Monday, July 4, 2022

కవిత: భిన్న దృక్కోణాలు! - దండమూడి శ్రీచరణ్

 *భిన్న దృక్కోణాలు!*

-----------------------------

---  _దండమూడి శ్రీచరణ్_


"నన్ను అర్థం చేసుకోవాలంటే నా చెప్పుల్లో నీ కాళ్ళు పెట్టి చూడు,"అని ఒకరు హాస్యంగా వ్యాఖ్యానించారు."నిన్ను నువ్వు తెలుసుకో," అని సోక్రటీస్ కు దివ్యవాణి ఉపదేశించింది.

అసలు ఒకరిని అర్థం చేసుకోవడమంటే ఏమిటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.మనకు తెలిసినవాళ్ళు మనకు అర్ధమయినట్లే అనిపిస్తారు.అట్లాగే మనకు మనం పూర్తిగా తెలుసు అనే ఆలోచనలోనే వుంటాము. అలాంటప్పుడు అర్థం చేసుకోవడమని ప్రత్యేకంగా చెప్పుకోవడమేమిటి అనే సందేహం వస్తుంది.అయితే ఇతరులను,మనలను మనం నిజంగా అర్థం చేసుకుంటున్నామా అనే ప్రశ్నకు కాదనే సమాధానం వస్తుంది.

మనం ఇతరుల ప్రవర్తనను మన ఆలోచనలు,అభిప్రాయాలు,అనుభవాల కోణంలోంచి మాత్రమే చూడగలము. అంతవరకే!అసలు వారి స్వభావం వాస్తవంగా,సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే వారిని లోతుగా పరిశీలించాలి.వారి ప్రవర్తనను,ప్రవర్తన వెనుక వున్న వారి అనుభవాలను,అభిప్రాయాలను, వారు జీవితాన్ని దర్శించే కోణాన్ని సమగ్రంగా తెలుసుకున్నపుడే,వారిని సంపూర్ణంగా అర్థం చేసుకోగలం.

ఒకరు ఒకలా ప్రవర్తిస్తున్నారు అంటే దాని వెనుక ఎన్నో కారణాలు, కారకాలు,ప్రేరకాలు ఎన్నో వుంటాయి. వాటిని ప్రత్యేకంగాను,పరోక్షంగాను పరిశీలించి, గ్రహించినపుడే ఒకరు అర్థం అవుతారు.ఇతరులను సహానుభూతితో అట్లా అర్ధం చేసుకున్నపుడే వారితో సజావుగానూ,సానుకూలంగానూ వ్యవహరించగల్గుతాము.అపుడే మానవ సంబంధాలు సమర్ధవంతంగా నెరుపగల్గుతాము.

అట్లాగే మన గూర్చి మనం తెలుసుకోవడమంటే అది అంత సులువు కాదు.మన గురించి మనం ఎక్కువగా,ఉన్నతంగా ఊహించుకుంటాము.మన లోపాలను మనం అసంకల్పితంగా కప్పిపెడతాము.అప్పుడు మనం ఆలోచించేది ,చేసేది అంతా సరిగానే మనకు తోస్తుంది.కానీ మనల్ని మనం స్వీయ విమర్శ చేసుకున్నపుడే మన లోటుపాట్లు అవగతమవుతాయి.అప్పుడే మనల్ని మనం సరిదిద్దుకొని,మరింత మెరుగ్గా వ్యవహరించగల్గుతాము.మనల్ని మనం సరిగ్గా బేరీజు వేసుకున్నపుడే,మన గూర్చి మనకు స్వీయ అవగాహన పెంపొందుతుంది.అప్పుడు ఇతరుల లోపాలను క్షమించి, వారి ప్రవర్తనను అర్ధం చేసుకుని,వారితో సానుకూలంగా వ్యవహరించగల్గుతాము.

అలాంటి దృక్పథం వల్ల మనం విలువైన జీవితాన్ని రూపొందించుకోగల్గుతాము.మెరుగైన మానవ సంబంధాలు ఏర్పరచుకొని,జీవితాన్ని సక్రమంగా గడపగల్గుతాము.

ఇదే సరైన,ఆరోగ్యకరమైన జీవనశైలిగా చెప్పుకోవచ్చు.

----  _*దండమూడి శ్రీచరణ్*_

9866188266

No comments:

Post a Comment