Wednesday, April 27, 2022

నేటి జీవిత సత్యం. మనిషి కంటే మృగాలే నయం.

నేటి జీవిత సత్యం.
మనిషి కంటే మృగాలే నయం.

ఎంత విజ్ఞానముండియు నేమిఫలము
మానవత్వము కోల్పోయి మనిషి నిలిచె
మానవుల కన్న మృగములే మంచివేమొ
ఇంతకన్నను వేరెద్ది ఎరుకపరతు!

🪴🌷ఒక అడవిలో పులి తరుముతుంటే ఒక వేటగాడు ఒక చెట్టు ఎక్కాడు. చెట్టు మీద ఎలుగుబంటుంది. హడలిపోయాడు. కాని ఎలుగుబంటు ఆ మనిషిపట్ల తన సాత్విక స్వభావం చూపెట్టి అతనికి అపకారం తలపెట్టలేదు. ఇంతలో పులి "ఎలుగుబంటూ ఆ మనిషిని నేను చంపి తినడానికి తరుముకొచ్చాను. వాణ్ణి కిందకు తోసెయ్యి” అంది. ఆ ఎలుగుబంటు " ఓ పులీ! ఈ చెట్టు నా నివాసం. ఇప్పుడా మనిషి నా అతిథి. అతన్ని రక్షించడం నా కర్తవ్యం” అంది.

🩸🌹కొంతసేపటికి ఎలుగుబంటు నిద్రపోయింది. అప్పుడు పులి ఆ వేటకాడితో “నాక్కావల్సింది ఆహారం. నీ ప్రాణం దక్కించుకోవాలంటే ఆ ఎలుగుబంటును కిందకు నెట్టెయ్యి. దాన్ని చంపుకు తింటాను" అంది. మరి మనిషి జంతువు కంటే విజ్ఞానవంతుడు కదా! పులి చెప్పిన ఉపాయం నచ్చింది. వెంటనే తన శక్తినంతా ఉపయోగించి. ఆ ఎలుగుబంటును క్రిందికి నెట్టేసాడు. కాని అదృష్టవశాత్తూ క్రింది కొమ్మ చేతికి చిక్కడంతో క్రింద పడకుండా ఎలుగుబంటు మళ్ళీ పై కొమ్మకి ఎక్కేసింది.

🌴🍁అప్పుడు పులి "చూశావా! నువ్వు వాడికి ఉపకారం చెయ్యబోయావు. కాని వాడు నీకపకారం చెయ్యడానికి వెనుదీయలేదు. ఎందుకా కృతమ్నుని పట్ల జాలి చూపుతావు? తోసెయ్యి, కిందికి" అంది. అప్పుడా ఎలుగుబంటు "ఓ పులీ! వాడి సహజ స్వభావాన్ని వాడు చూపెట్టేడు. మా జాతి స్వభావాన్ని నేను మార్చుకోను, నీ దారిన నువ్వు వెళ్ళు" అంది.

🌻🌹విజ్ఞానం పెరిగేకొలదీ మానవుడు స్వార్థంతో మానవత్వానికి సహజమైన నైతిక విలువలను కోల్పోతున్నాడు. ఈనాడు మానవుని కంటే అడవి మృగాలే మంచివేమో అనిపిస్తుంది.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment