Thursday, October 6, 2022

ఈ అష్టైశ్వర్యాలనూ ఇష్టైశ్వర్యాలుగా మార్చుకుంటే మనిషి మనీషి అవుతాడు.

 అవతలి వ్యక్తి తనను దూషిస్తున్నా మౌనంగా ఉండడం ఆ వేదాంతి శాంత స్వభావం.ఆ దూషణలకు ప్రతిస్పందించకుండా ఉండడం ఆ వేదాంతి సహన గుణం.ప్రతీకారంగా ప్రతినింద చేయకపోవడం ఆ వేదాంతి క్షమాబుద్ది. చూసేరా ఈ మూడూ ఎంత గొప్ప సంపదలో.

ఇక సంతృప్తి విషయానికొస్తే

“ వనజభవుండు నెన్నొసట వ్రాసిన వ్రాలు ఘనంబొ కొంచెమో

విను మరుభూమి కేగిన లభించును మేరువు చేరబోయినన్

ధనమధికంబు రాదు...

బ్రహ్మదేవుడు మన నుదుటిమీద వ్రాసిన వ్రాత ఎక్కువో,తక్కువో అంటే ఎంత మనకు ప్రాప్తమో అంతే స్మశానానికి వెళ్ళినా లభిస్తుంది. కాని ప్రాప్తం లేనప్పుడు మేరు పర్వతం దగ్గరికి వెళ్ళినా మనకు ఎక్కువ రాదు.

దీనికి ఉదాహరణగా ఓ కథ.ఓ సారి లక్ష్మీదేవి జ్యేష్టా దేవితో అందిట.”నేను తలచుకుంటే ఎంత దరిద్రుడనైనా ఇట్టే ధనవంతుని చేయగలను” అని. దానికి జ్యేష్టా దేవి “ నేను వాడి నెత్తిన ఉంటే నువ్వేం చెయ్యలేవు” అంది.” సరే చూద్దాం.పందెం.ఎవరు గెలుస్తారో” అంది లక్ష్మీదేవి.” నీ మాటే నిజమైతే అదిగో! ఆ వెళ్తున్న కటిక దరిద్రుడిని కోటీశ్వరుడిని చెయ్యి.”అంది జ్యేష్టా దేవి.” ఓ దానికేం భాగ్యం? అదెంత పని?” అని లక్ష్మీదేవి వాడు వెళ్ళే త్రోవలో ఓ బంగారు నాణేల మూటను పడేసింది. అది చూసిన జ్యేష్టా దేవి ఊరుకుంటుందా? వాడి మస్తిష్కంలో ప్రవేశించింది. దాంతో వాడికి ఓ ఆలోచన వచ్చింది.”రోజూ నేను ఇదే త్రోవలో వెళ్తున్నాను.అలవాటైన త్రోవే కదా! ఈ వేళ కళ్ళు మూసుకుని నడిచి చూస్తాను” అనుకుని కళ్ళు మూసుకుని వెళ్తూ ఆ కాసులమూటను కానకుండా ఆ ప్రదేశం దాటుకుని వెళ్లి పోయేడు. చూసేరా! వాడి ప్రాప్తానుసారం అవి వాడికి దక్కలేదు.

అంచేత మన కు ప్రాప్తమైన దానితో మనం సంతృప్తిగా ఉండాలి.సంతృప్తిని మించిన సంపద లేదు.

మనకు సంతృప్తి అనేది ఎప్పుడయితే ఉంటుందో సంతోషం అనే సంపద దాని వెన్నంటే ఉంటుంది.నిత్యం సంతృప్తిగా ఉండేవాడు నిత్యం సంతోషంగా ఉంటాడు.ఆ సంతోషమే మనకు సగం బలం. సంపద.

ఇంక దయా సంపద. అంటే భూత దయ. అన్ని జీవులపట్ల దయ కలిగి ఉండడం. ఏ జీవినీ హింసించకపోవడం. ఇది ఒక పెట్టని ఆభరణం.

దానగుణం – సాధారణంగా మనం దానం చేస్తే మన సంపద తరిగిపోతుంది అనుకుంటాం.కాని మనం ఎంతయితే దానం చేస్తామో అంతా మనకు తిరిగి లభిస్తుంది. అంచేత దానగుణం కూడా ఓ తరగని సంపద.

నిష్కామం అంటే కోరికలు లేకపోవడం కూడా ఓ కనబడని సంపదే.ఎందుకంటే కోరికలకు అంతు అంటూ ఉండదు. వాటిని తీర్చుకోవడంకోసం అనునిత్యం ధనార్జన చేయవలసివస్తుంది.దానికై అహర్నిశలూ శ్రమించవలసివస్తుంది.ఆ పోరాటంలో అదే మన బ్రతుకుకు లక్ష్యం అనుకుంటూ మన జీవిత గమ్యాన్ని చేరుకోలేం. పైగా కోరికలు మితిమీరితే అక్రమంగా కూడా ధనార్జన చేసే ప్రమాదం ఉంది. అది ఫలించకపోతే కోపం వస్తుంది. కోపం అన్ని అనర్థాలకూ దారి తీస్తుంది. అందుకే కోరికలు లేనివాడు కోటీశ్వరుడి కంటే గొప్పవాడు.

ఈ అష్టైశ్వర్యాలనూ ఇష్టైశ్వర్యాలుగా మార్చుకుంటే మనిషి మనీషి అవుతాడు. 🙏

🌷🌷🌷🌷

No comments:

Post a Comment