*మనో నియంత్రణ*
మానవుడి మనసు అత్యంత చంచలమైనది. దాని నియంత్రణ అత్యంత కష్టతరం. ఒక కుందేలును బంధించాలంటే దాని చెవులనే పట్టుకోవాలి. బాతు అయితే మెడను కోడి కాళ్లను పట్టుకొని మోసుకెళ్ళాలి. అప్పుడే అవి మననుంచి జారిపోకుండా, పారిపోకుండా ఉంటాయి. మర్కటంలా అతి చంచలమైన మనసును బంధించడం అంత సులువు కాదు. ఎంతో కష్టపడి సాధన చేస్తేనే మనసు మన వశమయ్యే అవకాశం ఉంటుంది.
మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు, తనతో యుద్ధం చేయడానికి సన్నద్ధంగా ఉన్న బంధువులను చూసి, విషాదంతో ధనుస్సు, అక్షయ తూణీరం వదిలేసి, సాగిలపడ్డాడు. అప్పుడు కృష్ణ పరమాత్యుడు అర్జునుడికి ధర్మసూక్ష్యాలు,
జీవిత సత్యాలు బోధించి, అతడిని యుద్ధోన్ముఖుడ్ని చేస్తాడు. సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశమే భగవద్గీత. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి మనిషి ఎందుకు తన మనసును తన ఆధీనంలోకి తెచ్చుకోవాలో తెలియజెప్పాడు. ఆ సమయంలో, తన మనసును అదుపులో పెట్టు కోవడం అత్యంత కష్టతరంగా ఉందని అర్జునుడు భగవంతుడికి విన్నవించాడు. అప్పుడు ఏ ఉపాయాలు, ఏ ప్రయత్నాల చేత.. మనసును తమ వశం చేసు కోవచ్చో శ్రీకృష్ణుడు. సవ్యసాచికి తెలిపాడు.
రామాయణంలో రావణాసుర, కుంభకర్ణ, విభీషణులు సోద రులు. రావణాసురుడు మహా శివభక్తుడు. ధర్మ నిష్టలను అనుసరించేవాడు. సీతాదేవి గురించి, ఆమె అందచందాల గురించి, తన సోదరి శూర్పణఖ ద్వారా విన్నాక అతడి మనసు నియంత్రణ కోల్పోయింది. సీతదేవినే చెరపట్టాడు! కుంభకర్ణుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి వరాన్ని పొందాడు. కాని ఆ వరం కోరుకునే సమయానికి, సరస్వతీ దేవి అతడి మనసును ప్రభావితం చేసింది. అందుచేత మనో నియంత్రణ కోల్పోయి, తనకు ఆరు మాసాలు నిద్రపోయేలా వరం ఇమ్మని బ్రహ్మను అడిగాడు.
వైకుంఠంలో జయ విజయులు ద్వార పాలకులుగా తమ విధులను ఎంతో జాగ్రత్తగా నిర్వహించేవారు. వైకుంఠంలో తాము ద్వార పాలకులమన్న గర్వం క్రమంగా వారిలో ఆహంకారం నింపింది. ఒకసారి శ్రీమహావిష్ణువు వైకుంఠంలో లక్ష్మీదేవితో సహా, విశ్రమిస్తున్నాడు. ఆ సమయంలో బ్రహ్మ కుమారులైన సనకాదిక రుషులు నలుగురు, తమకత్యంత ఇష్టుడైన శ్రీమహావిష్ణువును దర్శించడానికి వెళ్ళారు. జయ విజయులు వారిని లోపలికి పోనీయలేదు. బాలకులుగా కనిపించిన ఆ రుషుల్ని చూసి వారు పరిహసించారు. రుషులు . ఎంత వేడుకున్నా వారిని స్వామి దర్శనానికి పంపలేదు. అప్పుడు రుషులు. ద్వారపాలకులను శపిస్తారు.
మన మనసు నియంత్రణలో లేకపోతే లోకంలో అనవసర వివాదాలు. ఆధర్మమైన కోరికలు పీడిస్తాయి. భగవంతుడి సన్నిది కోరుకుంటే, ఆ ప్రయాణం ఎటువంటి మానసిక అవరోధాలు లేకుండా, ఏకోన్ముఖంగా సాగాలి. మనసును పూర్తిగా అధీనంలో ఉంచుకుంటే కానీ, అది సాధ్యం కాదు. మనోనియంత్రణను జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే మన జీవనయానం, జీవితాంతర ప్రయాణం సుఖంగా సంతోషంగా ఉంటాయి.
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment