స్వయంకృతం
భగవంతుడు మనిషికి ప్రసాదించిన అపూర్వ వరం మనసు.
కంటికి కనిపించని మనసు- కనపడనంత దూరతీరాల అద్భుతాలను చూపిస్తుంది.
ఆనందమయమైన మరో లోకంలో విహరింపజేస్తుంది.
మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు మనసు తుంటరిదై అల్లరి చేస్తుంది. గాలిమేడలు కట్టేస్తుంది. బికారిని కోటీశ్వరుణ్ని చేసి అందలమెక్కిస్తుంది.
మనసు మాయలాడి. మనిషిని మయసభలో చిందులేయిస్తుంది. బజారులో అడుగులేస్తుంటే కనపడినవన్నీ కొనమంటుంది.
ఆడంబరాలు రుచిచూపిస్తుంది. మనసు మాట విన్న మనిషి అప్పుల ఊబిలో కూరుకుపోతాడు.
దేవాలయంలో అడుగుపెట్టగానే ధ్యానంపై ధ్యాస నిలవదు. మనసు దారి మళ్లిస్తుంది. కోర్కెల చిట్టా విప్పుతుంది. భగవంతుడు నవ్వుకుంటాడు. మనసు కవ్విస్తుంది. మురిపిస్తుంది. ఆవేశం రగిలిస్తుంది. దురాశలో ముంచుతుంది.
రోషాలు-ద్వేషాలు, పంతాలు-పట్టింపులు, కక్షలు-కార్పణ్యాలు, హత్యలు-ఆత్మహత్యలు- అన్నింటికీ మూలం మనసు.
మనసు చేసే అల్లరికి మనిషి బానిస. జీవితం భ్రమ అన్న సత్యాన్ని మరపించి, జీవితం సత్యమన్న భ్రమలో ముంచుతుంది.
మనసు మల్లెలా సుతిమెత్తన. చిన్నదెబ్బకు పెద్దగా రోదిస్తుంది. ఎదుటివారి కష్టాలకు కన్నీళ్లు కారుస్తుంది. అయినవారు పరమపదిస్తే పదిరోజులు పరితాపం చెందుతుంది.
అది బండరాయిలా అతి కఠినం. కష్టాన్ని దిగమింగుతుంది. దుఃఖాన్ని భరిస్తుంది. ఉపద్రవాన్ని తట్టుకుంటుంది. మనసుకు మరపించే శక్తి లేకుంటే మనిషి మనుగడ అసాధ్యం.
మనిషి సామర్థ్యం మనసే. మనిషి ఎదుగుదలకు బాటలు పరుస్తుంది. జీవితంలో పైకి రమ్మని పోరుతుంది. సుఖంగా సంతోషంగా జీవించడానికి సన్నాహాలు చేస్తుంది. అవకాశాలు అందిపుచ్చుకోమని సతాయిస్తుంది. మనసు చేసే మాయ నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు.
’నేను మనసు మాట వినను. స్థిర చిత్తుడను’ అని పలికేవాడే ఆ మాయలో పడుతుంటాడు.
కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలకు నిలయం మనసు.
కోప తాపాలకు మూలం మనసు.
ధ్యానంతో మనసును జయించవచ్చు. ఉదయం వీలైనంతసేపు భగవంతుడి యందే దృష్టి నిలిపి ధ్యానం చేయడం అలవరచుకుంటే, మనసు రోజంతా నిర్మలంగా ఉంటుంది.
మనసును అదుపు చేయగల శక్తి భగవన్నామ స్మరణకే ఉంది. అందుకే పూజా నియమం. పూజ చేసే సమయంలో మనసులో వేరే ఆలోచనలు రానీయక భగవంతుడియందే మనసు లగ్నం చేస్తే ఏకాగ్రత అలవడుతుంది.
మనసును అదుపు చేస్తే అసూయ, అసంతృప్తి, అసహనం, అహంభావాలు దరికిరావు.
కోరికలను అదుపు చేసుకుంటే … సంతృప్తికర జీవితం సుఖమయం ఔవుతుంది. మనిషి తన హద్దులను దాటకూడదు. నేల విడిచి సాము చేయడం మంచిది కాదు.
ఉన్నతమైన మానవజన్మ లభించినందుకు మానవత్వాన్ని మరచిపోకూడదు. మనసు వెళ్ళినంత దూరం మనిషి వెళ్ళకూడదు.
నీతి నియమాల కళ్ళెం వేసి మనసును లొంగదీయగలిగేది భక్తి ఒక్కటే...
ఆ భక్తి వంట బట్టిందా….
జీవితం ఆనందభరితమే! ఆరోహణ, అవరోహణ అంతా మనిషి స్వయంకృతమే.
🌹🌹🌹
No comments:
Post a Comment