Saturday, October 1, 2022

ఆత్మజ్ఞానం

 ఆత్మజ్ఞానం

ఆత్మజ్ఞానం పొందినవారు దేనికీ చలించరు. సానుకూల, ప్రతికూలతా భావాలకు అతీతులవుతారు. ఆ సమత్వ భావన ద్వారా ‘ఆత్మను పరమాత్మతో అనుసంధానించడం’ అనే లక్ష్య సాధన వైపు పయనిస్తారు. 

మనసులోని కోరికలన్నీ సమసిపోయి, ఆత్మ ద్వారా... ఆత్మలో సంస్థితుడైనవాడిని, అంటే పరమాత్మతో ఏర్పరచుకున్న అనుబంధం ద్వారా ఆత్మానందాన్ని పొందిన వాడిని ‘స్థితప్రజ్ఞుడు’ అంటారని ‘భగవద్గీత’లో అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు. ఒక వ్యక్తి స్థితప్రజ్ఞుడు కావాలంటే కొన్ని ఉదాత్తమైన లక్షణాలు అవసరం. అలాంటి ఉత్తమ లక్షణాల వల్ల కోరికలు పూర్తిగా తొలగిపోతాయి. అప్పుడు శాశ్వతమైన ఆనందం కలుగుతుంది. కోరికలు సక్రమమైన ఫలితాలు ఇవ్వనప్పుడు కలిగే దుష్పరిణామం - క్రోధం. ఆ క్రోధం వల్ల మోహం కలుగుతుంది. స్మృతి భిన్నమైపోయి జ్ఞానశక్తి నశిస్తుంది. ఆ వ్యక్తి అధోగతి పాలవుతాడు. స్థితప్రజ్ఞుడు అలాంటి కలుషిత భావాన్ని తొలగించుకుంటాడు. తన అంతఃకరణను శుద్ధి చేసుకుంటాడు. చిత్త శుద్ధితో కర్తృత్వ భావాన్ని... అంటే ‘ఏదైనా కార్యానికి కర్తను నేనే!’ అనే ఆలోచనను తొలగించుకుంటాడు. తన ఆలోచనలను అహర్నిశలూ ఆత్మలోనే స్థిరం చేసుకుంటాడు.

ప్రాపంచిక భావాలకు వశమైనవారికి సుఖ దుఃఖాలు కలుగుతాయి. ఆత్మను పరిశుద్ధం చేసుకున్న మానవుడికి అశాశ్వతమైన ఈ ప్రపంచం మీదా, తన పుట్టుక, మరణాల పైనా విశ్వాసం ఉండదు. దానివల్ల లౌకిక బంధాల ద్వారా కలిగే సుఖానికి పొంగిపోడు, దుఃఖానికి కుంగిపోడు. అలాగే ‘ఇది అనుకూలం, అది ప్రతికూలం’ అనే మాయాపూరితమైన భ్రమ ఉండదు. అతను ఆత్మజ్ఞానాన్ని పొందడం వల్ల అన్నిటికీ సానుకూలంగా స్పందిస్తాడు. అతనిలోని సమత్వభావం దీనికి తార్కాణం అవుతుంది. భేదాభిప్రాయం అనేది అజ్ఞానంలోంచి పుడుతుంది. అభేదాభిప్రాయం జ్ఞానంలోంచి జనిస్తుంది. తాబేలు తన శరీరంలోని అవయవాలన్నిటినీ లోపలికి ముడుచుకున్నట్టు... ఆత్మ దీక్షాపరుడు తన ఇంద్రియాలను లౌకిక ప్రయోజనాల నుంచి ఉపసంహరించుకుంటాడు. ఏ ఇంద్రియానికీ వశుడు కాడు. తన ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేయడమే అతని లక్ష్యం కాబట్టి అతని ప్రయత్నాలన్నీ ప్రయోజనకరమవుతాయి. జన్మసాఫల్యాన్ని చేకూరుస్తాయి. జీవితానంతరం పరమాత్మలో అతని ఆత్మను లీనం చేస్తాయి. 

ఆ లక్షణాలు ఉన్నవాడే...
సామాన్యులు పగలుగా భావించే కాలాన్ని పరమాత్మ తత్త్వంతో అనుసంధానమైన స్థితప్రజ్ఞుడు రాత్రి కాలంగా పరిగణిస్తాడు. అందరూ నిద్రించే సమయంలో అమేయమైన ఆత్మానందాన్ని అనుభవిస్తూ మేలుకొని ఉంటాడు. 

వివిధ నదుల నుంచి వచ్చే నీటిని నిశ్చలంగా ఉన్న సముద్రం ఏమాత్రం చలించకుండా తనలో చేర్చుకుంటుంది. అదే విధంగా సమస్త భోగ వికారాలూ స్థితప్రజ్ఞుడిలో అణిగి ఉంటాయి. మనసు పరిశుభ్రంగా ఉండడం వల్ల అతనికి పరమశాంతి లభిస్తుంది. భోగలాలసుడు ఎన్నటికీ శాంతిని ఆస్వాదించలేడు. జ్ఞానసిద్ధి పొందిన వాడు అహంకారాన్ని నేర్పుతో అధిగమిస్తాడు. ‘నేను’ అంటే ఈ అశాశ్వతమైన, దుఃఖకారమైన శరీరం కాదని అతను తెలుసుకుంటాడు. సర్వాంతర్యామి, సర్వాత్మ అయిన పరమాత్మతో ఉండే సంబంధమే ‘నేను’ అనే జ్ఞానాన్ని హృదయంలో పదిలపరచుకుంటాడు. భయం, అధైర్యం, అనుమానం, అసూయ. ద్వేషభావం అతనిలో అణుమాత్రమైనా ఉండవు. కనబడేది అంతా పరమాత్మ స్వరూపంగా భావిస్తాడు. సర్వ ప్రాణికోటినీ ప్రేమపూర్వకంగా గౌరవిస్తాడు. అలాంటి ఉత్తమ లక్షణాలు కలిగిన వాడే స్థితప్రజ్ఞతను సాధించి బ్రహ్మప్రాప్తికి అంటే బ్రహ్మస్థితికి అర్హుడు అవుతాడు. ఈ ఆత్మ ప్రక్రియను సాధించినవాడు ఎన్నటికీ మోహితుడు కాడు. అంత్యకాలంతో బ్రహ్మానందాన్ని పొంది, పరబ్రహ్మలో  లీనమవుతాడు.

No comments:

Post a Comment