Tuesday, August 23, 2022

జ్ఞానాన్ని పొందడానికి *ముఖ్యమైన మూడు లక్షణాలను, ఆ జ్ఞానము పొందిన తరువాత కలిగే లాభాన్ని* వివరించాడు పరమాత్మ.

 జ్ఞానాన్ని పొందడానికి *ముఖ్యమైన మూడు లక్షణాలను, ఆ జ్ఞానము పొందిన తరువాత కలిగే లాభాన్ని* వివరించాడు పరమాత్మ. 

*1. శ్రద్ధ..*

ఏ కార్యం చేయాలన్నా శ్రద్ధ ముఖ్యం. ఒక్క జ్ఞానం సంపాదించడానికే కాదు ఏ పని చేసినా శ్రద్ధతో చేయాలి. ఏ కార్యము చేసినా శ్రద్ధతో చేస్తే ఫలితం చక్కగా వస్తుంది. పూజ చేసినా, విద్యాలయాలలో విద్యాభ్యాసం చేస్తున్నా, ఆఫీసులో పని చేసినా, వ్యాపారం చేస్తున్నా, వృత్తిపని చేస్తున్నా, చిన్నది కానీ పెద్దది కానీ ఏ పనికి అయినా శ్రద్ధ ముఖ్యము. పైగా చేసే పని మీద నమ్మకము విశ్వాసము ఉండాలి. అంతే కానీ అయితే అవుతుంది లేకపోతే లేదు అనే నిర్లక్ష్యం పనికిరాదు. వస్తుందో రాదో అనే సందేహము కూడా ఉండకూడదు. తప్పక సిద్ధిస్తుంది అనే నమ్మకంతో చేసే పని పరిపూర్ణము అవుతుంది. కాబట్టి శ్రద్ధ అంటే కేవలం చేసి పని మీద కుతూహలము కాదు. నేను చేసే పని నాకు మేలు చేస్తుంది. నా ఉన్నతికి తోడ్పడుతుంది. నా భవిష్యత్తును ఉజ్వలంగా చేస్తుంది అనే నమ్మకము, విశ్వాసము కలిగి ఉండాలి. దానినే శ్రద్ధ అంటారు.

*2. తత్వరః..*

తత్వరః అంటే తదేకనిష్ట ఏకాగ్రత, పట్టుదల, నిశ్చయాత్మక బుద్ధి. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగాచేయాలి. ఒకటి చెప్పి ఒకటి చేయడంవలన విరుద్ధ ఫలితాలు వస్తాయి ఎవరూ మనల్ని నమ్మరు. మనసు నిర్మలంగా ఉండాలి అప్పుడే ఏకాగ్రత కుదురుతుంది. కాబట్టి మానవులు ఏ పని చేపట్టినా ఏకాగ్రత ముఖ్యం. ఏకాగ్రతతో ఏ పని చేసినా అఖండమైన శక్తి లభిస్తుంది. అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుంది. కాబట్టి మనసును బయట ప్రపంచంలో ఉన్న విషయాల నుండి మరల్చి ఆత్మవిచారణవైపు తిప్పితే, ఆత్మజ్ఞానము సిద్ధిస్తుంది.

విద్యార్థులు చాలా మందికి చదివే చదువు మీద నిష్ఠ ఉండదు. ఏకాగ్రత ఉండదు. ఎదురుగా టివి. పక్కనే సెల్ఫోను. ( పురాణ కాలాల్లో ఋషుల ఏకాగ్రతను భగ్నం చేయడానికి రంభ, ఊర్వశి మొదలగు అప్సరసలను పంపేవాడని విన్నాము. ఈ రోజుల్లో, మానవుల ఏకాగ్రతను భగ్నం చేయడానికి ఇంద్రుడు స్మార్ట్ఫోన్ ను కనిపెట్టి మన మీదికి వదిలాడు.) అందులో facebook,whatsapp, instagraam, youtube etc.. ఇన్నిటి మధ్య ఏకాగ్రత కుదిరే అవకాశం లేదు. అందుకని ఇవి అన్నీ పక్కన పెట్టి ఏకాగ్రతతో చదివితే పాసు, ర్యాంక్ ఖాయం. కాని ఈ రహస్యం తెలుసుకోలేక క్వశ్చన్ బాంకుల మీద వేలకువేల ట్యూషన్లమీద ఆధారపడుతుంటారు. క్లాసురూములో చెప్పే పాఠం శ్రద్ధగా విని, ఇంటికి రాగానే దానిని ఏకాగ్రతతో మననం చేస్తే, తెలియని విషయాలను మరునాడు టీచరును కానీ లెక్చరరును గానీ అడిగి చెప్పించుకుంటే, అది మెదడులో శాశ్వతంగా రికార్డు అవుతుంది. పరీక్షలలో ఎంతో సాయపడుతుంది. మీ గురువులకు మీకు ఇంకా ఇంకా బోధించాలనే ఉత్సుకత కలుగుతుంది. అందుకే అందరికీ నిష్ఠ, ఏకాగ్రత అవసరం.

*3. ఇంద్రియ నిగ్రహము..*

ఇంద్రియములు ఎల్లప్పుడూ బయట ప్రపంచంలో విహరిస్తుంటాయి. ప్రాపంచిక విషయాలలో లీనం అయి ఉంటాయి. ఇంద్రియాలు చూసిన వాటి గురించి మనసు ఆలోచిస్తుంది. అప్పుడు మనసులో కోరికలు పుడతాయి. ఆ కోరికలు తీరడానికి మరలా ప్రయత్నం మొదలవుతుంది. మనసు చంచలం అవుతుంది. అటువంటప్పుడు ఏకాగ్రత కుదరదు. కాబట్టి ఇంద్రియ నిగ్రహము చాలా ముఖ్యము. ఇంద్రియ నిగ్రహము లేకపోతే ఆత్మజ్ఞానము అలవడదు. సాధకుడికి ఇంద్రియములు ప్రబల శత్రువులు. వాటిని నిగ్రహిస్తేనే గానీ సాధకుడు ఆత్మజ్ఞానాన్ని పొందలేడు.

ఈ ప్రకారంగా శ్రద్ధ, తదేకనిష్ఠ, ఇంద్రియనిగ్రహం అవలంబించి ఆత్మజ్ఞానము పొందితే కలిగే లాభం ఏమిటి అని ప్రశ్నించుకుంటే వచ్చేది ఒకటే సమాధానం, పరమశాంతి. ఈ రోజుల్లో మానవులకు లేనిది, కావాల్సింది అదే. ఎంత ధనం, భోగభాగ్యాలు, పదవులు ఉన్నా మానవునికి మనశ్శాంతి కరువయింది. అటువంటి వారు ఆత్మజ్ఞానంకోసం ప్రయత్నించాలి. పైవిధంగా ప్రయత్నిస్తే ఆత్మను గురించిన జ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం లభించిన వెంటనే పరమశాంతి లభిస్తుంది. అందుకే అచిరేణ అనే పదం వాడారు. అంటే అచిరకాలంలోనే పరమశాంతి లభిస్తుంది అని అర్థం. కాబట్టి బాహ్యప్రపంచంలో దొరికే వస్తువులతో కొంచెం సుఖం అనంతమైన దుఃఖం తప్ప మరేమీ దొరకదు. ఆత్మజ్ఞానం కలిగితే పరమశాంతి దొరుకుతుంది అని బోధించాడు పరమాత్మ.

🙏 *కృష్ణం వందే జగద్గురూమ్* 🙏 

No comments:

Post a Comment