Tuesday, August 23, 2022

సూక్ష్మంలో మోక్షం

 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
        సూక్ష్మంలో మోక్షం
          
మనం సాధారణంగా మోక్షం పొందాలని కోరుకుంటాం కాని దానికోసం భగవన్నామాన్ని జపించటం, సత్కార్యాలను ఆచరించటం చెయ్యం.అదేదో చాలా పెద్దది, దానిని సాధించాలంటే మనం ఎంతో ఎదగాలి అనుకుంటాం. 

కానీ ఈ సృష్టిలో చూస్తే పెద్ద పెద్ద ప్రాణులే త్వరగా బంధింపబడతాయి. ఒక పులినో, జింకనో బంధించినంత తేలికగా ఒక ఎలుకనో, చీమనో బంధించగలమా? 

అలాగే పెద్ద చేపలు తేలికగా వలలో పడతాయి కానీ ఎంత చిన్న చేప అయితే వలలోనుండి అంత తేలికగా తప్పించుకోగలుగుతుంది. 

అసలు "నేను చాలా పెద్దవాణ్ణి, లేదా గొప్పవాణ్ణి" అనుకోవడమే పెనుమాయ. 
అంతకు మించిన బంధనం ఏముంటుంది? నేను చాలా చిన్నవాడిని, భగవద్భక్తుల దాసానుదాసుడిని అనుకోవడమే మోక్షానికి దగ్గరి దారి.

’సురస’ పెద్ద నోటిలో చిక్కినపుడుగానీ, లంకలో రాక్షసులు త్రాళ్ళతో తనను బంధించినపుడుగానీ హనుమంతుడు సూక్ష్మరూపాన్ని ధరించే కదా ఆ బంధనములనుండి విడివడగలిగింది? 
"సర్వహీన స్వరూపోహం" అని పరమాత్మ తత్వాన్ని తేజోబిందూపనిషత్ నిర్వచిస్తోంది. 

"అణోరణీయాం" అయినవాడే "మహతోమహీయాం" కాగలడు. అయితే మానవుడు ఈ సత్యాన్ని గుర్తించలేక లేనిపోని అహంకారాన్ని తెచ్చిపెట్టుకొని "నా అంతటివాడు లేడు" అని విర్రవీగి చివరికి ఆ మాయకు బద్ధుడై అనేక జన్మలను ఎత్తుతున్నాడు. 

తన నిజస్థితియైన ఆత్మతత్వాన్ని గుర్తించిననాడు అదే ఆత్మతత్వం సర్వేసర్వత్రా వ్యాప్తమై ఉన్నదనే జ్ఞానం కూడా కలుగుతుంది. 

అప్పుడింక ఒకరు గొప్ప ఇంకొకరు తక్కువ అనే భావనే కలుగదు.

ఈ చరాచర సృష్టి అంతా పంచభూతాలతోనే నిర్మించబడినప్పటికీ వివిధ నిష్పత్తులలో వాటి వాటి కలయికవల్ల మనకు స్థూలంలో ఇన్నిన్ని వస్తుభేదాలతో కనిపిస్తోంది. ఈ స్థూల దృష్టి ఉన్నంతకాలం ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అనే భేదభావన తొలగదు. అదే మనం సూక్ష్మదృష్టితో చూస్తే సృష్టిలోని ప్రతి వస్తువూ, ప్రాణీ అణువులతోనూ, పరమాణువులతోనూ నిర్మితమైనవే కదా. మరి ఈ పరమాణువులన్నీ ఒకే విధమైన ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లతో ఏర్పడినవే కదా! ఇలా సైన్సు ప్రకారం చూసుకున్నా సర్వసమానత్వం మనకు గోచరిస్తుంది.

ఇక భక్తుడవై చూస్తే ఈ సమస్త సృష్టి పరమాత్మనుంచే వచ్చింది కదా? మరి అలాంటప్పుడు ఇక హెచ్చుతగ్గులకు తావెక్కడ? 

మరి జ్ఞాని దృష్టితో చూస్తే ఈ సర్వమూ తన(పరమాత్మ) స్వరూపమే. ఇలా ఏవిధంగా చూసినా సరైన పరిశీలన చేసినవాడికి హెచ్చుతగ్గులు లేవని అర్థమౌతుంది.

మానవుడు ఈ సూక్ష్మదృష్టిని అలవరచుకోలేక కేవలం స్థూల దృష్టితో మాత్రమే చూసి అహంకార మమకారాలకు లోనై బంధనాలను కొనితెచ్చుకుంటున్నాడు. 

సూక్ష్మదృష్టి, లేదా సూక్ష్మ భావన అంటే దేనికి అంటకపోవటం. "యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే! సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే" అని భగవద్గీత చెబుతోంది. 

ఆకాశం సర్వవ్యాపమై ఉన్నా దాని సూక్ష్మత్వం చేత దేనికీ అంటకుండా ఉంటోంది. నిజానికి ఆకాశంకన్నా పెద్దది విశాలమైనది ఈ సృష్టిలో ఏదీ లేదు కదా. అంత పెద్దదైనా దాని గుణం సూక్ష్మత్వం. అందుకే అది దేనిచేతా బంధింపబడదు. అలాగే దేహమంతా వ్యాపించియున్నా తన సూక్ష్మత్వం చేత ఆత్మ కూడా దేనికీ అంటదు, దేనిచేతా బంధింపబడదు.

ఇదే సూక్ష్మంలో మోక్షమంటే. బంధన లేకపోవడమే మోక్షం కదా! నిజానికి మన నిజస్థితి సదా మోక్షస్థితే. అయితే అట్టి సదాముక్తయైన ఆత్మను నేననే సూక్ష్మాన్ని గుర్తించలేక ఈ స్థూలదేహం నేననే భ్రమలోపడి మనం బంధితులం అయ్యామని తలపోస్తున్నాం, ముక్తిని కోరుకుంటున్నాం. శ్రీగురుదేవులు బోధించినట్లుగా "ముక్తి అనేది పొందేది కాదు. అది నీ స్వరూపమై/స్వభావమై ఉన్నది. నువ్వు చేయవలసిందల్లా దానిని గుర్తించడమే." దానికోసం మనం ఈ సూక్ష్మదృష్టిని అలవరచుకోవాలి. ఆథ్యాత్మికంగా ఎదగడం అంటే సమానత్వ దృష్టి సాధించడమే. సమదృష్టి కలవాడే పండితుడని, జ్ఞానియని భగవద్గీతలో అనేకమార్లు చెప్పబడింది.

నేలమీద ఉన్నవాడికి కొన్ని ఎత్తుగానూ, కొన్ని పల్లంగానూ కనిపిస్తాయి కానీ విమానంలో ఎంతో ఎత్తులో ఎగురుతున్నవాడికి ఈ భేదాలు తెలుస్తాయా? వాడికి క్రింద అంతా సమతలంగానే గోచరిస్తుంది. అలాగే ఆథ్యాత్మికంగా తక్కువ స్థాయిలో ఉన్నవాడే ఇంకా "నేను గొప్ప, నువ్వు తక్కువ" అని మాట్లాడుతాడు కానీ ఉన్నతిని సాధించినవాడు ఎన్నడూ ఈ తరతమ భేదాలు చూడడు. మనం కూడా ఉన్బతస్థిని పొంది మోక్షాన్బి సాధించాలి.

.🌷🌷🌷🌷 

No comments:

Post a Comment