Saturday, October 1, 2022

🕉️వేదాంత పక్షులు 🕉️

 🕉️వేదాంత పక్షులు 🕉️

(వేదాంతతత్వమంతా ఈ కింది కథలో ఇమిడివుంది)

ఒకే చెట్టుమీద రెండు పక్షులున్నవి - ఒకటి చిటారుకొమ్మమీద ,రెండవది కింది కొమ్మమీద . ఫైపక్షి ప్రశాంతంగా ,మౌనంగా ,గంభీరంగా స్వకీయ వైభవంలో మునిగివుంది. కిందిపక్షి తీయని పళ్ళను చేదుపళ్ళను తింటూ ,ఒక కొమ్మనుంచి మరొక కొమ్మమీదికి ఎగురుతూ సుఖాసుఖాలను అనుభవిస్తోంది. కొంతసేపటికి యీ కిందిపక్షి మరింత చేదుపండును తిని ,విసుగుచెంది ,తల ఎత్తి ఆ పైపక్షిని చూసింది . బంగారు ఈకలున్న ఆ అద్భుతపక్షి తీయని పళ్ళుగాని చేదుపళ్ళు గానీ తినటంలేదు. దానికి కష్టానుభూతిగాని , సుఖానుభూతిగాని లేదు. ప్రశాంతంగా,అత్మస్థమై ,తన ఆత్మను తప్ప వేరుదేన్నీ చూడక ,కూర్చునివుంది. ఆ స్థితి పొందటానికై కింది పక్షి తీవ్రంగా ఆకాంక్షిస్తుందిగాని, అచిరకాలంలోనే మరచి మళ్ళా పళ్ళను తినటం ప్రారంభిస్తుంది. కొంతసేపటికి మరొక అతి చేదుపండు తిని, ఎంతో ఖేదమొంది, మళ్ళా పైకి చూసి , యింకొక పైకొమ్మ కెగిరింది. అలా పైపైకి ఎగిరి ఎగిరి, చివరికి ఆ చక్కని పక్షికి అతిచేరువులోకి వస్తుంది. చివరకు అది పైనున్న పక్షి చోటుకు వచ్చి దాన్లో తననే కోల్పోయింది. రెండు పక్షులు లేనేలేవనీ ,ప్రశాంతమై గంభీరమై ఆత్మవైభవంలో వెలుగొందుతూన్న పైపిట్ట తానే అనీ అది తటాలున గ్రహించింది. నిజానికి తా నెప్పుడూ ఆ పైపక్షే . ఈ తినటం ,యీ తీయనిపళ్ళు యీ చేదుపళ్ళు ,యీ కింది చిన్నపక్షి, ఒకసారి సుఖించటం,ఒకసారి దుఃఖించటం - యిదంతా కేవలం భ్రమ,స్వప్నం. పై పక్షి భగవంతుడు,జగదీశ్వరుడు. కిందిది జీవాత్మ.”
🕉️💐 

No comments:

Post a Comment