SOURCE ANDHRA PRABHA
SRI V.S.R. MURTHY
దర్శనమే నిదర్శనం
మహాత్ముల దర్శనం, స్పర్శనం, సంభాషణం లభిస్తే, అవి సాధకుడి సాధన పైన చిరముద్ర వేస్తాయి. సందేహాలు క్రమంగా సమసి, సంశయం నశించి, సాధన సరళము, స్వచ్చము, తీవ్రము అవుతుంది. ఇది ప్రారంభదశలో వున్న సాధకుడికి లభించే ప్రాప్తి. అప్పటికే కొంత సాధన చేసి, ఆత్మ విచార మార్గంలో వున్న వారికి, మహర్షిని దర్శించినప్పుడు, వారితో సంభాషించిన తొలిక్షణాలు ఎంతో విలువైనవి. అప్పుడు కలిగే అనుభూతులు సాధన తీవ్రం కావటానికో, తేలిక కావటానికో, ముడి విడివడటానికో ఉపయోగించి, వారి వారి సాధన సంపూర్ణమయ్యే దిశలో నడుస్తుంది. మహర్షితో మహాత్ముల తొలి దర్శనాలు చిరస్మరణీయాలు.
శ్రీస్వామి రాందాసు అప్పటికే శ్రీకృష్ణ దర్శనం పొంది, నిరంతరం సంచారంలో వున్న భక్తాగ్రేసరుడు. ఆ సంచారంలో భాగంగా వారు తిరువణామలై చేరుకున్నారు. అప్పటి ఆయన మానసిక పరిస్థితి పసిబాలుడి సితి వంటిది. మాతృవాత్సల్యం కోసం పరితపిస్తున్న శైశవవేదన.
దారీ తెన్నూ ఎరుగని పరిస్థితి. అటువంటి సందర్భంలో వారికి మహర్షి దర్శనం లభించింది. ప్రథమ దర్శనమే స్వామి రాందాన్లో నిర్గుణపరబ్రహ్మను అనుభవించగల అనుభూతిని, విశ్వమహాచైతన్యపుస్పర్శను కలిగించినది. ఫలితంగా ఆయన కూడా అరుణాచలంపైన ఒక గుహలో కొంతకాలం వున్నారు. ఆ కాలమంతా ఆయన చేసుకున్నది,
ఎడతెగని రామనామం. భిక్షాటనంలో దొరికిన బియ్యాన్ని వండుకుంటూ, శరీరాన్ని, ప్రాణాన్ని నిలబెట్టుకుంటూ, రామనామ స్మరణ కొనసాగించారు. ఇరవై రోజుల తర్వాత, ఆయన కనుల ముందు తేజోమయ చైతన్యం సాక్షాత్కరించింది. బాలుడి స్థితిలో ఉన్న స్వామి రాందాసు భావోద్వేగానికి, భావావేశానికి, భావోన్నత్తతకు లోనై కనిపిస్తున్న దానినంతా రామమయంగా అనుభూతి చెందటం జరిగింది. తాదాత్మ్యత సైతం ఒక మూల వాసనే. మహర్షి దర్శనం, ఆయనకు మూలవాసనా క్షయాన్ని అనుగ్ర హించింది.
మరొక అన్వేషి కుంజు స్వామి. రమణులను వెదుక్కంటూ అరుణాచలం చేరుకున్న సాధకుడు. కుంజుస్వామి చేరుకున్న రోజే భగవాన్ పరిచారకుల్లో ఒకరు మరణించటం, ఆకారణంగా అందరూ పోయిన వ్యక్తి గురించే దుఃఖిస్తుంటే భగవాన్, "ఎందుకు విచారం? ఒకరు పోయారు. మరొకరు వచ్చారు. 'జ' అంటే పుట్టేది. 'గత్' అంటే పోయేది. అదే జగత్. దాని లక్షణమది. పొగలవద్దు. దిగులు పడవద్దు. కుంగవద్దు", అంటూ కుంజుస్వామికి ఆహ్వానం పలికారు. మిగిలింది నిశ్శబ్దం.
అందరూ వెళ్ళిపోగా, తానూ, భగవాన్ యిద్దరే మిగిలిన సందర్భం. భగవాన్ గంజి కాచి, ఒక పళ్ళెంలో పోశారు. పక్కనే వున్న బుట్ట ఎత్తగానే, నాలుగుకుక్క పిల్లలు బయటకు వచ్చి గంజి తాగటానికి సిద్ధమైనయ్. ఇదంతా మౌనంగానే సాగింది. ఇంతలో
భగవాన్, మౌనం వీడి, 'వాటిని పట్టుకో. గంజి వేడిగా ఉంది. అవి తాగలేవు" అన్నారు. కుంజుస్వామి వాటిని పట్టుకున్న తర్వాత, కొంత సేపటికి, “ఒక్కొక్క దాన్ని వదిలిపెట్టు" అన్నారు భగవాన్. అదే తొలిపాఠం! పట్టుకున్న వాటని క్రమంగా వదలిపెట్టాలి. ఒక్కొక్క దాన్నీ, వదలాలి. గుర్వాజ్ఞ లభించేదాకా వేచి ఉండాలి. లభించగానే ఆచరించాలి. ఇవే కుంజుస్వామి పొందిన మౌన వ్యాఖ్య, ఉపదేశం, ఆదేశం! అయినా జీవుణ్ణి వాసనలు వదలిపెట్టవు.
ఒక రోజు మహరి ఏకాంతంలో వుండగా, కుంజుస్వామి తన అభిరుచుల్ని వారికి విన్నవించుకుందామనుకున్నాడు. ప్రవచనాలు చెప్పటం, జపం చేసుకోవటం, వేదాంతాన్ని అధ్యయనం చెయ్యటం. ఈ విషయాలను చెప్పి, నన్నేం చేయమంటారని అడిగాడు. భగవాన్
, "కైవల్య నవనీతం చదివావు కదా! ఏం చెబుతున్నది? ఆత్మ విచారణ చెయ్. జనన మరణ చక్రం నుండి బయట పడేస్తుందది. నేనెవరన్న ప్రశ్న వేసుకో. అంతర్ముఖుడి వికా. మనసును హృదయంలో కలుపు" అంటూ మౌనం వహించారు. అధ్యయనం వేరు. అనుష్టానం వేరు. ఆచరణకు నోచనిది నిరర్లకమే.... కుంజుస్వామికి ఆ విధంగా సాధనోపదేశం చేశారు. నియమం, శ్రద్ద, ఏకాగ్రత.... వంటి ఎన్నో లక్షణాలను సమన్వయం చేసుకోవాలి.. " అన్నిటికీ కర్త ఇక్కడున్నాడని, నిశ్చిత బుద్ధితో వుండాలి.
సత్సంగం, సత్యాంగత్యం, సర్దాషి, సదాచారం వంటివన్నీ జీవనగమనంతో ప్రధాన భాగాలై, జీవితం సాగాలి. వ్యర్ధమైన ఆలోచనలకు మనసులో తావీయక, అచలంగా వుండాలి. ఈ సాధనకు మూలశక్తియైన మానసిక మౌనాన్ని ఆశ్రయించాలి. మౌనం మహాశక్తివంతమైన ఆధ్యాత్మిక భూమిక.
--వి.యస్.ఆర్.మూర్తి.
No comments:
Post a Comment