Monday, September 26, 2022

బయటనుండి వచ్చే దృశ్యాలు, శబ్దాలు, స్పర్శసుఖాలు, ప్రాపంచిక విషయాలు,

 బయటనుండి వచ్చే దృశ్యాలు, శబ్దాలు, స్పర్శసుఖాలు, ప్రాపంచిక విషయాలు, సమస్త కోరికలు, కర్మల పట్ల ఎవరైతే ఆసక్తిని వదిలిపెడతారో, ఆ మాటకు వస్తే సమస్త కర్మలకు మూలకారణమైన అన్ని సంకల్పాలను వదిలిపెడతాడో అతడే యోగారూఢుడు అంటే యోగం బాగా తెలిసుకున్నవాడు.

యోగారూఢుడు కావాలంటే మూడు ముఖ్య లక్షణాలు చెప్పారు.

1. ఇంద్రియాలకు సంబంధించిన విషయాలయందు ఆసక్తి లేకపోవడం.
2. కర్మలయందు ఆసక్తి లేకపోవడం,
3. కర్మలకు మూల కారణమైన సమస్త సంకల్పాలను వదిలిపెట్టడం.
ఒక వ్యక్తి యోగి లేక యోగారూఢుడు అవునాకాదా అని తెలుసుకోడానికి ఈ పరీక్షలు చాలు.

బయట ప్రపంచంలో జరిగే సంఘటనల మీద ఆసక్తి ఉన్న వాడికి మనస్సు నిలకడగా ఉండదు. ధ్యానంలో కూర్చుంటే ఏకాగ్రత ఉండదు. మనస్సు బయటకు పరుగెత్తకుండా ఉండాలంటే, బాహ్య విషయములమీద ఆసక్తి వదలాలి. అప్పుడు మనస్సు బయటనుండి లోపలకు వస్తుంది. ఆత్మవైపు చూస్తుంది. సాధకుడు ఈ స్థితికి చేరుకుంటే కర్మల మీద కర్మఫలముల మీద ఆసక్తి ఉండదు. అలా కాకుండా మరలా మొదటకు వస్తే, ధ్యానం కూడా మొదటికి వస్తుంది.

దీని అర్థం బయట ప్రపంచంలో ఉండే శబ్ద, స్పర్శ, రస, రూప, గంధముల పట్ల విముఖత పెంచుకోమనికాదు. ఎందుకంటే అవి అనునిత్యం మీ ఇంద్రియాలను తాకుతూ ఆకర్షిస్తుంటాయి. వాటి ఆకర్షణకు లోనుకాకూడదు. వాటి మీద ఆసక్తి చూపకూడదు. వాటిని మనకు ఎంతవరకు అవసరమో అంతవరకే ఉపయోగించుకోవాలి.

ఉదాహరణకు ధనం, ఆస్తి మనకు ఎంత కావాలో అంతే సంపాదించాలి అంతేకానీ అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడి, రాబోయే తరాలకు కూడా మనమే సంపాదించకూడదు. 
ఇంక రెండవది. ఈ ఇంద్రియార్థములను పొందడానికి కర్మలు చేయాలి. కాని ఆ కర్మల పట్ల ఆసక్తి బంధము కలిగి ఉండకూడదు. శ్రద్ధతో చేయాలి కానీ ఆసక్తితో కాదు. చేసే కర్మమీద ఆసక్తి ఉంటే దాని ఫలం మీద కూడా ఆసక్తి పెరుగుతుంది. అది బంధనాలకు కారణం అవుతుంది. కాబట్టి మనం చేసే కర్మల మీద అనవసరమైన ఆసక్తి, అటాచ్ మెంట్ కలిగి ఉండకూడదు. 

కోరికలు కలగడానికి గానీ, వాటినితీర్చుకోడానికి తగిన కర్మలుచేయడానికి గానీ మూలం మనసులో సంకల్పం కలగాలి. ఏ కోరికనైనా సంకల్పంగా ఉండగానే నాశనం చేస్తే కోరిక గానీ, కర్మగానీ, కర్మఫలములు గానీ ఉండవు. కాబట్టి మనం మొదట సంకల్పాల స్థాయిలోనే వాటినివదిలి పెట్టడానికి దృష్టిపెట్టాలి.

🙏 కృష్ణం వందే జగద్గురూమ్🙏

No comments:

Post a Comment