ధన్యవాదాలతో
ఓలేటి శశికళ.

సేకరణ

No comments:

Post a Comment