Thursday, April 14, 2022

నేటి జీవిత సత్యం. కర్మ... ముక్తి...!!

నేటి జీవిత సత్యం. కర్మ... ముక్తి...!!

కర్మ అంటే చర్య, మీరిక్కడ కూర్చునే ఉన్నా నాలుగు రకాల కర్మలు చేస్తునే ఉన్నారు.
మీ శరీరం ఏదో చేస్తున్నది, లేకపోతే మీరు జీవించి ఉండరు.
అదేవిధంగా మీ బుద్ధి, మీ భావోద్వేగాలు, జీనవశక్తులు ఏదో ఒకటి చేస్తుంటాయి...
మీ జీవితంలోని ప్రతి క్షణంలోనూ ఈ నాలుగూ పనిచేస్తూనే ఉంటాయి...
మేలుకుని ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు కూడా 99% కర్మలు ఎరుక లేకుండానే జరుగుతున్నాయి. కాని ఈ చర్యల అవశేష స్మృతి మీలోనే నిర్మితమవుతూ ఉంటుంది...

ఉదాహరణకు..
మీరు ఒక చోటి నుండి మరొక చోటికి నడుస్తున్నారనుకోండి అక్కడ పది రకాల వాసనలు ఉండవచ్చు.
వాటిలో ఏదో ఒకటి తీవ్రంగా ఉన్నదాన్ని మాత్రమే మీరు గమనిస్తారు.
కాని మీ నాసిక రంధ్రాల్లోకి వెళ్లిన పది వాసనలూ మీలో రికార్డయి పోతాయి.
మానవ వ్యవస్థ ఒక అద్భుత యంత్రం. మీకా చైతన్యం, స్పృహ ఉన్నా లేకపోయినా అది మాత్రం సర్వం గ్రహిస్తుంది, నిరంతరం రికార్డు చేస్తుంది.
ఈ జ్ఞాపకం మీద ఆధారపడే మీరు కొన్ని ధోరణులు పెంపొందించుకుంటారు.
ఈ ధోరణులకు సాంప్రదాయికమైన పరిభాష ‘వాసన’...

మీ సాఫ్ట్‌వేర్ ఎలా ఉంటే అలా మీరు ప్రవర్తిస్తారు, ఆచరిస్తారు, మీ జీవితాన్ని అనుభూతి చెందుతారు.
మీకున్న వాసనను బట్టి మీరు కొన్ని నిర్దిష్ట జీవన స్థితుల వైపు ప్రయాణిస్తారు.
“అది మీ కర్మ” అంటాం. దురదృష్టవశాత్తు కర్మను ఏదైనా పనికి శిక్ష గానో, బహుమతి గానో చూస్తున్నాం. కర్మ శిక్ష కాదు, బహుమతీ కాదు. మీరు జ్ఞాపకాన్ని నిర్మిస్తున్నారని దానికర్థం. మీకు అటువంటి ఎరుక లేకుండానే మీ జీవితపు ప్రతిక్షణాన్నీ లిఖిస్తున్నారు, సాఫ్ట్‌వేర్ రాస్తున్నారు. మీ సాఫ్ట్‌వేర్ ఎలా ఉంటే అలా మీరు ప్రవర్తిస్తారు, ఆచరిస్తారు, మీ జీవితాన్ని అనుభూతి చెందుతారు.

కర్మ అంటే జీవితమంతా మీరు నిర్మించుకున్నదే అని అర్థం. మీరు దాన్ని చేతనతో నిర్మించారా, ఎరుక లేకుండా నిర్మించారా అన్నదే ప్రశ్న. స్వర్గం నుండి ఎవరూ మీ జీవితాన్ని నడపడం లేదు.
కర్మ అంటే మీ జీవితాన్ని మీరు సృజిస్తున్నారు. మీరు మీ జీవితాన్ని మీకు తెలియకుండానే నిర్మిస్తున్నారని మీకు తెలిసినప్పుడు మీరు సాధ్యమైనంత చేతనగా ఉండడానికి ప్రయత్నించడం మీ వివేకానికి సహజం కాదా.. చేతన అనేది లైటు బల్బుకు వోల్టేజి లాంటిది. మీరా వోల్టేజీని పెంచితే దాని వెలుతురు మొత్తం అన్ని కనపడేలా చేస్తుంది. వోల్టేజీని తగ్గిస్తే కొద్దిగా మాత్రమే కనిస్తుంది. చేతనగా ఉండడం కోసం ప్రయత్నించడంలో ప్రయోజనం లేదు. మీ జీవిత శక్తుల్ని మీరు తీవ్రతరం చేస్తే మీలో చేతన ప్రజ్వలిస్తుంది.
తీవ్రత లేకపోతే మీరు కేవలం చేతన గురించి మాట్లాడం, చదవటం మాత్రమే చేస్తే, అది ఉపయోగం లేనిది.

కర్మను తుడిచి వేయడం...

మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, భారతీయ సంస్కృతిలో లక్ష్యం భగవంతుడు కాదు.
మన పరమ లక్ష్యం, గమ్యం, మనకు అత్యున్నతమైన విలువైనది ముక్తి లేదా మోక్షం. ప్రస్తుతానికి మీకు స్వర్గం అద్భుతమైనదేమో అని తోచవచ్చు,
కాని కొన్నాళ్లకు అది విసుగు పుట్టిస్తుంది. కాని.. మీరిప్పుడు స్వర్గంలోనే లేరనడానికి మీ వద్ద ఏదైనా రుజువు ఉందా.. మీరిప్పటికే స్వర్గంలో ఉన్నారు, కాని దాన్ని గందరగోళం చేసుకుంటున్నారు. మీరు తలచుకుంటే దివ్యత్వం అన్నిచోట్లా.. ఇక్కడా అంతటా ఉంటుంది.

ముక్తి అంటే ఈ జన్మ చక్రాన్ని భగ్నం చేయడం. మీరు ఈ చక్రాన్ని భగ్నం చేయదలచుకున్నారా.. లేదు. దరిద్రుడు మళ్లీ ధనికుడుగా, ఆరోగ్యవంతుడుగా, పొడవైనవాడుగా, మరింత అందగాడుగా, ఇంకేదైనా ఉంటే అంతకంటే మెరుగ్గా పుట్టాలనుకుంటాడు.

కేవలం జీవితంలో అన్నీ చూసిన వ్యక్తి మాత్రమే దాన్ని దాటి పోవాలనుకుంటాడు. ముక్తి అంటే కర్మ సంబంధమైన సమాచారాన్ని.. మనం పోగు చేసుకుంటున్నదాన్ని.. విడిచిపెట్టడం.
ఈ కర్మ జీవితాన్ని స్వాధీనం చేసుకొని దానిచుట్టూ ఒక శరీరాన్ని నిర్మిస్తుంది.

ఈ కర్మ సంబంధ సమాచారాన్ని మీరు విచ్చిన్నం చేయగలిగితే.. అప్పుడు లోపల ఉన్నది మీరా.. నేనా అనేది ఉండదు. అది కేవలం జీవం అంతే. ఇది సజీవ విశ్వం. దీనికొక పోలిక చెప్పాలంటే.. మీరొక సబ్బు బుడగను ఊదితే ఆ బుడగ నిజం. కాని బుడగ పగిలితే ఒక నీటి బిందువు మాత్రమే కింద పడుతుంది. తక్కిన బుడగ అదృశ్యమైపోతుంది.
బుడగలోని గాలి చుట్టూ ఉన్న గాలిలో కలిసిపోతుంది. కేవలం జీవితంలో అన్నీ చూసిన వ్యక్తి మాత్రమే దాన్ని దాటి పోవాలనుకుంటాడు.

ప్రాణం మీ లోపల మాత్రమే లేదు, వెలుపల కూడా ఉంది. అందుకే మీరు గాలి పీలుస్తారు, గాలి వదులుతారు. అది లేకుండా మీరు బతకలేరు. దాన్ని మీరు ప్రాణవాయువనండి మరొకటనండి ఏమన్నా అనండి. వాస్తవానికి మీరు ప్రాణం అంటున్నది సర్వవ్యాప్తి. అది ఎటువంటి సమాచారంతో ఇరుక్కుంటుందో దాని ప్రకారం ప్రవర్తిస్తుంది. దాన్నే మనం కర్మ అంటున్నాం. కర్మ సాఫ్ట్‌వేర్ లాంటిది. అది ప్రాణశక్తే కాని దాని సాఫ్ట్‌వేర్ వేరు. అందువల్ల అది పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తుంది. మీరు కర్మ సంబంధమైన సాఫ్ట్‌వేర్‌ను పూర్తిగా కూలదోస్తే ప్రాణం ఎక్కడికి పోతుంది.. ఎక్కడికీ పోదు.. అక్కడే ఉంటుంది. మీ సాఫ్ట్‌వేర్ మాత్రమే ఒక వ్యక్తి. మీరు దాన్ని ఎరుక లేకుండా రాస్తే అది అన్ని రకాల రూపాలూ దాలుస్తుంది. కొన్ని మీకు నచ్చవచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు. మీరు కర్మ సంబంధమైన సాఫ్ట్‌వేర్‌ని చేతనతో రాస్తే, మీరు కోరుకున్నదే సృష్టించగలుగుతారు

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment