Friday, April 15, 2022

నేటి మంచిమాట. ఇంతకీ అదృష్టం అంటే ఏమిటి?

నేటి మంచిమాట.

లోకంలో ‘అదృష్టవంతుణ్ని చెడగొట్టేవారు లేరు. దురదృష్టవంతుణ్ని బాగు చేసేవారు లేరు’ అనే సామెత వినిపిస్తుంటుంది. ‘నా అదృష్టం బాగాలేదు. దేవుడు నన్నిలా చేశాడు. మీ అదృష్టం బాగుంది’ ఇలాంటి మాటలూ వినిపిస్తూ ఉంటాయి. ఇంతకీ అదృష్టం అంటే ఏమిటి?
‘అదృష్టం’ అంటే దృష్టం కానిది అని అర్థం. అంటే కనిపించనిది. మనం చేసే పని కనిపిస్తుంది. దాని ఫలితం కనిపించదు. కర్మఫలాలను.. వాసనలు అనే పేరుతో పిలుస్తారు. ఈ వాసనలకే అదృష్టం అని పేరు. విత్తనం వేస్తాం. దాని ఫలం చెట్టు రూపంలో ఉంటుంది. బావి తవ్వుతాం, దాని ఫలితం జల రూపంలో ఉంటుంది. వ్యాపారం చేసినప్పుడు.. లాభనష్టాల రూపంలో ఫలితం ప్రాప్తిస్తుంది. కర్మ చేసిన వెంటనే ఫలం కనిపించదు. కొందరు ఏ పని చేసినా, దాని ఫలం వెంటనే అనుభవంలోకి రావాలని భావిస్తూ ఉంటారు. ఉదాహరణకు పిల్లల పెండ్లి చేసిన తర్వాత హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చని, ప్రశాంతంగా ఉండొచ్చని తల్లిదండ్రులు భావిస్తారు. కానీ, వైవాహిక ఫలం ఆ వధూవరులకే కానీ, తల్లిదండ్రులకు కాదు.
ప్రపంచంలో సత్కర్మను యజ్ఞంతో పోలుస్తారు. యజ్ఞఫలాన్ని కోరేవాళ్లు ఉన్నారు. యజ్ఞం చేయాలి కానీ, దాని ఫలాన్ని ఆశించరాదనే వాళ్లూ ఉన్నారు. అయితే, ఏ పనిచేసినా దాని ఫలం అనుభవించక తప్పదు. కాస్త అటూయిటుగా చేసిన కర్మ తాలూకు ఫలాన్ని అనుభవించాల్సిందే! కానీ, యోగులు ఫలాన్ని ఆశించకుండా సత్కర్మలు చేస్తారు. వారినే నిష్కామ కర్మయోగులు అంటారు. కర్మఫలాన్ని కోరుకోని వారిని ఆ కర్మలు అంటుకోవు. వారికి కర్మఫలాలు ఎలాంటి వాసన రూపంలో ఉండవు. అంటే వారు అదృష్టాన్ని లెక్కచేయరు. కర్మఫలాన్ని కోరేవాడే ‘అదృష్టవంతుడు’. అయితే, కర్మఫలాన్ని ఆశించనివాడు ‘దురదృష్టవంతుడు’ ఎప్పటికీ కాడు. అతను కర్మఫలాలను ఆశించడు. ఫలాలను అనుభవించాలని కోరుకోడు. అలాంటి వారికి జన్మలు ఉండవు.
అదృష్టం గొప్పదేమీ కాదు. అదృష్టవంతులు అని భావించేవాళ్లు జన్మలు ఎత్తక తప్పదు. ఎంతో అదృష్టం ఉంటేగానీ మానవ జన్మ లభించదు అని పెద్దలు చెప్పే మాట సత్యవాక్కు. కొండంత అదృష్టం చేసుకుంటే దక్కిన మానవజన్మను మళ్లీ అదృష్ట-దురదృష్టాల చట్రంలో పడదోసి మరో జన్మను పొందడానికి వారధిగా మార్చుకోవడం అవివేకమే అవుతుంది. అదృష్టవంతుడికి మరో ఉన్నతమైన జన్మ లభిస్తుందేకానీ, మోక్షం ఎప్పటికీ రాదు. అదృష్టానికి, మోక్షానికి సంబంధం లేదు. అలాగే కర్మఫలాలకు, మోక్షానికి కూడా ఏ సంబంధం లేదు. కర్మఫలాలను సంస్కార రూపంలో పొందినంత కాలం జన్మలు ఎత్తాల్సి వస్తుంది. అందుకే యోగులు జ్ఞానులై కర్మఫలాల నుంచి విముక్తిని కోరుకుంటారు. అప్పుడే వాళ్లకు దుఃఖం నుంచి ముక్తి లభిస్తుంది.
అవివేకాన్ని బట్టి రాగద్వేషాలు, వాటిని బట్టి ప్రవృత్తులు (పనులు), వాటిని అనుసరించి జన్మలు సంప్రాప్తిస్తాయని దర్శనకారుల అభిమతం.
ముక్తి అంటే ‘ఏదో పొందడం’ కాదు. విడివడటం. దేని నుంచి విడివడాలి? అంటే దుఃఖం నుంచి! దుఃఖం జన్మను అనుసరించి ఉంటుంది. అందుకే జన్మ, దుఃఖ, జరా, వ్యాధుల నుంచి దూరంగా ఉండటానికి నిష్కామ కర్మలు అనుసరిస్తారు. పనులు చేసినప్పుడు వాటి ఫలాలు సంస్కార రూపంలో ఉండి, ఆయా జన్మల రూపంలో భగవంతుడి ఆదేశానుసారం సుఖదుఃఖాలను మనతో అనుభవింపజేస్తాయి. అందుకే దుఃఖ పూరితమైన ప్రపంచాన్ని ఆశ్రయించకుండా, ఆనంద స్వరూపుడైన పరమాత్మను ఆశ్రయించాలని ధర్మగ్రంథాలు ఉద్బోధిస్తాయి.
సుఖానుభవం కలిగినప్పుడు దాన్ని అదృష్టంగాను, దుఃఖానుభవం కలిగినప్పుడు దురదృష్టంగాను భావిస్తుంటాం. కానీ, అదృష్టవంతుడైనా, దురదృష్టవంతుడైనా కర్మలకు అనుగుణంగా పలు జన్మలు ఎత్తాల్సిందే, భవబంధాల్లో ఉండాల్సిందే! సారాంశం ఏమిటంటే, మనిషి అదృష్టవంతుడు కావడం కన్నా.. జన్మరాహిత్యానికే కృషి చేయాలని శాస్త్ర వచనం. మానవ ఉపాధి అందుకు సరైన మార్గం. ఈ జన్మలో అదృష్టం వరించి సుఖం కలిగితే పొంగిపోవడం, దురదృష్టం ఎదురై దుఃఖం కలిగితే కుంగిపోవడం వంటి ప్రలోభాలకు గురైతే జన్మజన్మల అదృష్టంగా దక్కిన మానవ జన్మను వృథా చేసుకున్నట్టే. యోగులు సుఖదుఃఖాలనే ద్వంద్వాలకు అతీతంగా ఉంటూ.. మోక్షతీరాలకు చేరుకునే ప్రయత్నం చేస్తారు.
అదృష్టం కొందరిని వెతుక్కుంటూ వస్తుందని చెబుతారు. దురదృష్టం కూడా అంతే! అదృష్ట, దురదృష్టాలకు కారణమైనవి ప్రారబ్ధకర్మలు. ఎప్పుడో చేసిన కర్మలవి. మనల్ని వెంటాడుతూ ఉంటాయి. మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. అప్పుడు వాటి నుంచి తప్పించుకోలేని స్థితి ఏర్పడుతుంది. మనిషి తెలిసి చేసినా, తెలియక చేసినా కర్మఫలం అనుభవించక తప్పదు. బుద్ధి జీవి కాబట్టి మానవ జన్మకే కర్మసిద్ధాంతం వర్తిస్తుంది. బుద్ధిమంతుడు అయిన మనిషి మంచి-చెడు తారతమ్యం తెలిసి పనులు చేయాలి. సత్య-అసత్యాలను గ్రహించి నడవాలి. ఫలం ఎలాంటిదైనా భయపడకూడదు. అసలు ఫలాపేక్ష లేకుండా ఉండాలి. అజ్ఞానంతో కూడిన ఆకాంక్ష కర్మలతో బంధిస్తుంది. కోరికలు లేకుండా చేసుకోవాలని చెప్పేది ఇందుకే! కానీ, కోరి పనులు చేసినప్పుడు మనం అదృష్టవంతులం గానీ, దురదృష్టవంతులం గానీ కాకతప్పదు.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment