Sunday, April 17, 2022

👏🥭- కృష్ణుడి తలనొప్పికి మందు

👏🥭- కృష్ణుడి తలనొప్పికి మందు
సద్గురు : ఒకసారి కృష్ణుడి పుట్టినరోజు నాడు, సంగీతం, నాట్యం ఇంకా బాణసంచాతో పెద్ద ఉత్సవం జరపాలని గొప్పగా ఏర్పాట్లు జరిగాయి. చాలామంది జనం వచ్చారు. కానీ కృష్ణుడు మాత్రం సంబరాల్లో పాల్గొనడానికి ఇష్టపడకుండా ఇంట్లోనే కూర్చున్నాడు. సాధారణంగా ఎలాంటి వేడుకైనా, నలుగురితో చేరడానికి కృష్ణుడు ముందుంటాడు. కానీ, ఆరోజు మాత్రం, ఎందుకనో ఆయన ఇష్టపడటం లేదు.
రుక్మిణి వచ్చి "స్వామి, ఏమైంది మీకు? ఏమిటిది?, ఎందుకని మీరు వేడుకలో పాల్గొనటం లేదు?" అని అడిగింది. “నాకు తల నొప్పిగా ఉంది", అన్నాడు కృష్ణుడు. ఆయనకు నిజంగా తలనొప్పి ఉందో లేదో మనకు తెలియదు. బహుశా ఉండి ఉండొచ్చు కానీ ఆయన నటించడంలో కూడా సమర్ధుడు.

"వైద్యుని పిలిపించండి", అన్నది రుక్మిణి. వైద్యులు వచ్చారు. కృష్ణుడికి ఆ మందు, ఈ మందు ఇవ్వడానికి ప్రయత్నించారు."ఇవన్నీ నాకు పనిచేయవు", అన్నాడు కృష్ణుడు. "మరి ఇంకేం చేద్దాం", అడిగారు జనం. ఆపాటికి చాలా మంది జనం వచ్చిచేరారు. సత్యభామ వచ్చింది. నారదుడు వచ్చాడు. "ఏమైంది? ఏం జరిగింది?". ప్రతి ఒక్కరూ కంగారు పడుతున్నారు. "కృష్ణుడికి తలనొప్పిగా ఉంది. మనమేం చేయాలి?" అని.

"నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు, ఎవరైనా మీ పాదాల దగ్గర నుంచి కొంచెం ధూళి తీసి నా తలమీద రుద్దండి. నొప్పి తగ్గిపోతుంది" అని కృష్ణుడు చెప్పాడు. అప్పుడు సత్యభామ "ఏమిటీ అర్థం లేని మాటలు ? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. కానీ నా పాదధూళి తీసి మీ తల మీద పెట్టటం మాత్రం చేయను. అలాంటివి చేయ తగని పనులు" అని అంది. ఇక రుక్మిణి కూడా "ఇది ఎలా చేయగలం? మహా పాపం..ఇది మనం చేయలేము" అంటూ ఏడ్చింది. అక్కడ ఉన్న నారదుడు కూడా "నేను కూడా ఇలాంటి పని చేయ దలుచుకోలేదు. నువ్వు సాక్షాత్తూ భగవంతుడివి. దీంట్లో ఏ రహస్యం ఉందో నాకు తెలియదు. ఇందులో దాగివున్నకుట్ర ఏంటో తెలీదు. నా పాదాల దగ్గర మట్టి తీసి మీ తల మీద పెడితే నేను నరకంలో మాడి మసైపోతాను" అని నారదుడు వెనుదిరిగాడు.

ఈ విషయం అంతటా పాకిపోయింది. ప్రతి ఒక్కరు భయపడ్డారు "మేము ఇలాంటి పని చేయలేము. ఆయనంటే ప్రేమే గానీ, ఇలాంటి పని చేసి నరకానికి పోలేము"అని. ఉత్సవం కృష్ణుడి కోసం ఎదురుచూస్తోంది, కానీ ఆయన మాత్రం తలనొప్పితో అక్కడే కూర్చున్నాడు.

ఈ వార్త బృందావనం చేరింది. కృష్ణుడికి తలనొప్పిగా ఉందని గోపికలకి తెలిసింది. రాధ తన పవిటచెంగు తీసి నేల మీద పరిచింది. గోపికలందరూ దానిమీద తీవ్రంగా నృత్యం చేశారు. వాళ్లు దాన్ని తీసి నారదుడికి ఇచ్చి "దీన్ని తీసుకెళ్లి, కృష్ణుడి తలచుట్టూ కట్టండి" అని చెప్పారు. నారదుడు ఆ వస్త్రాన్ని తీసుకెళ్లి కృష్ణుడి తలచుట్టూ కట్టగానే కృష్ణుని తలనొప్పి మటుమాయమైంది!

ఆయన ఎప్పుడూ తాను దేనికి ఎక్కువ విలువ ఇస్తారో స్పష్టం చేసేవారు. రాజులతో పాటు తిరిగినా, రాజ్యాలను తనకు కానుకలుగా ఇచ్చినా, ఆయన అవి తృణప్రాయంగా భావించేవారు. కానీ భక్తితో, ప్రేమతో చేసే పని మాత్రం ఆయనకు ఎంతో విలువైనది.

సేకరణ

No comments:

Post a Comment