Sunday, November 27, 2022

మకిలిలేని మనస్సుకల ప్రతి మనిషి విశ్వానికి మిత్రుడు అవుతాడు ,విశ్వామిత్రుడు అవుతాడు! .

 రామాయణమ్.27
.
మనస్సు అనేపుట్టలో చుట్టలు చుట్టుకొని పడుకొన్న కామము అనే సర్పానికున్న కోరలు పీకి ప్రశాంత చిత్తుడై మరల తపస్సు మొదలు పెట్టాడు మహర్షి .
.
ఈయన తపస్సు మహోగ్రంగా పదివేల ఏళ్ళుసాగింది ,ఈసారి రంభను పంపాడు దేవేంద్రుడు తపస్సు భగ్నం చేయటానికి! 
రంభ సౌందర్యానికి ఏ మాత్రం చలించక ఆవిడను కోపంతో శపిస్తాడు. 
.
వెనువెంటనే తన తప్పు తెలుసుకుంటాడు ,అయ్యో క్రోధాన్ని జయించలేకపోతిని గదా ! అని ! .
.
మరల తపస్సుకు పూనుకుంటాడు మహర్షి ! ఇంకొక పదివేల ఏళ్ళు నిరాఘాటంగా సాగుతుంది ,కాస్త విరామమిచ్చి భోజనం చేయాలని సంకల్పించుకొని భోజనం సిద్ధం చేసుకుంటాడు ,
.
అన్నివేల ఏండ్ల తరువాత నకనకలాడే కడుపు పట్టెడన్నం కోరుతున్నది. 
.
దేవేంద్రుడు మరల బ్రాహ్మడి వేషంలో వచ్చి యాచిస్తాడు మహర్షి మారు  మాటాడక తనకై సిద్ధం చేసుకున్న ఆహారాన్ని ఆయనకు సంతోషంగా సమర్పించి! మరల తపస్సుకు కూర్చుంటాడు.
.
ఈసారి తపస్సు చేసినప్పుడు ఆయన శరీరం నుండి జ్వాలలెగసి పడి ముల్లోకాలను దహించివేయసాగాయి ! 
.
అప్పుడు బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై "నీవు బ్రహ్మర్షి వైనావు" అని పలుకగా ఆ మాటలు ఆయనకు తృప్తినివ్వవు! వశిష్టుడే వచ్చి ఆ విషయం చెప్పాలంటాడు . 
.
అంత వశిష్ట మహర్షి అక్కడ ప్రత్యక్షమై ఆయనను బ్రహ్మర్షీ అని సంబోధిస్తాడు! .
.
విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయినాడు!
.
N.B..
.
నవజాత శిశువు మనస్సు ఏవిధమైన మకిలి లేకుండా చాలా స్వచ్ఛంగా ఉంటుంది! 
.
ఎలాగంటే (ఇప్పటి తరాలకు తెలియదుగానీ) ఒక లాంతరు మొదట వెలిగించినప్పుడు దాని గ్లాసు స్వచ్ఛంగా ఉండి లాంతరు వెలుగు చాలా ప్రకాశవంతంగా వుంటుంది. 
.
సమయం గడుస్తూ వున్న కొద్దీ లాంతరు గ్లాసుకు మసి పడుతూ వుంటుంది ,దీపం లోపట అంతే వెలుగుతో ప్రకాశిస్తున్నా బయటకు మాత్రం తేజోహీనంగా కనపడుతుంది! 
.
దీపపు వెలుతురు సరిగా కనపడాలంటే ఎప్పటికప్పుడు గ్లాసు శుభ్రం చేయాల్సిందే.
.
అదే విధంగా శిశువు పెరిగి పెద్ద అయ్యే క్రమంలో మనసుకు ఎన్నో వాసనలు అంటించుకుంటాడు!
.
 మనిషి లౌకిక జీవనంలో తన మనస్సుకు అంటిన మకిలి ని ఎప్పటికప్పుడు పూజద్వారా గానీ ,ధ్యానం ద్వారా గానీ ,మరింక ఇతరమైన ఏ పద్ధతులద్వారా అయినా సరే తొలగించుకుంటూ ఉండాలి .
.
 అలా తొలగించుకొని, మకిలిలేని మనస్సుకల ప్రతి మనిషి విశ్వానికి మిత్రుడు అవుతాడు ,విశ్వామిత్రుడు అవుతాడు!
.
 రామాయణం లోని విశ్వామిత్ర చరిత్ర మనకు చెప్పేది అదే అని నా ఉద్దేశం!
.

జానకిరామారావు వూటుకూరు గారి 
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

No comments:

Post a Comment