Sunday, December 25, 2022

ఆత్మవై పుత్ర నామాసి

 *🌸ఆత్మవై పుత్ర నామాసి🌸*

    భగవాన్ రమణ మహర్షి భక్తులలో ఒక భక్తుడి కొడుకు అకస్మాత్తుగామరణించడంతో ఆ బాధను తీర్చగల సమర్ధుడు రమణులే అని భావించి ఆయన వద్దకు వచ్చారు. రమణ మహర్షిని కొన్ని ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలలో అతని బాధ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రమణులు ఎప్పటిలాగా ఆత్మ గురించి విచారణ చేయమని, అసలు బాధపడుతున్నది ఎవరో తెలుసుకోమని సమాధానం చెప్పగా, ఆ సమాధానంతో ఆ భక్తుడు తృప్తి చెందలేదు.

అప్పుడు రమణ మహర్షి నేను ఇప్పుడు విచారసాగరం అనే కధ చెప్తా విను అంటూ చెప్పసాగారు.

*రామ, కృష్ణ అనే ఇద్దరు యువకులు వారు విదేశాలకు వెళ్ళి అక్కడ బాగా చదువుకుని డబ్బులు సంపాదిస్తామని వారివారి తల్లిదండ్రులకు నచ్చజెప్పి విదేశానికి వెళ్ళారు. కొంతకాలానికి వరిద్దరిలో ఒకడు మరణించగా, మరొకడు బాగా చదువుకుని, మంచి జీవనం గడుపుతున్నాడు. కొంతకాలం గడించింది. అక్కడ ఉండే వ్యాపారి తన స్వదేశానికి వెళ్తున్నాడని తెలుసుకుని, తాను ఇక్కడ మంచి జీవనం గడుపుతున్నాని తన తల్లిదండ్రులకు చెప్పమని, వచ్చిన మిత్రుడు మరణించాడని అతని తల్లిదండ్రులకు చెప్పమని ప్రార్ధిస్తాడు. బ్రతికున్న వాడి తల్లిదండ్రులకు తమ బిడ్డ మరణించాడని, చచ్చిపోయిన వ్యక్తి తల్లిదండ్రులకు తమ పిల్లాడు ఉన్నతమైన జీవనం గడుపుతున్నాడని పొరపాటుగా తప్పుడు సమాచారం చేరవేస్తాడు. దాంతో జీవించి ఉన్నవాడి అమ్మనాన్నాలు తీవ్రంగా బాధ పడుతుంటారు. మరణించినవాడి తల్లిదండ్రులు తమ పిల్లాడు ఎప్పటికైనా తిరిగివస్తాడని సంతోషంగా కాలం గడుపుతుంటారు. నిజానికి ఈ తల్లిదండ్రులు ఇద్దరూ తమ పిల్లలను చూడనే లేదు. కాని ఒకరు సంతోష పడుతున్నారు, ఒకరు అవేదన చెందుతున్నారు. మనం కూడా అంతే. మనం మన మనసు చెప్పినవన్నీ నమ్మేస్తాం. అందుకే ఏదీ లేదో అదే ఉన్నదని, యదార్ధానికి ఏది ఉన్నదో అదే లేదని భావిస్తాం. మనం మనసుమాట వినకుండా, హృదయంలోనికి ప్రవేశించి అక్కడున్న పుత్రుని చూసుకుంటే, ఇక బయట ప్రత్యేకంగా పిల్లలను చూసుకుని ఆనందించవలసిన అవసరం లేదు అన్నారు రమణ మహర్షి.*

    *(ఈ కష్టాలు, బాధలు, సంతోషాలు, బంధాలు, బంధుత్వాలు మొదలైనవన్నీ మనసుకే కానీ, ఆత్మకు కావు, ఆత్మయే చిదానంద స్వరూపం. ఆత్మ గురించి తెలుసుకుని, ఆత్మ స్థితిలో ఉండగలిగితే మనల్ని ఏవి బాధించలేవు).*

No comments:

Post a Comment