Wednesday, April 27, 2022

దైవం మానుష రూపేణా

దైవం మానుష రూపేణా
➖➖➖

’మానుష రూపేణ’ అంటే దైవం ఎక్కడో లేదు మనిషి రూపంలోనే మన దగ్గర ఉంటుంది అని అర్థం..! మరి ఆ యొక్క దైవస్వరూపం ఎవరు అంటే .. మొదటగా మనను నవమాసాలు మోసి, జన్మనిచ్చిన తల్లి,(రెండవది మనం ఈ భౌతిక శరీరధారణకు కారణమైన 'తండ్రి'), మూడవది మన చుట్టూ ఆవరించి ఉన్న చీకట్లు, అజ్ఞానం తొలగించిన గురువు. చివరిగా నాలుగవది.. మనకు సేవకు అవకాశం కల్పించిన భగవత్ స్వరూపం అతిథి..!

అందుకే మన సనాతనధర్మం నినదిస్తుంది .. ‘మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ !’ అని.


మాతృదేవోభవ:

ఇలలో తల్లిని మించిన దైవం లేదు అన్న ప్రాథమిక సత్యాన్ని ప్రతిఒక్కరూ గుర్తెరగాలి.. డిల్లీకి రాజు అయినా తల్లికి బిడ్డే కదా..! అసలు భూలోకంలో అద్భుతం ఏదైనా ఉంది అంటే అది 'నువ్వే'.

మరి అటువంటి అద్భుతాన్ని సృష్టించిన తల్లికి మించిన వేరే దైవం ఏమి ఉంటుంది. తన రక్త మాంసంతో మనిషిని సృష్టించి, ప్రత్యక్షంగా కంటికిరెప్పలా కాపాడుతూ పెంచి, పోషించి, ప్రయోజకుడిగా సరిదిద్దడంతో తల్లిపాత్ర ప్రతి మనిషి జీవితంలోనూ సుస్పష్టం..! మరి అటువంటి తల్లి ఒకరోజు వృద్ధురాలు అయినప్పుడు ఆ యొక్క తల్లితో మనం ఎలా వ్యవహరిస్తున్నాం? మనకు మనం ఏం ఇచ్చి ఋణం తీర్చుకోగలం? తనకు స్వాంతన కలిగించడమే మనం తల్లి ఋణం తీర్చుకోవడం.. తల్లితో అమర్యాదగా వ్యవహరించకపోవడమే ఋణం తీర్చుకోవడం ! తల్లిని గౌరవించడమే.. తల్లికి అగ్రతాంబూలం..!!


పితృదేవోభవ:

తల్లి .. తండ్రి.. రెండుకళ్ళు ప్రతి మనిషికి. నిరాకార భగవంతునికి సాకార ప్రత్యక్షమే తండ్రి.. మన ఎదుగుదలకు అనుక్షణం ఆరాటపడుతూ.. జీవితంలో ప్రత్యక్షం పోరాడుతూ.. మన ఉన్నతికి బాటలు వేసిన అలుపెరుగని యోద్ధుడు ‘తండ్రి..!’ సమసమాజంలో మనకోసం గౌరవం, బాధ్యత, కర్తవ్యం, భద్రత, కీర్తి, వంశం, ప్రతిష్ట మొదలగు పదాలకు స్వరూపం నాన్న.

అందుకే ఒక మహాత్ముడు ఇలా అన్నాడు.. "ఎవరైనా ఒకరికి చేతులు జోడించి నమస్కారం పెడుతున్నాం అంటే ఆ యొక్క వ్యక్తి ఆ స్థాయికి ఎదగడానికి కారణం అయిన అతని తల్లి, తండ్రులకు మొదట నమస్కారం పెట్టాలి." కాని వారిని కన్న తల్లి తండ్రులు.. మరింత గౌరవనీయులు..! తల్లి తండ్రులను గౌరవించడమే .. అసలైన ఆధ్యాత్మికత. వారు శరీరాలను వదిలిన తరువాత విగ్రహాలు నిర్మించడం, ఫోటోలకు దండలు వేయడం, కర్మకాండలు ఆడంబరంగా నిర్వహించడం ముఖ్యం కానేకాదు. వారు జీవించియుండగా వారికి తోడుగా, నీడగా ఉండడమే అసలైన మన ధర్మం..!


ఆచార్య దేవోభవ:

మనతో ఏ మాత్రం రక్త సంబంధం లేకున్నా మన ఉన్నతి కోసం పై లోకాల నుండి దిగివచ్చిన.. మనలను గొప్ప జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడానికి కంకణబద్ధుడై, అపర భగవంతుడే ఆచార్యుడు .. ఇహ, పర జ్ఞానాన్ని మనకు ప్రసాదించి జన్మను సార్థకం చేసుకుని మహా భాగ్యాన్ని మనకు అందించిన గురువుకు సదా కృతజ్ఞుడై ఉండడమే 'ఆచార్య దేవోభవ'.


అతిథి దేవోభవ:

మనకు తల్లి తండ్రుల ద్వారా సంక్రమించిన సంస్కారాన్ని, గురువు ద్వారా అభ్యసించిన జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడానికి.. మనకి విశేష సేవకి అవకాశం కల్పించిన మహాత్ముడే 'అతిథి'. 'పంచుకుంటే పెంచబడుతుంది' అన్నది పరమసత్యం. అతిథి సేవ ద్వారానే మన జీవితంలో ప్రస్ఫుటం అవుతుంది. మనం ఎవరికైనా సేవ చేసే అవకాశం వస్తే.. సాక్షాత్ భగవంతుడికి సేవ చేస్తునట్లే .. అందుకే భగవాన్ శ్రీ సత్యసాయి అందరికీ బోధిస్తూండేవారు .. 'మానవ సేవయే మాధవ సేవ' అని .. ఇలా మనకు సేవకు అవకాశం కల్పించిన మన తోటి మిత్రులే అతిథి దేవుళ్ళు.

మానవ జన్మ తీసుకుని ఎవరైతే ధ్యానసాధన, అహింసపాలనలో ఉంటారో వారు మాత, పితృ ఋణం తీర్చుకున్నవారు అవుతారు. మరి ఎవరైతే ధ్యానప్రచారం, జ్ఞానప్రచారంలో సారధులౌతారో వారు గురు ఋణం తీర్చుకున్నవారు అవుతారు .. ప్రతివ్యక్తికి సేవచేస్తూ.. అందరిలో భగవత్ స్వరూపాన్ని దర్శించుతారో అతిథి ఋణం తీర్చుకున్నవారు అవుతారు. తన జన్మకు ఒక అర్థం, పరమార్థం సాధించుకున్న వారుగా.. ఆచంద్రార్కంగా .. ఆనందంలో జీవిస్తాడు

సేకరణ. మానస సరోవరం 👏

No comments:

Post a Comment