బ్రాహ్మణ గీత
భార్యాభర్తలు అన్యోన్య ప్రేమతో జ్ఞానాన్ని పంచుకున్న విషయాన్ని వివరించే గీత ఇది. మోక్షాపేక్ష కలిగిన తన ధర్మపత్నికి బ్రహ్మవిద్యా రహస్యాన్ని బోధించాడు ఓ భర్త.
ఆ జ్ఞాన సారమే బ్రాహ్మణ గీతగా ప్రసిద్ధమైంది. ఇది మహాభారతం అశ్వమేధిక పర్వంలో ఉంది. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత ధర్మరాజు రాజ్యాధికారాన్ని చేపట్టి అశ్వమేధ యాగం చేశాడు. శ్రీకృష్ణుడు తానిక ద్వారకకు వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పగా, కురుక్షేత్ర సంగ్రామంలో తనకు ఉపదేశించిన భగవద్గీతా జ్ఞానాన్ని మరోసారి ఉపదేశించమని కోరాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు ఆ సమయంలో తాను యోగయుక్తుడుగా ఉన్నందునే పరమాత్మ తత్త్వాన్ని వివరించగలిగినట్లు, ప్రస్తుతం ఆ స్థితిలో లేనందున పూర్వకథ రూపంలో పరోక్షంగా చెబుతానన్నాడు. అలా చెప్పిన విషయాల్లోదే ఈ గీత. ఇది అభయం పేరుతోనూ ప్రసిద్ధం.
దీనిలో ప్రాణ సంబంధ విలువైన సమాచారం ఉంది. పంచప్రాణాలకు నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయాలని పేర్లున్నాయి. నోటిద్వారంలో నాగం, కంటిరెప్పల్లో కూర్మం ఉంటాయి. తుమ్ములో కృకరం, ఆవులింతలో దేవదత్తం ఉంటాయి. మనిషి చనిపోయినా దేహమంతా వ్యాపించి ధనంజయం అనే ప్రాణముంటుంది. ఇలా పంచప్రాణాలూ దేహమంతటా వ్యాపించి ఉంటాయని యోగులు విశ్వసిస్తారు- అంటూ భర్త వివరించగా, అంతర్యాగం గురించి వివరించమంది భార్య. దానికి సమాధానంగా పంచప్రాణాది వాయువులూ, మనసు, బుద్ధి అనే ఏడూ వైశ్వానరుడికి నాలుకలు. అందుకే అగ్నిదేవుణ్ణి స్వప్తజిహ్వుడంటారు. ప్రాణుల దేహాల్లో వెలుగుతున్న ఆత్మతత్త్వమే వైశ్వానరుడు అనుకోవచ్చు. శరీరం లోపల జరిగే హోమనిధి రెండు రూపాల్లో ఉంటుందంటూ- అతడు చెప్పిన ఎన్నెన్నో అద్భుత విషయాల సమాహారం ఈ గీత.
ఓం నమో నారాయణాయ
No comments:
Post a Comment