Saturday, December 17, 2022

 *శివపురాణం* -26 వ  భాగం:(C)

గణపతి స్వరూపంలో చిత్రమయినది ఎలుక. గణపతికి వాహనం ఎలుక. ఎలుక దొంగతనానికి ప్రతీక. మనతో పాటే ఉంటుంది. మన వస్తువులన్నీ ఎత్తుకుపోతూ ఉంటుంది. మన బ్రతుకూ అంతే. విఘ్నేశ్వరుని ప్రార్థిస్తే మనకి ఆయన పదిమంది హృదయాలను కొల్లగొట్ట గలిగిన దొంగతనమును పొందుతాడు. అనగా ఈశ్వరాభిముఖుడై భగవద్భక్తి చేత తాను మాట్లాడిన మాటలకు పరవశులై చాలామంది హృదయాలను తాను కొల్లగొట్టే దొంగ అవుతాడు. ఇలా మారడానికి ఎలుక విఘ్నేశ్వరుడిని వహించింది. మీరు కూడా అలా వహించడం నేర్చుకోవాలి. పదిమంది ప్రేమను సంపాదించుకోవడం నేర్చుకోవాలి. దీనిని సూచించదానికే ఎలుకను వాహనంగా పెట్టుకున్నాడు. ఎలుక చెవులు పెద్దవిగా ఉంటాయి చేట లాగా. గణపతిని నమ్మి ఆవాహన చేసి జాగ్రత్తగా ఉపాసన చేస్తే లోకంలో పొల్లు తీసేసి సారం వైపుకి మనలను నడిపిస్తాడు. పరమభక్తిని ఇస్తాడు. ఆయన ఆయుధమయిన గొడ్డలితో కర్మ పాశములను తెంచి భక్తీ పాశములను వేసి తన వైపుకి లాక్కుంటాడు.

చవితి తిథి ఆయనకు చాలా ఇష్టమైన తిథి. ఆరోజు ఎవరయినా వినాయకుడి గురించి ప్రత్యేకంగా వినినా, చదివినా వారు ఎంతో ప్రయోజనమును పొందుతారు. పరమ భక్తితో స్వామికి నమస్కారం చేసినా ఎవరు కోరుకున్నది వారికి అనుగ్రహిస్తాడు. విద్యార్థికి విద్య వస్తుంది. ద్రవ్యార్థికి ద్రవ్యం వస్తుంది. కన్యార్థికి కన్య దొరుకుతుంది. పుత్రార్థికి పుత్రుడు పుడతాడు. భోగార్థి అయిన వాడికి భోగములు కలుగుతాయి. మోక్షార్థికి మోక్షం దొరుకుతుంది. రాజ్యార్థికి రాజ్యం, కీర్తి కావాలనుకున్న వారికి కీర్తి వస్తుంది. ఆరోగ్యం కుదుటపడక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్లకి ఆరోగ్యం కలుగుతుంది. ఋణభారంతో ఉన్నవాడికి ఋణం తొలగుతుంది. ఇక్కట్టులలో ఉన్న వాడికి ఇక్కట్టులు తొలగిపోతాయి. గణపతి దర్శనం చేత గణపతి యొక్క అనుగ్రహం చేత గణపతి కథను చదవడం చేత సమస్త శుభములు సమకూడతాయని పెద్దలు మనకు ఫలశ్రుతిని వివరణ చేసి ఉన్నారు. కాబట్టి ఆ గజానన స్వరూపము అంత గొప్ప స్వరూపము.

ఇంతటితో శివపురాణం -26 వ  భాగం సమాప్తమైనది... 

|| ఓం నమః శివాయ |

No comments:

Post a Comment