Friday, January 27, 2023

శ్రీ రమణాయ అధ్యాయము 40 ( భగవాన్ శ్రీ రమణ మహర్షి అవతారము ముగించుట తరువాయి భాగం )

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ
 అధ్యాయము 40 
( భగవాన్ శ్రీ రమణ మహర్షి అవతారము ముగించుట తరువాయి భాగం )

      భగవాన్ వారి చేతిపై వచ్చిన వ్రణము తద్వారా పొందిన భయంకరమైన చికిత్సలు రోజురోజుకీ వారి ప్రణబాధ వారు పడకపోయినా వారి భక్తులెల్లరు ఆ బాధను తట్టుకొనలేక భగవాన్ వద్ద మొరపెట్టుకుని సంకల్పముచేసుకుని వారినే నయము చేసుకోమని భక్తులు కోరగా భగవాన్ “ *శరీరము ఒకటున్నదని ఆ శరీరానికి చేతులున్నవని అందులో ఒక చేతికి వ్రణం ఉందని మీరంటుంటే నేను విని ఆ దృష్టితో చూస్తే తప్ప లేకుంటే నాకేమీ తెలియడం లేదే ? ఎవరి కొరకు సంకల్పం తెచ్చుకోవాలి . నిజానికి మానవుడు సజీవంగా ఉన్నప్పుడు కూడా ఈ దేహం చచ్చినదే . ఎందుకంటే శరీరం నిర్జీవ పదార్థం కదా . దానికి ఆత్మఛాయ ఆవరించుటచే దానిలో చైతన్య క్రియాశక్తి కనిపిస్తుంది ” అని అనగా భక్తులు “ మా కొరకు సంకల్పం తెచ్చుకోండి " అని మళ్ళీ కోరగా భగవాన్ " తమరొకరున్నారా ఇక్కడ ? అంటే వారికి భేద దృష్టి ఏ మాత్రము లేదని తెలియుచున్నది* . వైద్యులు ఆ పుండులో వున్న చెడునెత్తురుని తీసివేయుటకై ఆ పుండును *జలగలచే కరిపించారు . అవి భగవాన్ చెడు నెత్తురుని పీల్చి పీల్చి ఆ కురుపుకు అంటుకుపోయి వ్రేలాడినవి* . నిజానికి అటువంటి బాధ ఎవ్వరూ భరించలేరు . భగవాన్ ఏ చలనము లేకుండా వైద్యులతో “ ఆ జలగలు జ్ఞానుల్లాగా సమాధిలోకి పోయినట్టులన్నవే ” అని అన్నారు . పైగా భగవాన్ “ *ఆ వ్రణం ఎందుకు వచ్చిందో దాని పని అది చూసుకుంటుంది ” అని చెప్పినా మీరు ఊరుకోలేదు . కత్తులతో కోసి మొదలు పెట్టుటవల్ల అది మీ పని ఇట్లా ఉందా అని బుస్సున పెరిగి కూచుంది . ఇక మీ ఇద్దర మధ్య యుద్ధమే . ఎవరు గెలుస్తారో మనదేం పోయింది ?" అన్నారు భగవాన్ ఒక మధ్యవర్తిలాగా* . ఒక్కొక్కసారి ఆ విషగ్రంధి వల్ల భగవాన్ కి చలి జ్వరం వచ్చేది . ఐనను భగవాన్ మామూలుగా హాల్లో వణుకుతూ కూర్చుండేవారు . భక్తులు భగవాన్ ని చూచి అయ్యో శరీరం వణుకుతుందే అని అనుకొనగా భగవాన్ " *ఓహో శరీరమా వణుకుతున్నదా ? వణకనీ ” అని అనేవారు పైగా అది నటరాజ తాండవమయ్యా దానికి ఎందుకు గాబరా అనేవారు*. భగవాన్ ఇన్ని బాధలు ఉన్నప్పటికీ భగవాన్ ని వైద్యం చేసే వైద్యులు తట్టుకొనలేక ఏడ్చారుకాని భగవాన్లో మటుకు ఎటువంటి బాధ పడలేదు . కొందరు భక్తులు భగవాన్ కోలుకోవాలని విశేష పూజలు చేస్తూ ఉంటే భగవాన్ " *అది మంచి పనే ధనవంతులకు కైంకర్యంమౌతుంది . బ్రాహ్మణులకు భోజనం లభిస్తుంది* " అని అనేవారు . చివరికి మూడవ ఆపరేషన్ కూడా జరిగినా ఏమీ మార్పు రాలేదు . అది తగ్గినట్లుగా తగ్గి పాత గ్రంధి ప్రక్కన ఇంకొక గ్రంధి కనబడి ఇది కూడా విషగ్రంధేనని గ్రహించి మళ్ళీ ఆపరేషన్ చేసినా ఉపయోగం లేకపోయింది . కొన్ని నెలల తరువాత ఇంకొక గ్రంధి కనబడింది . ఐనా భగవాన్ లెక్క చేయలేదు . రాను రాను వారి ఆరోగ్యంలో మార్పు రావుటచే వారు తమ దర్శనాన్ని హాలులోకి వచ్చి ఇవ్వకుండా వారున్న గదిలోనే ఉండి దర్శన మిచ్చేవారు . నాల్గవ ఆపరేషన్ కూడా చేశారు . దాని తరువాత వారికి వాంతి చేసుకుని ఇక ఆహారము తీసుకొనడం మానేశారు . 19.03.1950 తెలుగు ఉగాది పండుగ వికృతి నామ సంవత్సరము కావటం వల్ల ఆ ముందురోజు ఒక భక్తురాలు ప్రతి సం || ము తన ఆనవాయితీ ప్రకారము ఒక తుండు గుడ్డ , కౌపీనము భగవానక్కు తెచ్చి ఉగాది ముందురోజు అనగా 18.03 . 1950 న ఇవ్వగా భగవాన్ “ *ఓహో వచ్చిందీ ఉగాది ? వికృతి వచ్చింది* ” అని అన్నారు . 

      భగవాన్ వారు తమ అవతారము కొద్దిరోజులలో చాలిస్తారనగా ఒక పార్సీ భక్తుడు తన మతం ప్రకారం ఉదయించే సూర్యుడికి నేను సాష్టాంగ పడుతున్నాను అని ప్రార్థించగా భగవాన్ వెంటనే , “ *సూర్యుడు అస్తమిస్తున్నాడు . అదెట్లా సందర్భ పడుతుంది ” అని ముందే సూచించారు* . ఇంకొక భక్తుడు ఒక ఆయుర్వేదం డాక్టర్ని పంపించగా భగవాన్ “ *ఎంగిలి విస్తరిది ఎవరైనా జాగ్రత్త చేసుకుంటారా* " అని అన్నారు . ఏప్రిల్ 12 వ తేదీ 1950 వ సం || న భగవాన్ మందు పుచ్చుకొనుట పూర్తిగా మానివేసినారు . ఏప్రిల్ మొదటి వారం నుండే ఆయనకు మందులు ఇవ్వటానికి భక్తులు వస్తే భగవాన్ కి మందులన్న విసుగు వచ్చింది . 12 వ తేదీన వారసలు మందే పుచ్చుకొనలేదు . ముందురోజు రాత్రి భగవాన్ కి ఆయాసం రావటంచే వారి బంధువు మందు ఇవ్వగా “ *రెండు దినములలో పోవు దానికి మందెందుకు ?* " అని అన్నారు . అనగా భగవాన్ ఏప్రిల్ 14 , 1950 వ సం || న వారు నిర్యాణము అవుతున్నట్లు ముందుగనే సూచించినా భక్తులు తెలుసుకొనలేకపోయినారు . 

       మహాపురుషులకు జనన మరణములనేవి ఉండవు . వారు ఎలా అవతరించినారో అలాగే తమ అవతారమును చాలించెదరు . వారు తమ దేహాన్ని వదిలే మునుపు కొన్ని సూచనలు ముందుగానే ఇస్తారు . మానవమాత్రులమైన మనము వాటిని గ్రహించలేము . భగవాన్ వారు పడ్డ బాధలు పై రెండు అధ్యాయాలలో చదివితేనే మనము తట్టుకొనలేక ఎంతో నొప్పి మన గుండెకు కల్గినట్లు కనబడుతుంది . *మనకి ఆ మహాపురుషులకి భేదం ఇదే*. స్వయముగా భయంకరమైన బాధను అనుభవించిన భగవాన్ ఎటువంటి బాధ వారి కళ్ళల్లో కన్నీరు కాని ఎక్కడ కనిపించలేదు . వారసలు ఒక దేహమని అనుకుంటే కదా అలాంటి బాధలు పడి దుః ఖించటానికి . మనము మనదేహముపై ఉన్న వ్యామోహంచేత చదివితేనే తట్టుకొనలేక అటువంటి బాధలు ఎవ్వరికి రాకూడదని అనుకుంటూ ఉంటాము . మామూలు జ్వరమువస్తేనే భయపడి పదిసార్లు ఒళ్ళు వేడిగా ఉన్నదా లేదా అని చూసుకుంటాము . చిన్న గాయం తగిలితే పెద్ద కట్టుకడతాం . ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అని ప్రశ్నించుకుంటే వ్యామోహం దేహముపై గల మమకారం ఇంకా ఇంకా జీవించాలని ఆశ . ఆ ఆశ ఉండాలికాని దీని పైనను అని ప్రశ్నించుకుంటే భగవంతుడు ఇచ్చిన ఈ మానవ జన్మ సార్ధకము చేసుకోవాలని దానికై ప్రాపంచిక సుఖాలకు లోబడి అశాశ్వత వస్తువుల కొరకు అదే ఆనందం అని భ్రమించి మధ్యమధ్యలో ఇటువంటి రోగాలు కలిగినపుడు దేహము పైనున్న మమకారం చేత బాహ్య ప్రపంచము సుఖమని అనుకొనుటచే దుఃఖమునకుపాలై మరణం అంటేనే భయపడి ఇంకా జీవించాలని ఆ మాయాజాల ప్రపంచములోనే కొట్టుమిట్టాడుతూ జన్మిస్తూ మరణిస్తూనే ఉంటాడు తప్ప శాశ్వతమైన సత్యాన్ని , ఆ నేనును అంటే ఆత్మను తెలుసుకోడు . కావున దైవమిచ్చిన ఈ జన్మ సార్ధకము కావాలంటే దృష్టిని అంతర్ముఖము చేసిన వానికి శాశ్వతమైన నేనును అన్వేషించు వానికి అటువంటి ఆత్మజ్ఞానికి భగవాన్లోగా ఎటువంటి బాధలు వచ్చినా వాటిని పట్టించుకొనక నిరంతరం ఆత్మ నిమగ్నులై ఉండుటచే మరణమన్న వారికి భయం ఉండదు . *కాని మరణానికి అటువంటి జ్ఞానిని చూస్తే భయపడును* . కావున నేను దేహమును కాను ఆత్మను నాకు మరణమే లేదు . ఈ రోగాలు బాధలు అన్నీ జడమైన శరీరానికి కేకాని ఆత్మకు కాదు అనే ఎరుక ధైర్యం అటువంటి బాధలు వచ్చినా తట్టుకొనే శక్తి భగవాన్ ని చూసిన తరువాత ప్రతివారు నేర్చుకోవాలని ఆ జ్ఞానం సంపాదించుకోవాలని అంతటి శక్తిని పొందటానికి భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారిని ప్రార్ధిద్దాం . 

ఓ రమణా నీవే మాకు శరణాగతి . 

అరుణాచల శివ 

No comments:

Post a Comment