Wednesday, October 19, 2022

మనసు - మార్గం

 *మనసు - మార్గం*

‘మనసుకు ఎంత ధైర్యం... మాట వినడం లేదు’- అనిపించే సందర్భాలు ప్రతి మనిషికీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతూనే ఉంటాయి. ‘నేనెలా నడుచుకోవాలో కూడా చెబుతుందా’ అనే అహం తొంగిచూస్తుంటుంది. మనసును ఎలా అదుపులో ఉంచాలనే విషయాన్ని బోధిస్తుంది భగవద్గీత.
ఆలోచనలు ఎలా ఉంటే మనిషి అలా తయారవుతాడు. సంతోషంగా ఉండాలా, బాధతో గడపాలా అనేది మనిషి చేసుకునే ఎంపికపైనే ఆధారపడుతుంది. బాహ్యపరిస్థితులకు అనుగుణంగా మనసు స్పందించే తీరు ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. బాహ్యపరిస్థితుల కాలుష్యం నుంచి మనసును కాపాడుకోవడం మనిషికి ఎంతో ముఖ్యం. శారీరకమైన శుభ్రతతోపాటు తయారుచేసుకునే ఆహారం, అది తీసుకునే విధానాల్లో శుచిని పాటిస్తేనే ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది. చాలామంది మానసిక శుభ్రత గురించి ఎటువంటి జాగ్రత్తలూ తీసుకొనకపోవడం ఆశ్చర్యపరుస్తుంది.

మనిషి ప్రవృత్తిని అనుసరించి ఆలోచనలు కదులుతుంటాయి. అవి శత్రువులుగా మారకూడదు. మనిషి మనసే స్నేహితుడిగా, శత్రువుగా పనిచేస్తుంటుంది అంటుంది భగవద్గీత. మనసును నియంత్రించడం, దాని అధీనంలోకి వెళ్ళిపోవడం... రెండూ జరుగుతుంటాయి. వివేకంతో దాన్ని రూపొందించుకోవడంలోనే పరిపూర్ణత దాగి ఉంది. స్వచ్ఛమైన మనసు ఇష్టాయిష్టాలను బట్టీ, క్షణికావేశాలను బట్టీ స్పందించదు. సాత్వికమైన వ్యక్తి ఎప్పుడూ నవ్వుతూ, పరిస్థితులకు చలించిపోకుండా ఆనందంగా ఉంటాడు.

మనసు స్వాధీనానికి అడ్డుపడే ఆలోచనలు చెలరేగినప్పుడు వాటికి వ్యతిరేకమైన ఆలోచనలను ఉపయోగించాలని పతంజలి యోగశాస్త్రం చెబుతోంది.

మనిషి కేవలం తన ఆలోచనలతో కోరుకున్నప్పుడు ఈ విశ్వం ఏమీ ఇవ్వదు. చర్యల ద్వారా పూనుకొన్నప్పుడే నెరవేరే అవకాశాలుంటాయని గ్రహించాలి.

చైతన్యస్థితిలో ఉండే మనసు కేవలం తొమ్మిదోవంతేనని మిగిలినదంతా చీకటి, అంతుపట్టని లోతైన అచేతన స్థితేనని చెబుతుంది ఆధునిక మానసిక విజ్ఞానం. దీన్నే దాగిఉన్న వాసనలు అంటుంది వేదాంతం. వీటినుంచే తెలియకపోవడం, తెలుసుకోవడం జరుగుతుంది. ‘ఇది నిస్సహాయ స్థితా... దీనికి పరిష్కారం ఉందా...’ అనే ఆలోచన మనిషికి కలగడం సహజం. మనసును స్వాధీనం చేసుకోవడంలోని రహస్యాన్నంతా శ్రీకృష్ణభగవానుడు రెండు మాటల్లో ఇమిడ్చి బోధించాడు. అవి- అభ్యాసం, వైరాగ్యం.

ప్రతి విషయంలో సంబంధం కల్పించుకోవడం అనేది బానిసతత్వాన్ని అంగీకరించి దాని స్వరానికి అనుగుణంగా నాట్యంచేసే పరిస్థితి కల్పించుకోవడం. ఒక ఆలోచన మరో ఆలోచనకు కొనసాగింపుగా సాగిపోతుంటుంది. ఒక గొలుసులాగా సాగే ఆలోచనలకు ఆధారమై కూర్చుని అంతుపట్టని విధంగా ఎక్కడికో ఈడ్చుకెడుతుంది. మనసు ఒక సాక్షిగా నిలిచినప్పుడు, ఆ ఆలోచనల ప్రవాహాన్ని అనుమతించినప్పుడు వాటంతట అవే నెమ్మదించి సమసిపోతాయి.

కొన్నిరకాల సంకెళ్ల నుంచి బయటపడాలంటే- ఆధ్యాత్మిక మార్గాలైన జపం, ధ్యానం, సత్సాంగత్యం, సామాజిక సేవ, దాతృత్వం... వైపు మనసును మళ్ళించాలి. శరణాగతి అనేది సులభమైన మార్గం. ఆ దైవానికి తలవంచి లొంగిపోవడం, క్షణభంగురమైన, ఆధారపడలేని వాటిపట్ల అనాసక్తతతో జీవించడం అవసరం.

మనసు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు మనం ఊపిరి వేగంగా తీస్తాం. శ్వాస క్రమబద్ధంగా ఉండదు. మనసును శాంతపరచడానికి, శ్వాసను క్రమబద్ధం చేయడం ఒక పద్ధతి. నిండుగా గాలిపీల్చి, వదలడాన్ని క్రమం తప్పకుండా అభ్యసిస్తే- మనసు నిశ్చలంగా మారుతుంది. ఈ ప్రాణాయామానికి గురువు అవసరం ఉంటుంది.

కోరికల నుంచి దూరంగా ఉండటానికి, శూన్యం నుంచి బయటపడటానికి, ఏ విషయంలోనూ మొండితనం లేకుండా సరళస్వభావం కలిగి ఉండేందుకు... మనిషికి సహాయం అందించడానికి ఆ దైవం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు!
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment