Tuesday, April 19, 2022

జాతీయ స్థాయి ప్రేమ లేఖల పోటీల్లో విజేత దండమూడి శ్రీచరణ్, బహుమతి పొందిన స్వగతం (ప్రేమలేఖలు)

స్వగతం
(ప్రేమలేఖలు)
----------------
ఎట్లా రాస్తానంటావూ నీకు లేఖ?రాయకండా ఎలా వుండగలనో అది అడుగు!ఇన్నేసి రాత్రులు నిదురమాని నీ తలపుల్లో విహరిస్తో వుంటానుగా!
ఎలా రాయకుండా వుండగలను?
ఈ పూలు చూడు.అవి పిల్ల తెమ్మెరలు వొచ్చి తమలోని మరందాన్ని మూర్కొనాలని,తమ లావణ్యాన్నీ,పరిమళాలనూ వెదజల్లుతో వుంటాయి.ఈ వెన్నెలను గమనించావా?ప్రేమికుల పరస్పర కాంక్షను మరింత గాఢపరచేందుకు అది త్వర త్వరగా నేల పైకి ప్రసరిస్తోంది.ఈ సెలయేరు వుందే!కడవలతో తమ వద్దకు వొచ్చి నీళ్లు కొనిపోయే పడతుల పాదాలను స్పృశించాలని వడివడిగా ప్రవహిస్తోంది.అచ్చం అట్లాగే నేనూ నిదురమాని మరీ నీ కొరకై యోచిస్తో వుంటానుగా.. ఎట్లాగ రాయాలి నీకు లేఖ అని!
నిన్న ఎవరో పాంథుడు, నేను మేల్కొని నా గదిలో రాసుకుంటుండగా,వీధిలోంచి వెళుతున్నాడు.దూర దేశంలోని తన ప్రేయసిని తలపోస్తో,బిగ్గరగా ఏదో పాడుకుంటో వెళుతున్నాడు.ఆ చీకటిలో గమనించలేదు గానీ,అతని ఆ కళ్ళు ఎంత తన్మయమై వుండి వుంటాయి--తన ప్రేయసి తలపులతో!అతని గొంతు నిండా ఎన్నడు చేరుకొందునో తన ప్రియతమని అనే కాంక్ష నిక్షిప్తమై వున్నది. మరి నేను నీకు లేఖ రాయకుండా ఎలా వుండగలను!
ఈ ఆకుల సందులలో పరాచికాలాడుతో సవ్వడి చేసే గాలి దోబూచి కన్నప్పుడూ,లతాంతాలపై కాంక్షతో వాలే భ్రమరం ఝంకారం విన్నప్పుడూ,ఈ తరువుల శాఖలపై కూర్చొని ముచ్చటలాడే గువ్వల జంటను వీక్షించినప్పుడూ,ఇక అన్ని వేళలా నీ తలపులు వేధిస్తోండగా,ఎలా వుండగలను నీకు లేఖ రాయకుండా!
నా లేఖ చదువుకొని,ఓ పిచ్చీ!నువ్వు రాసేవన్నీ పిచ్చి రాతలేనంటూ నవ్వేస్తావు.నా రాతలు నీకు అర్ధం కావూ?ఇంతగా నీ పాదాల చెంత పరిచిన నా హృదయాన్ని అలవోకగా నెట్టేస్తో,"నీ అంతరంగం ఏవీ నాకు అస్సలు అర్ధం కాదు"అని విసుక్కోవూ!అట్లా అయితే,నా రాతలు మాత్రం ఎలా బోధపడతాయి!
అవును,నేను సాగరాల కావల,పగడపు దీవులలోని మణులనూ,మరకతాలనూ తెచ్చి నీ ముంగిట రాశిగా పోయడం లేదు.కేవలం నా ఆంతర్యంలోని నీపై గల కాంక్షను అక్షరాలుగా నీ సందిట రాసి పోస్తున్నాను!
సరేలే,నేను నా హృదయంలో అనంతమైన నీ సౌందర్యంపై నాకు గల ఆపేక్ష నీకు అర్ధమయే క్షణాల కోసం ఇట్లాగునే వేచి చూస్తాను.
నీ కొరకై వేచిచూస్తాను!!
--- నీ శ్రీ
--- దండమూడి శ్రీచరణ్
9866188266

సేకరణ

No comments:

Post a Comment