Xv. X. 1-4. 200922-8.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
జీవన్ముక్తి!
➖➖➖✍️గ
పూర్వకాలం కాంచీపురాన్నీ పరిపాలించే మహారాజు తన కుమారుడిని మంచి విద్యావంతుడిని చేశాడు. సర్వశాస్త్రాలు నేర్పించాడు.
రాజ్యపాలనకు సంబంధించిన అన్ని విషయాలలో తర్ఫీదు ఇప్పించాడు. యవ్వనుడైన ఆ కొడుకుకు యువరాజ పట్టాభిషేకం చేసాడు. రాజ్యపాలనలో యువరాజు సలహాలు తీసుకొనేవాడు.
ఒకరోజు రాజ్యంలోని కొందరు ప్రజలు రాజు దగ్గరకు వచ్చారు. అడవికి దగ్గరగా ఉన్న తమ గ్రామాలలోకి క్రూరమృగాలు వస్తున్నాయని, వాటి నుండి తమను రక్షించాలని కోరారు. వెంటనే రాజు పక్కనే ఉన్న యువరాజు వంక చూశాడు.
ఆ చూపు అర్ధం చేసుకున్న యువరాజు ప్రజల వెంట అడవికి బయలు దేరాడు. క్రూరమృగాల్ని వేటాడుతూ యువరాజు అడవిలో చాలా దూరం పోయాడు.
క్రూరమృగాల్ని చాలా మటుకు వధించాడు. వేటలో అలసట చెందిన యువరాజుకు దాహం వేసింది. నీటి కోసం చుట్టూ చూసాడు.
ఎక్కడ నీటి జాడ కనిపించలేదు. దగ్గరగా ఉన్న ఒక చెట్టు ఎక్కి చూడగా కొద్ది దూరంలో ఒక ఆశ్రమ కనిపించింది. చెట్టు దిగి ఆశ్రమం చేరుకొన్నాడు. ఆశ్రమంలో ఒక స్వామి ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు.
యువరాజు వచ్చిన అలికిడికి కళ్లు తెరిచిన ఆ స్వామి యువరాజును లోనికి ఆహ్వానించి అతిధి మర్యాదలు చేసాడు.
సేద తీరిన యువరాజును ఆ స్వామి మీరెవరు? మీ పేరేమిటి? అని ప్రశ్నించాడు. అందుకా యువరాజు స్వామీ! మాది సమీపంలోని ఒక రాజ్యం.
నేను యువరాజును నా పేరు మోహదీప్తుడు. అయినా అందరూ నిస్సంగుడు అని పిలుస్తారు అని బదులిచ్చాడు
అపుడా స్వామి నాయనా! నీ పేరు విచిత్రంగా ఉందే అన్నాడు. అందుకా యువరాజు స్వామీ! నా ఒక్క పేరేమిటి? మా రాజ్యంలో పేర్లన్నీ ఇట్లాడే ఉంటాయి.
అనగానే స్వామికి ఏదో తోచింది. యువరాజా! మీరు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి. ఆపైనున్న మీ ఉత్తరీయం నాకివ్వండి. నేను రాజ్యంలోకి పోయి మరలా వస్తాను. అని ఉత్తరీయాన్ని తీసుకున్నాడు.
కొంతదూరం పోయిన తర్వాత ఆ ఉత్తరీయానికి అక్కడక్కడ కొంత రక్తం మరకలు పులుముకుని రాజ్యం చేరుకున్నాడు.
రాజాంతఃపుంర ద్వారం దగ్గర ఒక దాసి ఎదురైంది స్వామికి. అపుడా స్వామి ఆ దాసితో అమ్మా! అడవిలో మీ యువరాజును పులి చంపేసింది. ఇదిగో రక్తంతో తడిసిన ఆయన ఉత్తరీయం అన్నాడు. అప్పుడా దాసి ‘దానిదేముంది స్వామీ భగవద్గీతలోని రెండవ అధ్యాయంలోని శ్లోకాలను గుర్తుకు తెచ్చుకోండ’ని వెళ్లిపోయింది.
ఆశ్చర్యపోయిన ఆ స్వామి అంతఃపురంలోని రాజు దగ్గరకు పోయి యువరాజు మరణం గురించి చెప్పాడు.
అందుకా రాజు స్వామితో రుణగ్రస్తుడు. రుణం తీరింది వెళ్లిపోయాడు అని తన పనిలో మునిగిపోయాడు. స్వామికి మరింత ఆశ్చర్యం వేసింది.
సరే అనుకుని రాణి దగ్గరకు పోయి కొడుకు మరణవార్త వినిపించాడు.
అందుకామె బాధ పడలేదు. పైగా స్వామీ! చెట్టుపై సాయంత్రం చేరిన పక్షులు ఉదయమే వెళ్లిపోతాయి. మరలా సాయంత్రం ఆ చెట్టుపైకి ఎన్ని పక్షులు చేరుకుంటాయో తెలియదు కదా అని అన్నది.
అదేమిటి ఈమె కూడా ఇట్లా అన్నదే అని ఆ స్వామి యువరాజు భార్య దగ్గరకు పోయి విషయం చెప్పాడు.
అందుకామె స్వామీ ప్రవహిస్తున్న గంగానదిపై ఉన్న దుంగలం మేమంతా. అలలపై కొన్ని దుంగలు కొట్టుకుని పోతాయి. అందుకు చింతించాల్సిన పనిలేదు అని సమాధానం చెప్పింది. స్వామి ఇక్కడ యింకేం పని లేదనుకుని ఆశ్రమం చేరాడు.
యువరాజుతో రాజా! మీ రాజ్యాన్ని శత్రురాజులు ఆక్రమించుకున్నారు. మీ తల్లిని, తండ్రిని బంధించారు అని అన్నాడు.
అందుకా యువరాజు స్వామీ ఇందులో విచిత్రమేముంది? యాత్రికులలాగా ఇక్కడికి వచ్చాం. యాత్ర ముగిసింది. అంతేగదా అని అనగానే స్వామికి ఆనందం రెట్టింపు అయింది.
సత్సంగత్వే నిః సఙ్గత్వం
నిఃసఙ్గత్వే నిర్మోహత్వం |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః ||
జ్ఞానులైన సజ్జనులు సాంగత్యము వలన సంసార బంధములు విడిపోవును. బంధములు విడిపోయిన అజ్ఞానమూలకమైన మోహము పోవును. మోహము నశించినచో నిశ్చలమగు పరిశుద్ధ తత్వము గోచరమగును. అది తెలిసినపుడు జీవన్ముక్తి కలుగుతుంది .✍️
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment