Tuesday, December 20, 2022

52 అక్షరాలు ( అ నుంచి ఱ వరకు) చదవండి. భలే ఉంది.

 52 అక్షరాలు (  అ నుంచి ఱ వరకు)  
చదవండి.  భలే ఉంది. 

        (అ)మ్మ చేతి గోరుముద్దలు తినిన పిల్లలు
        (ఆ)నందంగా పాఠశాలకు వెళ్లబోతూ,
        (ఇ)ళ్లలోంచి బయట పడుతూనే
        (ఈ)లల గోలల మోతలతో, 
        (ఉ)రుకులు పరుగులతో హడావుడిగా వెళ్లి, బడిలో
        (ఊ)యల, ఉడతల కథలు హాయిగా వింటారు.
        (ఋ)ణ, సంబంధ ఇక్కట్లు తెలియక
        (ౠ) అని తమాషాగా దీర్ఘం తీసుకుంటూ,
        (ఎ)ఱుపు, నలుపు, పసుపు,తెలుపు రంగులు కల
        (ఏ)డు రంగులు కలబోసిన సీతాకోకచిలుకల్లాగా,
        (ఐ)దారుగురు ఆడ,మగ స్నేహితులు కలిసి సరదాగా
        (ఒ)ప్పుల కుప్ప ఒయ్యారి భామా ఆటాడుకుంటూ,
        (ఓ)డల ఒంటెల కథలు ఒకరికొకరు చెప్పుకుంటూ,
        (ఔ)రా నువ్వెంత? నేనే బాగా చెప్పానని విఱ్ఱవీగుతూ, ఇలా
        (అం)దరూ ఎంతగానో సంతోషిస్తూ, ఆనందంగా
        (అః) అః అహహహా అంటూ ముద్దులొలికే నవ్వులతో ఇంటికి వచ్చేస్తారు.

        (క)డుపాత్రం ఎఱిగిన తల్లి అయ్యోపాపమంటూ, అతి ప్రేమగా
        (ఖ)ర్జూరపు పండ్లు నోటిలో దట్టించి పెట్టగా,
        (గ)బ గబా తినేసిన బుజ్జాయిలు, అలా తినిన
        (ఘ)నాహారం జీర్ణమయ్యే వఱకు ఆడుకుంటూ, ఆటల పాటలను
        (జ్ఞ)ప్తికి తెచ్చుకొని, నెమరేసుకుంటూ ఇంటికొచ్చి, తిని, నిద్దరోతారు.

మళ్లీ మరుసటి రోజు యథాప్రకారంగా, అమ్మ పిలుపుతో లేచి,........

        (చ)క చకా తయారై, పాఠశాలకు వెళ్లిపోయి, ప్రార్థన తర్వాత
        (ఛ)లో అనుకుంటూ తరగతుల్లోకి చేరుకోని, 
        (జ)తలు జతలుగా పిల్లలంతా కలసికట్టుగా వెళ్లి
        (ఝ)మ్మని ఎవరి సీట్లలో వాళ్లు సర్దుకొంటుండగా, మాస్టారొచ్చి
        (ఞ) అక్షరాన్ని వ్రాయమంటే, రాక, బిక్కమొహం వేస్తారు. 

        (ట)క్కుటమారు విద్యలనారితేరిన, టక్కరి తుంటరి పిల్లలు
        (ఠ)పీ, ఠపీమని బల్లలపై శబ్దాలు చేస్తుంటే,
        (డ)ప్పుల మోతల్ని మించిన శబ్దాలను విన్న మాస్టారు
        (ఢ)క్కాలు బద్దలు కొట్టినట్లుగా ఎవర్రా అది, అని అరుస్తూండగానే,
        (ణ)ణణణణణ ణ, ణ, ణ అని ఇంటి గంట మోగిన క్షణంలోనే...

        (త)లుపులు తోసేసుకుంటూ,
        (థ)పా థపా మనే శబ్దాలు చేసుకుంటూ,
        (ద)బ్బు దబ్బున తరగతిలోని పిల్లలందరూ
        (ధ)న ధనామంటూ కాళ్ల నడకల శబ్దాల ప్రతిధ్వనులతో 
        (న)లువైపులా పరికిస్తూ, గుడి లాంటి బడి గడప దాటిన పిల్లలు,

        (ప)రుగు పరుగున కొందరు,
        (ఫ)స్టు నేనంటే నేనని పోటీపడుతూ ఇంకొందరు, 
        (బ)యటకు పూర్తిగా వచ్చేసి,
        (భ)లే భలే, ఎవరు ఇళ్లకు ముందుగా చెరుతారని పందెంతో కొందరు,
        (మ)న స్కూలు, 'చాలా మంచి స్కూలబ్బా' అని, ఇంకొందరు,

        (య)థాలాపంగా, ఏ హావభావాలూ లేకుండా కొందరు,
        (ర)య్ రయ్ మంటూ పిచ్చి శబ్దాలతో ఇంకొందరు,
        (ల)గెత్తుకొని, తోటి పిల్లలను తోసేసుకుంటూ,
        (వ)చ్చి పోయే వ్యక్తులను ఓర కంటితో చూస్తూ, దారిపై వచ్చిపోయే
        (శ)కటములను తమాషాగా తప్పించుకుంటూంటే,
        (ష)రా మామూలే, 'వీళ్లెప్పుడూ మారర్రా' అని కొందరనుకుంటుండగా,
        (స)రదాగా అల్లరి చేసుకుంటూ, ఆనందంతో
        (హ)ర్షాతిరేకాలు మిన్ను ముట్టగా, గందరగో-
        (ళ) కోలాహల కలకలాతో రేపు ఆదివారం, సెలవు అనుకుంటూ
        (క్ష)ణాలలో వారి వారి ఇళ్లకంతా, మన కొ-
        (ఱ)కరాని కొయ్యలందరూ తల్లుల ఒడిలోకి చేరి తరిస్తారు.

ఇలా, తమాషాగా 'అఆ ఇఈ లతో, కఖ గఘ లతో' అందమైన ఒక సంఘటనను వర్ణించి చెప్పుకొని ఆనందించవచ్చు. ఇది చదివిన ఉత్సాహవంతులు, భాష మీది 
అభిమానంతో, తెలుగు భాష మీది పట్టుతో, అచ్చులతో హల్లులతో ఇంకా ఎన్నెన్నో అర్థవంతమైన, అందమైన కథలను, సంఘటనలను సృష్టించుకొని, వారి ప్రతిభకు సాన పెట్టవచ్చు. అలాగే, మీ మీ పిల్లలకు ఇలా వ్రాయలని మార్గ దర్శకులు కావచ్చు.

అతి సుందరమైన, సుమధురమైన, సౌమ్యమైన, కమ్మదనం కలబోసిన, తేట తేట తెలుగును, మృదుత్వంతో కూడిన తెలుగునే మాట్లాడండి. తెలుగులోనే వ్రాయండి. తెలుగు పుస్తకాలు చదవండి, చదివించండి. తేనె లొలుకు తెలుగు తియ్యందనాన్ని తనివితీరా జుఱ్ఱుకొని, మనస్పూర్తిగా ఆస్వాదించండి, ఆస్వాదింపజేయండి.

చదివినందులకు ధన్యవాదములు 🙏

No comments:

Post a Comment