Saturday, October 29, 2022

"నేను" లేకపోతే ప్రపంచం లేదు.

 "నేను" లేకపోతే ప్రపంచం లేదు.☝

ఇవి పరమశివుడే స్వయంగా చెప్పిన మాటలు కనుక మనం ఏమాత్రం సంశయం లేకుండా విశ్వసించాలి. ప్రపంచం మిథ్య అంటే అవన్నీ అబద్ధం అని కాదు. మనలోని ఆత్మ అనే ఆధార వస్తువు ఉంటేనే అవి ఉన్నాయని భావం. కాబట్టి మనం (ఆత్మ) ఆధారంగా లేకుండా ఏవీ ఉండవని అర్థం. దాన్నే "నేను లేకుండా ఏదీ లేదు" అని చెప్పారు. వ్రతాలు, పూజలు, జపతపాది క్రియాకలాపాలు అన్ని మనం చేస్తేనే ఉంటాయి. మనం లేకపోతే అవేవీ లేనట్లే. ఒక్క మనిషికే కాదు, సమస్త ప్రాణులకు ఈ ప్రపంచం తనతోనే మొదలవుతుంది !

జ్ఞానమే అంతిమఫలంగా నిలుస్తుంది !

ఆత్మబోధనలో ఎందుకంత ఉన్నత స్థాయి మాటలు చెప్పారంటే... గురువు, దైవం ఎప్పుడూ తాము గొప్పగా ఉండి పూజలందుకోవాలని భావించరు. మనందరిని అంత ఉన్నతులుగా మార్చాలన్నదే వారి దృక్పథం. అందుకు అవసరమైన జ్ఞానాన్ని అందించడమే ఇక్కడ ఋభుమహర్షి ఉద్దేశ్యం. ఉపదేశాలు, మంత్రాలు , సాధనామార్గాలన్నీ మన ప్రారబ్ధంలోనివి. అవి ఏఏ పద్ధతుల్లో ఎన్ని చేసినా మనకు కలిగే జ్ఞానమే అంతిమఫలంగా ఉంటుంది. మనకు కలిగే అవగాహనే ఆ జ్ఞానంగా  పరిణమిస్తుంది !

ప్రపంచానుభవం నీ విలువ నీకు తెలుసుకోడానికే !!

మనం దేన్నైనా 'అది' అని అంటున్నామంటేనే.. అలా అనటానికి మనం ఉండి తీరాలి. నిద్రలో మనం ఉన్నట్లు మనకు తెలియదు. మన పంచేంద్రియాలు ఏవీ అప్పుడు పనిచేయవు. నిద్రలో ప్రపంచమే కాదు మనం ఉన్నట్లే మనకు తెలియడం లేదు. ఈ ఏర్పాటు అంతా మనం ఉన్నట్లు మనకి తెలియడానికే. జాగృతిలో ప్రపంచానుభవం ఎందుకు కలుగుతుందంటే నీ విలువ నీకు తెలుసుకోడానికే. ఈ సృష్టి అంతా భగవంతుని శక్తి చాటుకోవడానికి కాదు, అసలు వస్తువు విలువ తెలుసుకోడానికే !!

నేనున్నాను అని తెలియడం కోసమే ఈ సుఖ-దు:ఖాల ఏర్పాటు !!

ఈ ప్రపంచం ఏర్పాటే మనని మనం తెలుసుకోవడానికి. మన అనుభవాలు ఏవైనా ఫలితం మాత్రం సుఖమో, దుఃఖమో ఉంటుంది. నేనున్నాను అని తెలియడం కోసమే ఈ సుఖ, దు:ఖాల ఏర్పాటు. అవన్నీ మానసిక ప్రక్రియలు. మనం కావాలనుకునే సుఖం, మనం వద్దనుకునే దుఃఖం రెండూ నిద్రలో ఉండటం లేదు. "నా వల్ల నీవు లేవు. నీ వల్లనే నేనున్నట్లు తెలుసుకుంటున్నావు" అని ప్రపంచం బోధిస్తుంది. ఇది సృష్టిలోని సూత్రం. కాబట్టే పరమసత్యంలో భగవంతుడు అన్న భావంతో సహా అన్నీ మిథ్యేనని చెప్పారు !

ఈ ప్రపంచం 'అసలు నేను" ఏమిటో తెలియజేయడానికి వచ్చింది !!

పరమేశ్వరుడి కళ్యాణగుణాల్లో వినయం అత్యంత ఉన్నతమైనది. అదే  మనకు హనుమంతుడి అవతారంలో అత్యున్నతంగా కనిపించే గుణం.  ఈశ్వరస్వరూపుడైన గురువులో కూడా అదే వినయం ఉంటుంది. ఆయన తన ఘనతతో వ్యక్తం కావాలనుకోరు. వారి ఘనతను మనమే గుర్తించి గౌరవించాలి. ఈ ప్రపంచం "నేను"ని పెంచడానికి కాదు. "అసలు నేను" ఏమిటో తెలియజేయడానికి వచ్చింది. మిథ్య అంటే ప్రపంచం లేదని కాదు ! "నేను" (ఆత్మ) లేకుండా ఏదీ లేదని !!

అనుభవాలన్నీ మనం ఉంటేనే ఉన్నాయి !!

"'నేను'" అనే భావం ఉండగా నిప్పు సెగకే భరించలేని దేహం, అందులోని ప్రాణం పోయిన తర్వాత చితిలో కాలుస్తున్నా కించిత్ నొప్పిని అనుభవించడం లేదు. 'నేను' లేకుండా నన్ను ఏమీ చేయజాలని అగ్ని మిథ్యే. అగ్నికి శక్తి స్వతహాగా ఉందా ? నీవల్ల వచ్చిందా ? భయపెట్టే శక్తి సముద్రానికి ఉందా ? నీవల్ల వచ్చిందా ? మనకు ప్రపంచంవల్ల కలిగే అనుభవాలన్నీ మనం ఉంటేనే ఉంటాయి. ఇప్పుడు మనం 'నేను'ను కష్టంతో , సుఖంతో, సంతోషంతో, దుఃఖంతో కలిపి చూస్తున్నాం. వాటిని వదిలితే అక్కడున్నది అసలు "నేనే" ! 'నేను'ను కష్టంగా తెలుసుకుంటున్నాం. కష్టం ఎవరికో చూస్తే 'నేను' సమాధానంగా వస్తుంది !

మనసుకు అతీతంగా మన ఉనికి ఘనత తెలియాలి !

సద్వస్తువు వద్ద శూన్యత (వెలితి) లేదు. అప్పటి వరకూ వెలితి తప్పదు. అందుకే మనం ఆ వెలితిలేని స్థితికి చేరుకునే వరకు ఏదో ఒకటి మనసుకు వెలితిగానే ఉంటుంది. మనం ఉన్నతంగా భావించే బుద్ధి, వివేకం, వివేచన అన్నీ మనతోనే ముడిపడి ఉన్నాయి. అవన్నీ మిథ్యే అనటంలో ఉద్దేశం, అవి అక్కర్లేదని కాదు. వాటికి అతీతంగా మన ఉనికి యొక్క ఘనతను చెప్పడం. మనవద్ద ఉన్న ఆయుధాలు రెండే.. ఒకటి మనసు, రెండు శుభేచ్ఛ. అవి రెండూ నేను లేకుండా లేవు. సాధకుడు చేసే ధ్యానం, పొందే అత్యున్నత సమాధిస్థితి రెండూ మనసుతో జరిగేవే. శుభేచ్చతో జరిగేవే !

స్వీయజ్ఞానం కోసమే ధ్యానం, సమాధి !!

ధ్యానం, సమాధి ఉన్నతమైనవే. కానీ వాటి ఉపయోగం మనను గురించి మనం తెలుసుకోడానికేగాని ఆస్థితిలోనే ఉండిపోవాలనిపించడం కాదు. ఎందుకంటే తత్ సమాన స్థితిని నిద్రలో రోజూ పొందుతూనే ఉన్నాం. తేడాఅల్లా నిద్రలో తెలియకుండా జరుగుతుంది. సాధనలో తెలిసి జరుగుతుంది. ధ్యానం, సమాధివల్ల ప్రపంచంలో సుఖదుఃఖాలకు నీవే మూలం అని తెలుస్తుంది. అంతేగానీ అవి సుఖదుఃఖాలను తప్పించుకునే మార్గాలుకావు. అలా చేస్తే టీచర్ కొడుతున్నాడని బడి మానేయడంలాంటిదే అవుతుంది !

సహజ ధ్యానం సిద్ధించే వరకూ ధ్యానం కూడా ఒక అనుభవమే !!

నిద్రను ఎవరూ తెచ్చుకోలేరు. దానంతట అది రావాల్సిందే. నిజానికి నిద్ర అనే ఒక ప్రత్యేక అనుభవం అంటూ ఏదీలేదు. మనసు అన్ని అనుభవాల నుండి పొందే ఉపసంహరణే నిద్రగా పరిణమిస్తుంది. అదే పనిని మన ప్రయత్నంతో చేస్తే అది ధ్యానంగా పరిమళిస్తుంది. అది ప్రయత్నంతో పనిలేని సహజ ధ్యానంగా మారేవరకూ... మనకు ఉన్న అనేక అనుభవాల్లాగానే ధ్యానం కూడా ఒక అనుభవంగా ఉంటుంది. అందుకే మనలోని ప్రాపంచిక భావాలను, భయాలను తీసేయడానికి అవసరమైన అనుభవాలకోసం  గురువు/దైవం భౌతిక సంఘటనలనే  వాడుకుంటారు !

ఆత్మవస్తువుకు వచ్చిన కొదువలేదు !!

జ్ఞానాజ్ఞానములు రెండూ బ్రహ్మమేనని చెప్పటంలో ఎంతో ఉన్నతమైన సత్యం ఇమిడి ఉంది. చంటి పిల్లాడు జ్ఞానా ? అజ్ఞానా ? జ్ఞానం యొక్క ప్రమేయం తెలియకుండా అజ్ఞానాన్ని ఎలా నిర్వచించగలం. ఇప్పుడు దేన్నైతే అత్యున్నతమైన జ్ఞానంగా భావిస్తున్నారో అది లేకపోవడం అజ్ఞానం అనుకుంటున్నాము. కాని ఆ రెండు స్థితులు ఉన్నా లేకున్నా ఆత్మవస్తువుకు వచ్చిన కొదువలేదు. కనుక జ్ఞాని, అజ్ఞాని ఇద్దరూ బ్రహ్మస్వరూపాలే అవుతారు. స్వస్వరూపం తెలియడం, తెలియకపోవడం అనే వ్యత్యాసం తప్ప ఆ భగవంతుని సృష్టిలో దేనిలోనూ న్యూనతకు తావులేదు. అందుకే తన స్వరూపం తెలిసిన జ్ఞాని అందరినీ బ్రహ్మస్వరూపంగా గౌరవంతో చూస్తారు !

గమనించడం అనేది పరిణామ క్రియ !!

మనకి దైవాన్ని చూడాలనో, ఇంకా చూడలేదనో ఒక భావం ఉంటుంది. తెలియని వస్తువు విషయంలో మనకా ఆలోచన రాదు. ఒక విలువైన వస్తువు గురించి తెలిసిన తర్వాత అది గోచరం అయ్యే వరకూ ప్రయత్నం ఉంటుంది. గోచరించడం అంటే మనకు స్పృశించేది, కనిపించేది, వినిపించేది, గమనించగలిగేది. గమనించడం అనేది మానసికంగా జరిగే పరిణామ క్రియ. ఒక విషయంలోకి లోతుగా చూడటం పరిశీలన అవుతుంది. మామిడి పండును చూసి తెలుసుకుంటాం. తర్వాత దానిని తిని రుచిని తెలుసుకుంటాం. ఆ రుచిలోని మాధుర్యాన్ని తెలుసు కుంటాం. ఇదంతా గమనింపులో వివిధ దశల్లో జరిగే ప్రక్రియ. దైవం విధాయంలోనూ ఉన్నాడని తెలియడం, ఎలా ఉన్నాడో తెలియడం, ఎక్కడ ఉన్నాడో తెలియడం... ఇలా సాగి ఒక రోజుకి నాతోనే, నాలోని, నాగానే ఉన్నాడని గమనింపులోకి వస్తుంది !

అనుభవాలన్నీ... చిన్మాత్రలే !!

బ్రహ్మము నిరంతర చైతన్య స్వరూపము. అది ఎప్పుడూ స్థబ్దుగా ఉండదు.  అది నిరంతర చైతన్య ప్రవాహంగా ఉంటుంది. అందుకే ద్రవ్యం కూడా చిన్మాత్రము అన్నారు. ద్రవ్యం అంటే కేవలం డబ్బు అని కాదు. ఈ సృష్టిలో మనకు ఉపయోగకరంగా ఉన్న ప్రతీదీ చిన్మాత్రమే. అలాగే కాలం అంటే మనం గడియారాలతో లెక్కించే కొలతకాదు. మన అనుభవాలకు కారణమైనది అని. అనుభవమే కాలం. అనుభవాలన్నీ చిన్మాత్రములే. సూర్యుడు నిత్యప్రకాశి. మరి ఉదయాస్తమయాలు రెండూ అసత్యం. అయినా మనకు అనుభవంలోనివి కనుక చిన్మాత్రలే అవుతాయి !

భావంగా తప్ప నిజంగా బంధం లేదు !!

భగవంతుడు దయామయుడు. కఠిన సాధన చేయమనడు. మనం ఇప్పటికే చేస్తున్నవే, చేయగలిగినవే సాధనగా చెప్తున్నాడు. చూసేది , చూడబడేది, తెలిసేది, తెలుసుకునేది అన్ని చైతన్య ప్రవాహంలో భాగాలే కనుక చిన్మాత్రము కాకుండా ఏదీలేదని గుర్తిస్తే చాలు. అనుభవంగా గోచరించే ప్రతి చైతన్యక్రియలోనూ చిన్మాత్రమే ఉంది. జ్ఞానమార్గంలో బంధం, మోక్షం రెండూ లేవని చెప్తారు. అంటే... ఒకటి ఉందనుకుంటేనే మరొకటి ఉందని గుర్తించమని బోధిస్తున్నారు. బంధంలేని స్థితి మోక్షం. మోక్షం కానిస్థితి బంధం. ఏ ఒక్కటి భావించకపోయినా రెండోదానికి ఉనికి లేదు. ఇది తెలుసుకొని భావంగా తప్ప నిజంగా బంధం లేదని గుర్తిస్తే మనం బ్రహ్మముగానే ఉన్నామని తెలుస్తుంది !

         🙏జై యోగేశ్వర్.🙏

No comments:

Post a Comment