Monday, November 28, 2022

నీతి కథలు ఏనుగుపిల్ల

 💦 *నీతి కథలు - 172*

*ఏనుగుపిల్ల*

ఓ అడవిలో ఎన్నో జంతువులు ఉండేవి. అవన్నీ దాహం తీర్చుకోవడానికి మధ్యలో ఉన్న చెరువుకి వెళ్లేవి. ఆ చెరువు చాలా పెద్దది. అందులో చేపలు, తాబేళ్లు, మొసళ్లు ఉండేవి.

అక్కడకు వచ్చే ఏనుగుల గుంపులో ఉండే పిల్ల ఏనుగుకు వెలక్కాయంత తిక్కుంది. తన బలం ముందు ఎవరూ సరిపోరని విర్రవీగుతూ, కోరి తగువులు తెచ్చుకుని ఏడిపించేది. చెరువు నీటిలో దాగి కాళ్లతో రొప్పుతూ బురద రేపేది. తొండంతో నీటిని జల్లి అలజడి సృష్టించేది. అలా చేయకూడదని చెప్పిన పెద్ద మొసలితో తగువు తెచ్చుకుని ‘దొంగతనంగా నీటిలో దాగి, గుటుక్కున మింగేసే కపట బుద్ధి మీది. నాకు నీతులు చెబుతావా’ అని ఎగతాళి చేసింది.

ఆ మాటలకు అన్ని మొసళ్లూ బాధపడ్డాయి. చేపలు, తాబేళ్లు వాటిని ఓదార్చాయి.

అది మొదలు పిల్ల ఏనుగు చెరువుకి వచ్చిన ప్రతిసారీ మరింత రెచ్చిపోయి చేపల్ని, తాబేళ్లని భయపెట్టి మొసళ్లని తిట్టి వెళ్లేది. రోజూ

జరుగుతున్నది చూసిన ఓ కుర్ర మొసలికి పిల్ల ఏనుగుకి బుద్ధి చెప్పాలనిపించి పిల్ల ఏనుగు వచ్చినప్పుడు ‘కొండంత బలమున్న పిల్ల ఏనుగా! బాగున్నావా? ఓడిపోతానని తెలిసి నీతో పందెం కాయాలని ఉంది. నా కోరిక తీరుస్తావా?’ అని అడిగింది కుర్ర మొసలి.

తాతల కాలంలో మొసలి చేతిలో భంగపడిన మచ్చ ఎలాగూ తమ జాతికి ఉంది. అది పోయే అవకాశం, సమయం వచ్చాయేమో అనుకున్న పిల్ల ఏనుగు పందెం గురించి అడిగింది. కుర్ర మొసలి ‘బలమైన తాడుకి ఒక చివర నేనూ రెండో వైపు నువ్వూ లాగుదాం. నా బలం నీటిలోనే కాబట్టి చెరువు అడుగుకి వెళతాను. నీ బలం ఉపయోగించి తాడు గుంజి ఒడ్డు మీదకి నన్ను రప్పించు. నువ్వు గెలిస్తే నీ మాట వింటాను. నేను గెలిస్తే మొసళ్లని ఏమీ అనకూడదు. నీటిని పాడు చేయకూడదు’ అంది.

‘ఇంతేనా సరే’ అంది పిల్ల ఏనుగు.

పొలంలో ఉన్న రైతు దగ్గర్నించి తాడు తెచ్చింది కోతి. ఎలుగుబంటి ఏనుగు తరఫున, తాబేలు మొసలి తరుఫున న్యాయనిర్ణేతలుగా నిలబడ్డారు. తర్వాత రోజు పోటీ జరిగింది. బోలెడన్ని జంతువులు, పక్షులు పోటీని ఆసక్తిగా చూశాయి. తాడుకొస నోటితో పట్టుకుని నీట్లోకి వెళ్లింది కుర్ర మొసలి. రెండో కొస పట్టుకుని తొండంతో బలమంతా ఉపయోగించి తాడు లాగింది పిల్ల ఏనుగు. అంగుళమన్నా కదిలించలేకపోయింది. అలసిపోయింది తప్ప ఫలితం కనబడలేదు. పిల్ల ఏనుగు ఓటమిని ఒప్పుకొంది. తాబేలు వెళ్లి కుర్ర మొసలిని పిలిచింది.

కుర్ర మొసలి ‘నీకూ చాలా బలముంది. ఒక దశలో ఓడిపోతానని అనుకున్నా’ అంది. ఆ మాటలకు పిల్ల ఏనుగు పొంగిపోయి బుద్ధిగా ఉంటానని మాట ఇచ్చింది.

మొసళ్లు, చేపలు, తాబేళ్లు కుర్ర మొసలిని అభినందించి ‘నీలో ఇంత బలముందని ఊహించలేదు’ అన్నాయి. కుర్ర మొసలి నవ్వుతూ ‘గెలిచింది బలంతో కాదు తెలివితో’ అంది. అదెలా అని ఆశ్చర్యపోయి చూశాయి. అంతలో తాబేలు ‘మొసలన్నయ్య ఏం చేశాడో చెబుతా. నీళ్ల అడుగున బలమైన పురాతన చెట్టు మొదలు ఉంది కదా. దానికే తాడు కొసను కట్టేసి హాయిగా కూర్చున్నాడు. నేను రమ్మనగానే తాడు విప్పి నీటి మీదకు వచ్చాడు’ అంది.

విషయం తెలియగానే కుర్ర మొసలి తెలివికి ఆశ్చర్యపోయి ‘ఎలాగైతే నేం పిల్ల ఏనుగు తిక్క కుదిర్చి బుద్ధి చెప్పావని’ అభినందించాయి మొసళ్లు.
          💦🐋🐥🐬💦

No comments:

Post a Comment