Wednesday, October 19, 2022

ధ్యానం ఎట్లా చేయాలి ? అసలు ఎందుకు చేయాలి?

 *🧘‍♂️56- శ్రీ రమణ మార్గము🧘‍♀️*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩

*శ్రీ రమణీయం గ్రంథం నుంచి శ్రీ రమణమహర్షి జీవిత చరిత్ర*

*6-మూడవ భాగం*

ప్రశ్న:- “చిదాత్మ” అంటే ఏమిటి ?

 భగవాన్;- వర్ష రూపంలో పడిన చినుకు, నదిలో పడి, నదై - మహా సముద్రంలో కలిసి, మహాసాగరమైనట్లు, మూర్తీ భవించిన ఆత్మ, విశ్వాత్మలో కలిసి చిదాత్మ అవుతుంది.

ప్రశ్న :- ధ్యానం ఎట్లా చేయాలి ? అసలు ఎందుకు చేయాలి? 

భగవాన్:- ఒక ఆలోచన మీద మనసును ఏకాగ్రం చేయడమే ధ్యానం అలా ఏకాగ్రం చేయగా తక్కిన ఆలోచనలన్నీ కలిసి, ఒక్క పెట్టున ఏకాగ్రం చేయ బడిన, ఆ ఒక్క ఆలోచన మీద విరుచుకుపడతాయి. తత్ఫలితంగా ఆలోచనల మధ్య తీవ్ర పోరాటం ఏర్పడుతుంది.

నిరంతర సాధన వల్ల, ఏకాగ్రం చేయబడిన ఆలోచన క్రమంగా బలపడి, తక్కిన ఆలోచనల్ని తరిమేస్తుంది. ఈ రకమైన పోరాటం, నిరంతర ధ్యానంతోపాటు సాగుతూ వుంటుంది. లక్ష్యసిద్ధి కోసం ధ్యానంలో మనసు చేత చురుకుగా పనిచేయించాలి. బైట ఏదీ తనపై ప్రభావం చూపకుండా, అనుక్షణం చూసు కోవాలి.

ధ్యానానికి కావలసింది, అనుగ్రహం కాదు, నిరంతర సాధన. ఏకాగ్రత, మేధస్సులో కాదు; హృదయంలో. నీ నిజస్వభావమే, ధ్యానం. ఆలోచనా రహితస్థితే ధ్యానం. ఇంక మిగిలేది నువ్వు. అంటే, “నువ్వు” అనే, "నేను", ఆ "నేనే”, దైవం - సత్యం - ఆత్మ. దాన్ని అందుకోవడానికే నువ్వు ధ్యానం చేయాలి, ధ్యానమంత ఉత్తమమైనది మరొకటి లేదు.

ప్రశ్న:- పరిపూర్ణ నిరహంకార స్థితిని పొందేదెట్లు ?

భగవాన్ :- మనసు దాని మూలంలో అది మునగకపోతే, అహం చావకపోతే, సహజస్థితిని ఎట్లా పొందగలం? ఎక్కడ అహం లేదో, అక్కడ మనం “అదై” వుంటాం. అంటే, అసలు సత్యమై వుంటాం. వేదాల ఉద్దేశ్యం కూడా “అదే మనమై వున్నాం” అని చెప్పడం. పరమోన్నతమైన ఆ శక్తి ఉనికినీ, చైతన్యాన్నీ, నాశనరహితమైన ఆత్మ స్వభావాన్నీ, దాన్ని పొందే విధానాన్ని గ్రంథాలూ, శాస్త్రాలూ తెలియజేస్తున్నాయి. 

అహంకారం నాశనం కావడమే, ఆత్మ. అహంకారం వున్నంతకాలం, బంధం. అజ్ఞానం తప్పవు. “నేను ఎప్పుడు ఎక్కడ ఎట్లా బందీనైనాను?” అని -అనవసరంగా ఆలోచిస్తూ కూర్చోవద్దు. త్వరగా విముక్తి మార్గం తెలుసుకో.

 అసంగతమైన, అసంబద్ధమైన ప్రశ్నలు  వదులు త్వరపడు ముందున్నది విమోచన మార్గం. దాన్ని అనుసరించు.

ఆనందానికీ, శాంతికి ప్రథాన శత్రువు, “అహం - కారం”. అందుచేత దాన్ని రెచ్చగొట్టకూడదు. సమస్యలు, సందేహాలు, సంశయాలు, ప్రశ్నలు
తెచ్చి పెట్టుకోకూడదు. వాటీ సమాధానాల కోసం, సంతృప్తి కోసం మరిన్ని ప్రశ్నలు వేసుకుని నిన్ను నువ్వు వేధించుకోకు. అదంతా తెలివి, ప్రకటనా, ఆర్భాటం మాత్రమే. ఏ పద్ధతిలోనైనా అహంకారం వుండ నే వుంటుంది. కనుక అసలు ప్రశ్న, ప్రశ్నగానే పరిష్కారం కాకుండా మిగిలి వుంటుంది.

ఉత్పన్నమైన ప్రశ్నను పొడిగించడం కన్నా, దాన్ని అరెస్ట్ చెయ్యి. దాన్ని ఖైదులో విచారణతో ప్రశ్నను బంధించి, " నే నెవరు ? " అనే తోసెయి.

అయినా అహంకారం నీడలా నిన్ను వెన్నంటే వుంటుంది. దాన్ని పూడ్చెయ్యాలని గొయ్యి తీసి, ఆ గోతిలోకి దిగి, ఆ నీడను అందు పూడ్చి, తాను గోతిపైకి రాగానే, ఆ నీడా ఎప్పటి మాదిరిగానే ప్రత్యక్షమౌతుంది. అందుచేత అతని ఆ నీడను అసలు గమనించకపోవడమే సరైనమార్గం. అహంకారం వున్నంతకాలం అజ్ఞానం, బంధం ఆత్మదర్శనమైందా, హృదయగ్రంధి తప్పవు. వీడిందా, సందేహాలు తొలగుతాయి. సర్వ కర్మల కారణం తొలగుతుంది. అదే నిరహంకారస్థితి. ముక్తి. అంటే, ఏమీ తలెత్తకపోవడం. అహంకారం ఎప్పటికీ తలెత్తకుండా చావడం.

నిద్ర, నిరహంకార స్థితికి నిదర్శనం. అదే చైతన్యం. అంటే, అదే శూన్యం, ఆత్మ, పరమాత్మ. దాన్నే “ I AM ” “నేనున్నాను” అని అంటారు. ఆ స్థితిని ””
అందుకున్నవారు కూడా, ఆ స్థితి ఏమిటో మాటల్లో వర్ణించి చెప్పలేరు. అది “సచ్చిదానందస్థితి”, శాంతి, ఆనందం, మోక్షం, అన్నీ అదే!

ప్రశ్న :- శాంతి అంటే ఏమిటి?

భగవాన్ :- మన స్వభావమే, మన స్వరూపమే శాంతి. కాని, మనకు మనమే అశాంతిని ఆపాదించుకుంటాం. మళ్లా శాంతికోసం తంటాలు పడతాం. నిజం చెప్పాలంటే మనమెప్పుడూ శాంతిలోనే వుంటాం. వేదాలు ఆత్మ గురించి ప్రస్తావిస్తూ, దాన్ని సంపూర్ణ శాంతిగా అభివర్ణించాయి.

"శాంతి శాంతి అలమటించడం ఎట్లా వుంటుందంటే పీకలోతు నీళ్ళలో వుండి దాహం తీరలేదన్నట్లు వుంటుంది.

ప్రశ్న :- ఆనందం ఎట్లా లభిస్తుంది ?

భగవాన్ :- సామాన్యంగా అందరూ జీవితంలో శాంతిని, ఆనందాన్ని కోరుకుంటారు. కాని, అవి దుర్ల భమైనవి. ఏదో కష్టం కలిగినప్పుడు శాంతి, ఆనందంకోసం ఎదురుచూస్తారు. తాత్కాలిక ఉపశమనం కలిగితే, వూరుకుంటారు. మళ్ళా బాధ కలిగితే, ఏడుస్తారు. కాని, దాని శాశ్వత నివారణకు, శాశ్వత ఆనందానికి యోచించరు. దానికోసం గురువుల్ని అర్ధిస్తారు, ఆశ్రమాలు చేరుతారు, సాధనలు చేస్తారు. కాని, నిలిచి దుః ఖకారణమేమిటో యోచించరు.

No comments:

Post a Comment