Thursday, December 8, 2022

భక్తుడైనవానికి ఉండవలసిన ముఖ్యలక్షణం

 *జై ఆంజనేయ*
*03 డిసెంబర్ 2022*

*భక్తుడైనవానికి ఉండవలసిన ముఖ్యలక్షణం*  

 *శుచిః* :- భక్తుడు శుచిగా ఉంటాడు. ఈ శుచి     లోపల - బయట అంతటా ఉండాలి. కొందరు శరీరం, వస్త్రాలు, పరిసరాలు శుభ్రంగా ఉంటే చాలు అనుకుంటారు. అంతః శుచిని, మనస్సు యొక్క శుచిని పట్టించుకోరు. 

కొందరు మనస్సు లోపల కామక్రోధాదులు, రాగద్వేషాలు లేకుండా శుచిగా ఉంటే చాలు, బాహ్య శుచికి అంత ప్రాధాన్యత లేదు అంటారు. రెండూ సరికాదు. బాహ్యశుచి, అంతఃశుచి - రెండూ ఉండాలి భక్తుడైనవానికి. ఐతే బయట శుభ్రంగా ఉండి, లోపల మురికి అలాగే ఉంటే ఏం ప్రయోజనం లేదు. 

 కబీర్ దాస్ గొప్పభక్తుడు. అతడు మహమ్మదీయుడు. పూర్వజన్మ సంస్కారం వల్ల గొప్ప భక్తుడయ్యాడు. గురుముఖత విద్యను పొందాలని సద్గురువు కోసం అన్వేషణ చేస్తున్నాడు. 

చివరికి ఒక ఆశ్రమానికి వెళ్ళగా అక్కడి వారు ఇతడు మహమ్మదీయుడని తెలుసుకొని పంపించేశారు. ఇలా 4,5 ఆశ్రమాలు తిరిగాడు. అంతటా ఇదే తంతు. చివరకు ఎవరో చెప్పారు, రామానందుల వారిని ఆశ్రయించు, నీ ఆశయం సిద్ధిస్తుంది - అని. 

రామానందుని ఆశ్రమానికి బయలుదేరాడు కబీరు. రామానందుడు చరాచర ప్రాణికోట్లలో భగవంతుని చూడగలిగినవాడు. ఆయనకు అందరూ సమానమే. అయితే శిష్యుల భావం అలాంటిది కాదు. వారికి జాతి, మత, కుల భేదాలున్నాయి. ఒకనాడు కబీరు రామానందుని చేరి, వినయంతో నమస్కరించి, "మహానుభావా! ఈ సంసార ఘోరారణ్యంలో దరిగానక తల్లడిల్లుతున్నాను. ఇప్పటికి ఎన్ని జన్మలో వ్యర్థమయ్యాయి.

ఈ పవిత్ర మానవజన్మ కూడా అజ్ఞానంలోనే గడిచిపోవటం నాకు ఇష్టం లేదు. కనుక తరించే మార్గం తెలుపండి" అన్నాడు. గురువు అతణ్ణి శిష్యునిగా స్వీకరించి ఆశ్రమంలో చేర్చుకున్నాడు. కబీరు  గురువు గారి ఆజ్ఞను తు - చ - తప్పక పాటిస్తున్నాడు.

 శిష్యులు కొంతకాలానికి కబీరు మహమ్మదీయుడని తెలుసుకున్నారు. ఎలాగైనా అతణ్ణి ఆశ్రమం నుంచి వెళ్ళగొట్టాలని గురువు దగ్గరకెళ్ళి, "గురుదేవా! కొంప మునిగింది. ఇతడు మహమ్మదీయుడు. కనుక దైవ సేవను అప్పగించకండి. వంటపాత్రలు తోమే పని మాత్రం ఇవ్వండి" అన్నారు. అలాగే అని గురువు కబీరుకు ఆ పనిని అప్పగించాడు. అదే మహద్భాగ్యం అని కబీరు ఆ పనినే చేస్తున్నాడు. 

 శిష్యులంతా కబీరును వెళ్ళగొట్టటం ఎలాగా? అని ఆలోచన చేస్తున్నారు. అది గమనించిన కబీరు ఒకరోజున పాత్రలు బయట తోమి లోపల అలాగే ఉంచాడు. శిష్యులు గురువుగారికి ఫిర్యాదు చేశారు. గురువు కబీరును పిలిచి ఇలా ఎందుకు చేశావు? అని అడిగాడు. దానికి కబీరు "మహాత్మా! తమ శిష్యుల స్వభావం ఇలా ఉన్నదని తెలియజేయటానికే ఈరోజు మాత్రం అలా తోమాను.

వారు స్నానాదులతో శరీరాన్ని శుభ్రపరుచుకున్నారే గాని మనస్సులో అసూయా, ద్వేషం అనే మాలిన్యాలు అలాగే ఉంచుకున్నారు. ఈ విషయాన్ని తమదృష్టికి తెచ్చేందుకే ఇలా చేశాను" అన్నాడు కబీరు. శిష్యులు శిగ్గుతో తలవంచుకున్నారు. కనుక భక్తుడైన వాడు బాహ్యశుచితో పాటు అంతఃశుచిని కూడా కలిగిఉండాలి. 

 వీలైనంత వరకు మనం కూడా శరీరం శుభ్రతతో పాటు, మనసుని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిద్దాం. 

No comments:

Post a Comment