*🧘♂️76 - శ్రీ రమణ మార్గము🧘♀️*
*శ్రీ రమణ మహర్షి సందేశం పునర్జన్మ ఉన్నట్టా? లేనట్టా?*
*ఎవరి ధర్మం వారిది...*
సాటి మనిషిని మానసికంగా గానీ శారీరకంగా గానీ గాయపరచవద్దని జిడ్డు కృష్ణమూర్తిగారు చెప్పడం చూచి, “ఎవరైనా మీ మీదగానీ మీకు ఆత్మీయులైన వారి మీద గానీ అకస్మాత్తుగా దౌర్జన్యం జరపబోతే, మీరైతే ఏంచేస్తారు?” అని సవాలు విసిరిన వారున్నారు. అందుకు ఆయన “అలాంటి సమయాల్లో మనిషి ప్రవర్తన అంత వరకు అతడు జీవించిన తీరుపై ఆధారపడి ఉంటుందండీ” అని ముక్తసరిగా సమాధానం చెప్పి ఊరుకునేవారు.
దౌర్జన్యానికి బెదిరిన ఒక మనిషి పలాయనం చిత్తగించవచ్చు. మరొకరు అవతలి మనిషి దౌర్జన్యం చేయకముందే, తానే అతడిపై దౌర్జన్యానికి పూనుకోవచ్చు. దెబ్బకు దెబ్బ తీయనూ వచ్చు.
మరే విధంగానైనా నిరోధించడానికి పూనుకోవచ్చు. అతడి స్వభావం మరొకటైతే మంచి మాటలతో ఆ దౌర్జన్యపరుణ్ణి నివారించడానికి ప్రయత్నించ వచ్చు. లేదా బాధను సహించవచ్చు. తన పూర్వ జీవితాన్ని ఎలా మలుచుకొని ఉంటే మనిషి అలా స్పందిస్తాడు; ఇలాగే స్పందిస్తాడని ముందుగా చెప్పలేం. మనిషి మొదటి నుంచి శాంతంగా జీవించి ఉంటే, అతడి మనస్సులో దౌర్జన్య ప్రవృత్తి తొలగిపోయి ఉంటే.
ఆ సందర్భంలో కూడా శాంతంగానే ప్రవర్తిస్తాడు. మనుషులందరికీ ఒకేరకమైన శాంతి మంత్రోపదేశం చేసినప్పటికీ, వారి వారి పుట్టుక, పెరుగుదల, స్వభావ సంస్కారాలను బట్టి ఆయా పరిస్థితులకు అనుగుణంగా వారు ప్రతిస్పందిస్తారు. వ్యక్తి గతంగా ఇది ఎవరికి వారు ఆలోచించుకోవలసిన విషయం.
అల్లరి మూకల్ని అదుపుచేసే బాధ్యతగల పోలీసు యంత్రాంగాన్ని, శ్రుతిమించిన పరిస్థితి ఉదయించినప్పుడు కూడా శాంతంగా వ్యవహరించాలని ఎవరూ ఆశించరు. అలాంటి వేళల్లో బలప్రయోగం అనివార్యం. అలాగే యుద్ధ కాలంలో సంహార క్రియ తప్పదు. ఈ సామాజిక న్యాయాన్ని ఎవరూ కాదనలేరు.
పుణ్య పురుషుల కథ వేరు. వారి ఆధ్యాత్మ సాధన ఫలితంగా, తోటి మానవుల పట్ల సమస్త జీవరాశి పట్ల, కరుణ జనించిన కారణం వల్లా, తమంతట తాము ఎవరికీ
హాని తలపెట్టరు. పెల్లుబికిన ఆ కరుణా భావంలో, తమపై దౌర్జన్యం జరిపిన వారి మీద కూడా, ప్రతిక్రియ జరపాలని వారికి ఉండదు. తిరువణ్ణామలై కొండకింద నిర్మించిన శ్రీ రమణాశ్రమ ప్రారంభ కాలంలో ఒకసారి దొంగలు పడ్డారు.
లోపలి హాల్లో శ్రీరమణుడితోపాటు మరి నలుగురైదుగురు పడుకొని ఉన్నారు. దొంగలు దక్షిణ దిక్కు నుండి లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నారని గమనించి, హాలు వెలుపలి నుండి మరికొందరి సహాయం తెద్దామని కుంజుస్వామి అనే ఆయన ఉత్తరం దిక్కున ఉన్న తలుపు తెరచి బయటికి వెళ్లాడు.
తలుపు తెరవగానే ఆశ్రమంలోని 'జాక్, కరుప్పణ్' అనే రెండు కుక్కలు బయటికి పరుగెత్తాయి. ఆ ద్వారం గుండా బయటికి వచ్చిన కుక్కల్ని అక్కడ కాపువేసిన కొందరు దొంగలు కొట్టారు. ఒక కుక్క అటే పరిగెత్తిపోయింది. రెండవది మాత్రం మళ్ళీ హాల్లోకి పరుగెత్తుకుంటూ తిరిగి వచ్చేసింది.
ఆశ్రమం నుండి తీసుకువెళ్ళదగిన విలువైన వస్తువులు ఏమి లేవని, అయినా లోపలికి రాదలచుకుంటే స్వేచ్చగా వచ్చి, కావలిసినవేవో నిరభ్యంతరంగా తీసుకు వెళ్ళమని రమణుడు, బయటి కిటికీ ఊడదీయడానికి ప్రయత్నిస్తున్న దొంగలతో అన్నాడు.
తమని పట్టుకోవడానికి ఇదేదో పన్నాగం అయి ఉంటుందనే కారణం వల్లనో, లేక మూర్ఖత్వం వల్లనో, వారి పాటికి వారు ఆ కిటికీని పెరికివేసి అందులో నుండి లోపలికి రావడానికి ప్రయత్నిస్తూనే ఉండిపోయారు. ఈ విధ్వంసం అంతా చూడలేక రామకృష్ణస్వామి అనే శిష్యుడు వారిని ఎదుర్కొంటానని అన్నాడు శ్రీ రమణులతో. రమణుడు అతణ్ని వారిస్తూ “వారి ధర్మం వారిది. మన ధర్మం మనది. మనం ఓర్చు కోవాలి. సహించాలి. వాళ్ళకు అడ్డంపోవద్దు" అన్నాడు.
“అవతలి తలుపు తెరచే ఉంది. లోపలికి వచ్చి కావలసినవేవో తీసుకోమని” అన్నప్పటికీ వినకుండా, ఆ దొంగలు గడ్డితో కప్పిన పై కప్పును తగలపెడతామని బెదిరించారు.
"ఆ పని చేయకండి" అని అంటూ శ్రీ రమణులు తనతోటి వారితో బయటికి వెళ్ళి, హాలును దొంగలకు వదిలేస్తానని అన్నాడు. దొంగలు కోరినదిదే కనుక సరేనని అంగీకరించారు.
హాలులో ఉన్న కుక్కను 'ముందు హాలు బయటకు తీసుకు వెళ్ళమని’ తన అనుచరుడితో చెప్తూ (అపత్సమయంలో కూడా జీవకారుణ్యమే ! దాని ప్రాణం తన ప్రాణంతో సమానమనిపించింది) మిగతా వారితో తాను ఉత్తరం దిక్కున ఉన్న ద్వారం వద్దకు నడిచి వెళ్ళారు. ఆశ్రమవాసుల్ని భయభ్రాంతుల్ని చేయాలనో, తమ పనికి అడ్డం రాకుండా నిస్సహాయుల్ని చేయాలనే ఉద్దేశంతోనో ఆ దొంగలు ద్వారం వెలుపలికి వస్తున్న వారందరికీ వరుసగా కర్రతో వడ్డించడం మొదలుపెట్టారు.
ఎడం తొడ మీద కర్ర దెబ్బతిన్న రమణులు "నీకు తృప్తి కలుగకపోతే ఇవతలి ఈ కాలుమీద కూడా కొట్టు నాయనా” అని సూచించాడు. సమయానికి రామకృష్ణస్వామి అడ్డు రావడంవల్ల రమణుల వారికి దెబ్బలు తప్పాయి. అలమార్లు పగులగొట్టినా దొంగలకు విలువైనదేమీ దొరకలేదు. అయినా వెతుకుతూనే ఉన్నారు. గాయాలైన తన అనుచురలను మందురాసుకోండని సలహా ఇచ్చారు రమణులు.
“మరి మీ మాటేమిటి?” అన్నాడు రామకృష్ణస్వామి. “నాకు కూడా కొద్దిపాటి పూజ జరిగింది” అన్నారు రమణులు నవ్వుతూ. శ్రీ రమణుల తొడపై తగిలిన దెబ్బ, తత్ఫలితంగా ఏర్పడిన వాపు చూసే సరికి రామకృష్ణస్వామికి చెడ్డ కోపం వచ్చింది. అక్కడ ఉన్న గడ్డపార తీసుకుని, “వాళ్ళు లోపల ఏంచేస్తున్నారో చూసి రానివ్వండి" అంటూ లేచాడు.
అతణ్ణి వారిస్తూ “మనం సాధువులం. మన ధర్మం మనం వదులుకోడానికి వీల్లేదు. నువ్వు తీరా వెళ్లి వాళ్ళని కొడితే వాళ్ళలో ఎవడో ఒకడు చచ్చిపోవచ్చు. అప్పుడు లోకం వారిని నిందించే బదులు, న్యాయంగా మనల్నే నిందిస్తుంది. వాళ్ళు తమ అజ్ఞానాంధకారంలో చేయగూడని పనులు చేయవచ్చుగాక. మన ధర్మమేమిటో మనం గుర్తెరిగి ప్రవర్తించాలి.
నీ నోటి పళ్ళు నీ నాలికను కొరుకుతాయనుకో. అందుకని ఆ పళ్ళు ఊడగొడుతావా ఏమిటి?" అన్నాడు ఆ మహాపురుషుడు. కనిపించే ప్రతి మనిషీ తానేననే సత్యం ఆయనకు సాక్షాత్కరించిందనడానికి ఇక సందేహమేమిటి?
No comments:
Post a Comment