ఓం నమో భగవతే శ్రీ రమణాయ
అధ్యాయము 30
సద్గుణ రూపుడు భగవాన్
భగవాన్ శ్రీ రమణ మహర్షిగారు ఎల్లప్పుడు మౌనముగా ఎంతో శాంతముగా కూర్చుని ఉండేవారు . వారి దగ్గర వచ్చిన భక్తులు ఎన్నో రకాలుగా ప్రశ్నలను కురిపించినప్పటికి వారు సాధ్యమైనంత వరకు మాట్లాడకుండా మౌనమునే పాటించేవారు . పది ప్రశ్నలు వేస్తే భగవాన్ ఒకే ఒక్క మాటతో జవాబు చెప్పేవారు . ఆ మాట ఎంతో అంతరార్ధము కలిగి భక్తులకు కావలసిన జవాబు దొరికిపోయేది . *భగవాన్ ఎల్లప్పుడు భక్తులకు చెప్పేది కూడా మౌనముగానే ఉండమని సత్యాన్ని తెలుసుకోమని దృష్టిని అంతర్ ముఖము కావించమని లోనున్న ఆత్మనే ధ్యానించమని భగవాన్ చెప్తూ ఉండేవారు* . ఇకపోతే భగవాన్ ఎంతో శాంతమూర్తి . ఎటువంటి సంఘటనలు ఎదురైనను వారి శాంతానికి అటంకము లేకుండానే నిశ్చల స్థితిలోనే ఉండెడివారు . దీనికి ఉదాహరణగా ఒకసారి ఆశ్రమములో దొంగతనము జరిగినది . ఆ దొంగలు మహర్షికి దగ్గరలోనున్న కిటికీని బద్దలుకొట్టి లోపల చొరబడ్డారు . అది గమనించిన భగవాన్ మౌనముగానే కూర్చున్నారు కాని అరవటము కాని వారిపై తిరగబడటముకాని చేయక నిశ్చలముగా ఎంతో శాంతముగా ఆ స్వామి కూర్చుని యున్నారు . బైట ఉన్న ఇద్దరు ముగ్గురు భక్తులు గమనించగా భగవాన్ ఇట్లనినారు , “ *వాళ్ళని వాళ్ళ ధర్మము చేసుకొనీ మనము మన ధర్మానికి కట్టుబడి ఉందాం . వాళ్ళ ఇష్టాన్ని కాదనక మనం భరించాలి . ఓపిక పట్టాలి . వాళ్ళకి ఏమీ అంతరాయం కలిగించవద్దు* ” అని ఆ మహానుభావులు ఎంతో శాంతముగా ఉండినను చుట్టు ఉన్న భక్తులపై ఆ దొంగలు వారివద్దనున్న కర్రలతో కొట్టగా ఒక దెబ్బ భగవాన్ ఎడమ తొడపై కూడా తగిలింది . ఐనా మహర్షి తన సహనాన్ని , శాంతాన్ని , మౌనాన్ని వదలక “ *నీకు ఇది చాలకపోతే రెండవ కాలిమీద కూడా కొట్టండి " అని అన్నారట . ఆ దొంగల బెదిరింపుకు భయపడక భగవాన్ పైగా “ మేము హాలంతా మీ ఆధీనములో ఉంచి బైటకు వెళతాము . మీక్కావలసింది తీసుకుని మీ ఇష్టము వచ్చినట్లుగా చేసుకోమని చెప్పారు* . ఆ దొంగలు బీరువా పగులగొట్టి కొన్ని వస్తువులను , డబ్బును
92 తీసుకుని పారిపోయినారు . దొంగలు వెళ్ళిపోయిన తరువాత భగవాన్ నవ్వుతూ తనకి , “ *చాలినంత పూజ జరిగింది ” అని అన్నారు . పైగా మనం సాధువులము . మన ధర్మాన్ని విడనాడరాదని భగవాన్ బోధించినారు* . పోలీసులు ఈ సంఘటన జరిగిన పిదప వచ్చి మహర్షిని వాజ్ఞులము ( వాంగ్మూలము ) అడుగగా భగవాన్ ఇట్లనిరి , “ కొందరు ఆశ్రమములో చొరబడుట నిజమే కాని ఏమీ దొరక్కపోవుటచే వెళ్ళిపోయినారని " తనకి తగిలిన దెబ్బలు కూడా చూపకుండా మహర్షి వచ్చిన పోలీసులను తిరిగి పంపించినారు . భగవానకు జరిగిన ఈ సంఘటన చూస్తే వారు ఎంత కరుణామయులో , శాంతమూర్తులో మరియు వారి మౌనము ఎంత గొప్పదో తెలుస్తుంది.
భగవాన్ ఎంత శాంతమూర్తియో అంత నిరాడంబరుడు కూడ . ఒక భక్తుడు భగవాన్ కి వెండి పాత్రలు ఇచ్చి వాడుకోమని అనగా భగవాన్ వాటిని తమ బీరువాలో ఉంచుకొనక ఆఫీసుకు పంపించి పైగా ఆ భక్తుని ముందు “ *రేపటి నుండి సొంత కప్పు వాడుకుందాం , తీసివ్వు ” అని అనగా చివరికి ఆ సొంత కప్పులేమిటంటే టెంకాయ చిప్పలు అని చూపించారు* . “ మనకెందుకు ఆడంబరములు ఖరీదైనవి ఆశ్రమములో ఉంటే వాటిని కాపలా కాయాలని కొందరు స్వామి కదా అని వాటిని అడిగినా అడిగెదరు . దానికి కాదనేందుకు వీలులేదు అని భగవాన్ చెప్పినారు .
మరియొక భక్తుడు పాదుకలను చేయించి వాటి పై బంగారు పుష్పములు పెట్టి భగవాన్ కి సమర్పించి ఆ పాదుకలు వేసుకొని కొండ మీదికి వెళ్ళమని కోరగా భగవాన్ ఇట్లనినారు . “ *నాకు పాదుకలున్నవే ” అంటూ తమ పాదాలను చూపిస్తూ “ ఇవిగోనండి నా పాదుకలు . ఇవి భగవంతుడిచ్చిన పాదుకలు . మీ పాదుకలు ఏమి చేసుకోను ” అని అన్నారు* .
భగవాన్ చివరికి వంటిపై కూడా ఎటువంటి వస్త్రములు ధరించక కేవలము ఒక కౌపీనముతో కాలము గడిపేవారు . ఆ కౌపీనానికి కూడా బెజ్జాలు పడితే భగవాన్ సూది మరియు దారం కొనేందుకు కూడా డబ్బును యాచించక ఒక ముల్లుతో ఆ కౌపీనములోని దారాన్నే తీసి కుట్టుకొన్నారు . పైగా వారి కౌపీనము గురించి ప్రశ్నిస్తే భగవాన్ ఇట్లనినారు , “ *దేవేంద్రునికి వేయి కళ్ళున్నట్లు నా కౌపీనానికి వేయి కళ్ళున్నాయి* . ” భగవాన్ పాత కాగితాలన్ని ఏరి అది ఒక పుస్తకముగా కుట్టుకుని వాటిలో వ్రాసుకునేవారు . భగవాన్ ఒక తుండుగుడ్డ కౌపీనము తప్ప మరేదీ ముట్టలేదు . వచ్చిన భక్తులు ఖరీదైన వస్తువులు , దుస్తులు , శాలువలు తెచ్చినప్పటికి భగవాన్ ముట్టేవారు కారు . చివరికి ఒక భక్తుడు ఒక టేబుల్ ఫ్యాన్ భగవాన్ కివ్వగా *భగవాన్ తన విసనకర్ర చూపుతూ నాకు చేతులున్నవి కదా కావలసినచో విసురుకొనెదనని అన్నారు* . భగవాన్ తమ పాదములకెప్పుడు చెప్పులు తొడిగేవారు కాదు . చివరికి వారు ఎంత కరుణామూర్తి అంటే చెట్టుకి బాధ కలిగినను వారు ఓర్చుకొనలేక పోయేవారు . ఒకసారి ఒక భక్తురాలు లక్ష తులసిపత్రి వ్రతం చేసెనని భగవాన్ కి చెప్పగా భగవాన్ ఇట్లనినారు , “* ఆ చెట్టుని అన్నిసార్లు గిల్లటంకన్నా లక్షసార్లు నిన్ను నువ్వు గిల్లుకో పోయవా* ? "
ఒక భక్తుడు తన భార్యపోయినదని తన పిల్లలు తల్లిలేనివారయ్యారని ఏడ్చుచూ భగవాను చెప్పగా స్వామి మౌనవ్రతుడై కొంతదూరం ఆ భక్తునితో ముందుకువెళ్ళి రెండు మేక పిల్లలను చూపించి ఆ భక్తుడితో ఇట్లనినారు . “ *వీళ్ళు కూడా తల్లిలేని పిల్లలే* ” అని సంబోధించినారు .
భగవాన్ అందరిని సమాన దృష్టితో చూచేవారు . ఈ పక్షపాతము వారికడ ఉండదు . ఆశ్రమములో భోజన సమయము భక్తులకు ఒక రకమైన వండిన పదార్ధములు భగవాన్ కి ప్రత్యేక పదార్ధములు ఆశ్రమమువారు చేసి పెట్టినచో దానిని అంగీకరించక భక్తులు ఏ పదార్ధాన్ని అయితే తింటున్నారో దానినే భగవాన్ కూడా స్వీకరించేవారు . ఉదాహరణకు భగవాన్ కి చిక్కటి మజ్జిగ పోసినచో భక్తులకు కూడా ఆ చిక్కటి మజ్జిగనే పోయమనేవారు .
భగవానునిలో ఉన్న మౌనము , శాంతి స్వరూపము , కరుణ , నిరాడంబరము మరియు సమత్వము అగు సద్గుణములు ఇవన్ని కూడా మనకి కూడా కలగాలని ఆ రమణ మహర్షిని శరణు వేడుతూ కోరుదాం .
అరుణాచల శివ.
No comments:
Post a Comment