🙏🕉🙏 ....... "శ్రీ"
🪷🪷 "52" 🪷🪷
🪷🪷 "కర్మ - జన్మ" 🪷🪷🪷
కర్మ క్షయానికి మరి కొన్ని మార్గాలు - 1
1. దైవారాధన:
"దైవారాధన ఎవరు ఎందుకు చేసినా దాని ఫలితంగా పూర్వ జన్మార్జిత దుష్కర్మలు క్షయం అవుతాయి. ఆ దైవారాధన ఏ రూపంలోనైనా ఉండచ్చు. జపం, పూజ, యజ్ఞం, వ్రతం, దేవాలయ సందర్శనం, క్రతువు... ఇలా శాస్త్రంలో చెప్పిన ఏ రీతిలో ఉన్నా ఫలం లభిస్తుంది."
"ఆది శంకరాచార్య ప్రశ్నోత్తర మణిమాలలో ఇలా చెప్పారు."
కిం కర్మ కృత్వా న హి శోచనీయం?
ఏ కర్మ చేస్తే విచారించక్కర లేదు? - శివకేశవుల పూజ చేస్తే విచారించక్కర లేదు.
2. పుణ్య క్షేత్రాల దర్శనం, దీక్షలు:
"తీర్థాటనకి వెళ్ళినప్పుడు పూర్వపు రోజుల్లో కాలి నడకనో, ఎద్దుల బళ్ళ మీదో వెళ్ళేవారు. వేళకి భోజనం ఉండదు. కౄర మృగాలుండే అడవులు దాటి వెళ్ళాల్సి వచ్చేది."
"కటిక నేల మీద శయనం. ఎలాంటి ప్రాపంచిక లాభం రాని, దైవం కోసం స్వచ్ఛందంగా పడే ఈ శారీరక కష్టాల వల్ల, కర్మ ఫలంగా అనుభవించాల్సిన రాబోయే శారీరక కష్టాలు రద్దవుతాయి అని పెద్దలు చెప్తారు."
"పూర్వకాలంలో తీర్థయాత్రల వల్ల ఈ అదనపు లాభం ఉండేది. ఇప్పుడు సౌకర్యాలు పెరిగి శరీరం అంతగా అలవదు. ఈ రోజుకీ మహారాష్ట్ర ప్రజలు ఏటా ఓ సారి కాలి నడకన పండరీపురానికి వెళ్తారు. దారిలో కటిక నేల మీద పడుకుంటూ వారు ఎంతదూరం అయినా ఇలా కాలి నడకనే గుంపులుగా వెళ్తారు. పుణ్య క్షేత్రాల దర్శనం వల్ల ఈ విధంగా శారీరకంగా అనుభవించాల్సిన దుష్కర్మల ఫలాలు రద్దవుతాయి."
"నాడి జ్యోతిష్యం చెప్పేవారు పాప పరిహారంగా కొన్ని పుణ్య క్షేత్రాలని సందర్శించమని చెప్పడం మనకి అనుభవమే."
శ్రీశైల శిఖరం దృష్ట్యా వారణాస్యాం మృతోధృవమ్ కేదారే హృదకం వీత్వా పునర్జన్మ న విద్యతే
- పద్మ పురాణం
భావం:-
శ్రీశైలం శిఖర దర్శనం వల్ల, కాశీలో మరణం వల్ల, కేదార క్షేత్రంలోని నీటిని తాగడం వల్ల పునర్జన్మ లేక ముక్తి ప్రాప్తిస్తుంది.
3. ఆథ్యాత్మిక దీక్షలు:
"ఇలాగే ఆథ్యాత్మిక దీక్షల్లో పడే శారీరక శ్రమతో ఎంతో దుష్కర్మ క్షయం అవుతుంది. అయ్యప్పమాల దీక్ష, ఆలాంటి కఠినమైన ఇతర దీక్షలు మన పాపాలని క్షయం చేస్తాయి. తమిళనాడులో గుళ్ళల్లో పెట్టే పొర్లు దణ్ణాలు, భగ భగ మండే నిప్పుల మీద నడక మొదలైనవి కూడా శారీరక కష్టంతో కూడిన, తద్వారా దుష్కర్మలని రద్దు చేసే దైవారాధనలే."
4. శారీరక సేవ:
"ఇతరులకి శారీరకంగా చేసే సేవ వల్ల కూడా కర్మ క్షయం అవుతుంది. వెంకయ్య స్వామి దీన్ని గురించి ఇలా అనేవారు."
"అయ్యా! చేతుల్లో గీతలు అరిగేలా పని చేస్తే సద్గురువు మీ గీతల్ని మార్చి గీస్తాడు.”
5. హిత కర్మ:
"ఆది శంకరాచార్య ప్రశోత్తర మణిమాలలో నిజమైన కర్మ ఎలాంటిదో ఇలా చెప్పారు. "సత్యం చ కిం భూతహితం సదైవః" యదార్ధమైన కర్మ ఏది? - "ఎల్లప్పుడు పరులకి హితం చేయడమే యదార్ధ కర్మ."
"ముఖ్యంగా మనవల్ల ఎవరికైనా అపరాధం జరిగితే వారికి మనం సదా హితాన్ని చేస్తూండాలి. అందువల్ల అతను మన అపరాధాలని మనసా విస్మరిస్తే, అది మనం చేసిన అపరాధానికి ప్రాయశ్చిత్తం అయి ఆ కర్మ తొలగుతుంది."
6. పంచశాంతులు:
"పాపపరిహారం కోసం "పంచశాంతులు" నిర్దేశించబడ్డాయి. అవి..."
2. జపం
3. మౌనం
4. పశ్చాత్తాపం
5. అన్నశాంతి
1. ఉపవాసం:-
"తీర్ధయాత్రలా ఉపవాసం కూడా శారీరక కష్టంతో కూడిన దైవారాధన. కష్టం పాప ఫలానుభవంగా వస్తుంది. కాబట్టి మనం స్వచ్చందంగా పాప పరిహారం కోసం చేసే ఉపవాసంతో అనుభవించే శారీరక కష్టం, ఆ మేరకి రాబోయే ప్రారబ్ద కష్టాలని తొలగిస్తుంది."
"వైష్ణవులకి ప్రతీ ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం ఓ ప్రధాన దైవారాధన. ద్వాదశి ఘడియలు వచ్చాకే వారు ఉపవాస దీక్షని విరమిస్తారు. మన పెద్దలు కూడా ప్రాయశ్చిత్తంగా శాస్త్రంలో రెండు ఉపవాస వ్రతాలని నిర్దేశించారు. అవి - కృఛ్ఛ్రము, చాంద్రాయణము.
🪷🪷 "53" 🪷🪷
🪷🪷 "కర్మ - జన్మ" 🪷🪷🪷
కర్మ క్షయానికి మరి కొన్ని మార్గాలు - 2
తాస్ర ప్రతిషేధః తస్మా త్ప్రాయశ్చిత్తమిత్యాచ్యతే
భావం:-
"ప్రాయ' అంటే, దోష సంపాదనం అని అర్ధం. 'చిత్తం' అంటే దాన్ని నివారించుకోవడం అని అర్ధం. 'ప్రాయశ్చిత్తం' అంటే దోషాన్ని నివారించుకోవడానికి చేసే కార్యక్రమం అని అర్ధం."
కృచ్చ వ్రతం:-
"ఈ వ్రతం ఆరంభించిన రోజునించి మూడు రోజుల దాకా మధ్యాహ్న సమయంలో పెద్ద నిమ్మకాయంత పరిమాణంలో ఇరవై ఆరు అన్నపు ముద్దలు తినాలి. ఉదయం రాత్రి ఏమీ తినకూడదు."
"తర్వాతి మూడు రోజులు సాయం కాలం మాత్రమే ముప్ఫై రెండు ముద్దలని, తర్వాతి మూడు రోజులు కోరకుండా లభించిన ఇరవై నాలుగు అన్నపు ముద్దలని తినాలి."
"ఆ తర్వాతి మూడు రోజులు కటిక ఉపవాసం ఉండాలి. ఈ విధంగా పన్నెండు రోజులు చేసే వ్రతాన్ని కృఛ్ఛ్ర వ్రతం అంటారు."
చాంద్రాయణ వ్రతం:
"చంద్రుని వృద్ధి క్షయాలని అనుసరించి ఆచరించే ప్రతం ఇది. ఇదీ ఉపవాసానికి సంబంధించిందే. ఈ వ్రతం అమావాస్య వెళ్ళిన తర్వాతి రోజు, అంటే శుక్ల పక్ష పాడ్యమి నించి ప్రారంభం అవుతుంది."
"పాడ్యమి రోజు కేవలం ఒకే ఒక్క అన్నం ముద్ద తినాలి. రెండో రోజు రెండు ముద్దలు, మూడో రోజు మూడు ముద్దలు, ఇలా పూర్ణిమ దాకా ప్రతీ రోజు ఒకో ముద్దని పెంచుకుంటూ తినాలి."
"అలా పౌర్ణమి నాడు పదిహేను ముద్దలు తిని, మర్నాటి నించి కృష్ణ పక్ష పాడ్యమి దాకా ఒకో రోజు ఒకో ముద్దని తగ్గించుకుంటూ తినాలి. అమావాస్య రోజు కటిక ఉపవాసం ఉంటే చాంద్రాయణ వ్రతం ముగుస్తుంది."
"పరస్త్రీ పొందు, శాఖాహార మాంసాహార భక్షణం చేయడం లాంటి పాపాలని పోగొట్టుకోడానికి ఈ రెంటినీ ధర్మ శాస్త్రంలో పెద్దలు ఏర్పాటు చేసారు."
"ఓ ప్రముఖ స్వామి ఆశ్రమంలోని ఒకరు, ఆ ఆశ్రమంలోని పరస్త్రీని అనుభవించిన కారణంగా, ఆ పాపాన్ని పోగొట్టుకోవాలన్న తపనతో ఈ చాంద్రాయణ వ్రతాన్ని స్వచ్ఛందంగా, రహస్యంగా చేసి తీవ్ర అనారోగ్యానికి గురైన ఓ ఉదంతం ఈ పుస్తక రచయిత దృష్టికి వచ్చింది."
"కాబట్టి, వయసు పైబడ్డవారు, బి.పి, షుగర్ లాంటి వ్యాధులు గలవారు ఎవరూ కూడా వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ వ్రతాన్ని చేయకూడదు."
"ఋషికేశ్ లోని ముని-కి-రేతిలో గల అతి ప్రాచీన ఆశ్రమం అయిన కైలాసఆశ్రమంలో చేరిన బ్రహ్మచారులు అనుమతి లేకుండా ఆశ్రమం దాటి బయటకి పోకూడదు."
"అలా వెళ్తే, ముఖ్యంగా రాత్రి బయటే ఉంటే వారిని గోమూత్రంతో స్నానం చేయించి, శుద్ధి చేసి కాని తిరిగి ఆశ్రమంలోకి అడుగు పెట్టనివ్వరు. ఈ నిబంధనని కొన్నేళ్ళ క్రితం దాకా కఠినంగా పాటించేవారు."
"పంచగవ్యములు" -: "అనగా గోవు పేడ, మూత్రం, పాలు, పెరుగు, నెయ్యిలని కలిపి తినిపించి కూడా ప్రాయశ్చిత్తం చేస్తారు. రాత్రి లేదా పగలు నీళ్ళల్లో మెడ దాకా ముణిగి ఉండి ఉపవాసం చేస్తూ గడపటం కూడా ఓ ప్రాయశ్చిత్తం. ఒకటుంది."
"జైన మతంలో "నిర్జరం" అనే తీవ్ర ప్రాయశ్చిత్తం ఒకటి ఉంది. కఠిన నిష్టతో అన్నాహారాలు మానేసి శరీరాన్ని శిధిలం చేసి దేహ త్యాగం చేయడమే నిర్జరం అనే ఈ ప్రాయశ్చిత్తం. మన పురాణాల్లో దీన్ని "ప్రాయోపవేశం" అంటారు."
"ఈ అన్ని ప్రాయశ్చిత్త పద్ధతులలో శారీరక కష్టాన్ని స్వచ్ఛందంగా అనుభవించి, తద్వారా కర్మఫలాన్ని స్వచ్ఛందంగా ముందే అనుభవించడం అవుతుంది."
"ఉద్దేశపూర్వకంగా జరిగిన పాప కర్మలకి ప్రాయశ్చిత్తం లేదని యాజ్ఞవల్క్యస్మృతి లో చెప్పబడింది (3-226)"
"అనాలోచితంగా జరిగినవి ప్రాయశ్చిత్తం ద్వారా పోవడం తేలిక. స్మృతులు రాసిన వారిలో ప్రాయశ్చిత్తం మీద ఏకాభిప్రాయం లేదు. కొందరు అవి పాపనిర్మూలనని చేయదని రాస్తే, మరి కొందరు చేస్తుందని రాసారు."
అజ్ఞానాత్‌స్ఖలితే దోషే ప్రాయశ్చిత్తం విధీయతే
- శాంతి పర్వం 36-41
భావం:-
ఉద్దేశపూర్వకంగా చేయబడిన దుష్కార్యాలు చాలా తీవ్రమైనవి. ఉద్దేశం లేకుండా అంటే యాదృచ్ఛికంగా చేయబడిన దుష్కార్యాలు తీవ్రములు కావు. వాటిని ప్రాయశ్చిత్తంతో నిరోధించవచ్చు.
"ఈ రోజు పంచశాంతులలో ఒకటైన ఉపవాసం గురించి తెలుసుకున్నాం."
No comments:
Post a Comment