🌺 నిజమైన జ్ఞాని 🌺
వేదాంతం ప్రకారం ఈ జగత్తు మిథ్య. ఒక కలలాగా అది కూడా అనిత్యం. పరమాత్మ కేవలం సాక్షిగా (ప్రక్కన నిలబడి చూసేవాడిగా) ఉన్నాడు. జాగ్రత్తు (మెలకువ), స్వప్నము (కల) సుషుప్తి (నిద్ర) అనే మూడు స్థితులకు అతడు సాక్షి. కల ఎంత నిజమో, మెలకువ కూడా అంతే నిజం.
“ఒక రైతు ఉన్నాడు. అతడొక నిజమైన జ్ఞాని. వ్యవసాయమే అతడికి జీవనోపాధి. వయస్సు మళ్ళిన తరువాత అతడికి లేకలేక ఒక కొడుకు పుట్టాడు. ఆ పిల్లవాడికి 'హరు” అని ముద్దుగా పేరుపెట్టుకున్నాడు. తల్లిదండ్రులకు హరు అంటే పంచప్రాణాలు. ఎందుకంటే అతడు లేకలేక పుట్టిన వంశాంకురం కదా! అంతేకాక ఈ రైతు తన పారమార్ధిక చింతనవల్ల గ్రామస్థులకు అందరకూ ప్రీతిపాత్రుడయ్యాడు.”
“ఒకరోజు ఈ రైతు పొలంలో పనిచేస్తున్నాడు. అతడి పొరుగింటివాడు వచ్చి 'హరు'కు కలరా వ్యాధి సోకిందని చెప్పి వెళ్ళిపోయాడు. రైతు వెంటనే ఇంటికి వెళ్ళి శక్తివంచన లేకుండా చికిత్స చేయించాడు. కాని ఫలితం లేకపోయింది. హరు చనిపోయాడు. ఆ రైతు భార్య, మిగిలిన కుటుంబసభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఏడుపులు, పెడబొబ్బలతో ఇల్లు నిండిపోయింది.”
“కాని రైతు ప్రవర్తన దీనికి విరుద్ధంగా ఉంది. ఇంట్లో ఏమీ జరగనట్లే
ప్రవర్తించాడు. భార్యను ఓదారుస్తూ ఏడ్చి ప్రయోజనం లేదని చెప్పి,
ఖననసంస్మారమంతా చేసి పొలంలో మిగిలిన పని చెయ్యడానికి వెళ్ళాడు. సాయంత్రం అతడు యథాప్రకారం ఇంటికి రావడం చూచి భార్య, “నీది ఎంత రాతిగుండె! పిల్లవాడు చనిపోయిన బాధలో మేమంతా ఇలా గుండెపగిలి ఏడుస్తూ ఉంటే, నీ కంటివెంట ఒక నీటిబొట్టెనా రాలలేదే?” అని ఆక్షేపించింది.
దానికి ఆ రైతు తన భార్యను చూచి, నాకు ఎందుకు ఏడుపు రావడం లేదో చెప్పమంటావా? గడిచిన రాత్రి నాకొక కల వచ్చింది. నేనొక రాజునైనట్లు నాకు ఏడుగురు కుమారులున్నట్లు కలగన్నాను. ఆ రాజకుమారులు అందాల మూటలు, సుగుణాల రాసులు, సర్వవిద్యాపారంగతులు, దృఢకాయులు, ఇంతలో అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. కల చెదిరిపోయింది.
నేనిప్పుడు ఒక చిక్కులో పడ్డాను. కలలో కనిపించి పోయిన ఆ ఏడుగురు పిల్లల కోసం ఏడవనా? లేక ఈ “హరు ఒక్కడి కోసం
ఏడవనా?” అని అడిగాడు.
“ఈ రైతు ఒక నిజమైన జ్ఞాని. స్వప్నము (కల), జాగ్రత్తు (మెలకువ), రెండూ కూడా ఒక రకంగా అనిత్యాలేనని అతడికి తెలుసు. ఉన్న సత్యం ఒక్కటే! అదే ఆత్మ!” ఈ కథను గురుదేవులు మహిమచరణుడికి చెప్పారు.
మహిమచరణుడు ఎన్నో వేదాంత గ్రంథాలు, అనేక ఇంగ్లీషు గ్రంథాలు చదివి కొంత పాండిత్యం సంపాదించాడు. పిత్రార్జితమైన ఆస్తి ఉండటంవల్ల ఉద్యోగమేమీ చేయకుండా శాస్త్రపఠనంలో కాలం గడిపాడు. తన భావాలకు అనుగుణంగా ఒక పాఠశాలను కూడా నడిపించాడు. అతడికి పాండిత్య ప్రకర్షణం మీద కొంత అభిలాష వుంది. అతడిది రాజసిక ప్రవృత్తి. ఇది గుర్తించిన గురుదేవులు 'నిజమైన జ్ఞానం” ఎలా ఉంటుందో, నిజమైన జ్ఞాని ఎలా ప్రవర్తిస్తాడో ఈ కథ ద్వారా అతడికి తెలియచేశారు.
☸☸☸☸☸☸☸☸☸☸☸☸
No comments:
Post a Comment