Friday, January 27, 2023

🧘‍♂️91 - శ్రీ రమణ మార్గము🧘‍♀️* *సిద్ధ పురుషుడు:-*

 *🧘‍♂️91 - శ్రీ రమణ మార్గము🧘‍♀️*


*సిద్ధ పురుషుడు:-*

శ్రీ రమణుడి అభీష్టం నెరవేర్చడం తన పరమ కర్తవ్యంగా భావించిన అమృతానంద, ఆయన నోటి నుండి వెలువడే మాటకు ఎంత ప్రాధాన్యమిచ్చేవాడో మరో విషయం చెబితే తెలుస్తుంది. ఒకసారి అమృతానంద యాత్రలు చేస్తూ చాలా చోట్లకుపోయి, రిషీకేషు కూడా వెళ్ళి, ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఒకప్పుడు గోవిందగిరి అనే ఒక సాధకుడు, రమణుణ్ణి దర్శించుకున్న తర్వాత, రిషీకేశ్లోని ఆ ఆశ్రమానికి వెళ్లి, తిరువణ్ణామలైకి తిరిగి వచ్చిన తర్వాత, ఒక రోజున రమణుడు ఏదో పుస్తకం గురించి అడిగాడు. ఆ పుస్తకాన్ని అమృతానంద రమణాశ్రమంలో చదువుకోడానికని తీసుకొని, అనుకోకుండా రిషీకేష్ ఆశ్రమంలో వదిలేసి వచ్చానని చెప్పాడు.

మర్నాడు అమృతానంద రమణాశ్రమంలో కనిపించలేదు. మధ్య మధ్యలో ఈ విధంగా అదృశ్యం కావడం అమృతానంద విషయంలో ఆశ్రమంలో అందరికీ అనుభవమే కాబట్టి, దీనిని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆశ్రమం నుంచి అరువు తీసుకొని రిషీకేష్లో వదిలేసిన ఆ పుస్తకం కోసమై, అతడు అప్పటికప్పుడే తిరువణ్ణామలై నుండి బయలుదేరి మళ్ళీ రిషీకేష్ వెళ్ళి వచ్చాడని, తర్వాత తెలిసింది. రైల్వే వారు కూడా ఇతడి బీద వేషం చూచి, టిక్కెట్టు చూపించమని అడిగేవారు కాదు. కొన్నాళ్ళకు పుస్తకంతో సహా అమృతానంద మళ్ళీ రమణాశ్రమంలో కనిపించి, ఆ పుస్తకం రమణుడి చేతుల్లో పెట్టాడు. రమణుడి వాక్కు అమృతానందకు అనుల్లంఘనీయం ! శ్రమ ఎంతటిదై నప్పటికీ అదొక లెక్కలోనిది కాదు.

శ్రీ రమణుల తల్లి మరణించినప్పుడు, ఆమెను కొండ కింద ఉన్న ప్రదేశంలో సమాధి చేశారు. అక్కడి మొదటి పూలచెట్లను అమృతానందే నాటాడు. ఈ ప్రాంతం అంతా ఇప్పుడో చిన్న ఉద్యానవనంగా రూపొందింది. కొంతకాలం అనంతరం అతడు జాఫ్నాకు తిరిగి వెళ్ళి అక్కడే మరణించాడు. రమణుడికి ఈ వార్తను అందచేసినప్పుడు “అమృతానంత గొప్ప సిద్ధపురుషుడు” అన్నాడు.

ఎంతటి వాడినైనా రమణుడు ఊరకనే ప్రశంసించడనే మాట పాఠకులకు తెలియనిది కాదు. ఆ మాటకొస్తే “ఉన్నది ఉన్నట్లు చూచే వాడెప్పుడూ ఉన్నది ఉన్నట్లు తప్ప మరో విధంగా మాట్లాడడు. ఈ లోకుల నుంచి అతడాసించేది ఏమీ ఉండదు. కాబట్టి అనవసరంగా ఎవర్నీ మెచ్చుకోవలసిన పనిలేదు.

అమృతానంద సిద్ధపురుషుడనడానికి రమణుడికి మరెన్నో విషయాలు తెలిసి ఉండవచ్చును. కానీ ఆ సందర్భంలో రమణుడు చెప్పిన ఈ ఉదంతము ఒకటి తెలుసుకుంటే, రమణుడు ఆ మాట ఎందుకన్నాడో మనకూ కొద్దిగా స్ఫురిస్తుంది. ఒకసారి జాఫ్నాలో వర్షపు చినుకు పడనందువల్ల తీవ్రమైన క్షామం ఏర్పడింది. 

ఆ ప్రాంతంలో వర్షం పడేట్లుచేసి సస్యశ్యామలం చేయాలని అమృతానంద అభిప్రాయపడ్డాడు. అందుకని అక్కడే అడవిలో ఉన్న మరియమ్మన్ ఆలయానికి కుంభాభిషేకం చేయించాలని అమృతానంద నిశ్చయించాడు. బీదలకు అన్నదానం కూడా జరగడానికి ఏర్పాట్లు గావించ నారంభించాడు. కుంభాభిషేకం ముందు రోజు కొబ్బరికాయలు, నిమ్మకాయలు, బెల్లం మొదలైన వస్తు సామగ్రి తీసుకు వచ్చి, ఆ గుడి వద్దనున్న ఓ గదిలో దాచారు. ఆ గది తాళపుచెవి అమృతానంద చేతికిచ్చి చూచుకోమన్నారు.

కుంభాభిషేకం ముందు రోజునే చాలా మంది పేదలు, పెద్ద చిన్నా, ముసిలీ ముతకా, అంతా ఆ రాత్రికి అక్కడికి చేరుకున్నారు. ఆ ఎండాకాలంలో నడిరాత్రి వేళ వారందరికీ అమితంగా దాహం వేసింది. పిల్లలు ఏడవ నారంభించారు. పెద్దలు మూలుగుతున్నారు. అమృతానంద వీరందరి బాధ చూడలేకపోయాడు. ఓ పెద్ద పాత్ర తీసుకొని, లేత కొబ్బరికాయలన్నిటినీ కొట్టి ఆ నీరు ఆ పాత్రలో పోశాడు. నిమ్మకాయలు పిండి ఆ రసం కూడా అందులో పోశాడు. ఇంత బెల్లం కలిపాడు. కావలసినన్ని మంచినీళ్ళు పోశాడు. అక్కడి వారందరికీ ఈ మధుర పానీయం అందించాడు. అక్కడి పేదవారందరూ దాహం తీరి చాలా ఉపశమనం పొందారు.

మర్నాడు కుంభాభిషేకానికి ఆ ఆలయం వద్దకు వచ్చిన వారికి, ఈ విరిగిన కొబ్బరి చిప్పలు, నిమ్మకాయ తొక్కలు కనిపించాయి. 'ఇదేమిటని' అమృతానందను అడిగారు. “నేటి కుంభాభిషేకానికి అవసరమైన కొబ్బరికాయలు నిమ్మకాయలు, మిగతా వస్తువులు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ పడివున్న మిగతా కాయలతో నేను నిన్న రాత్రే కుంభాభిషేకం చేశాను. మానవ సేవే మాధవసేవ అంటారు కదా?" అని సమాధానం చెప్పాడు అమృతానంద. అతడు చేసిన పనిని ఎవరూ విమర్శించకపోగా, అందరూ అతణ్ణి ప్రశంసించారు. “అమృతానంద అంతటి ఆత్మోన్నతి కలిగినవాడు” అని ముగించాడు శ్రీ రమణుడు.

రమణుడి భక్తి భావంలో జాలి, దయ, కరుణ, మానవత్వం మొదలైన గుణాలకే అధిక ప్రాధాన్యం ఉండేది. అలాంటి రమణుడికి అమృతానంద మీద అభిమానము ఉండటంలో ఆశ్చర్యమేముంటుంది?

అయితే ఆత్మసాక్షాత్కారం కలిగిన రమణ, అమృతానంద వంటి వారి మానవ సేవ మాధనసేవగా రూపొందడం వేరు. మనవంటి వారు ఇదే పదాలను వాడుతూ ప్రారంభించే ఆలోచనాపూర్వకమైన 'మావనసేవ' ఉద్దేశం వేరు; ఉద్దేశపూర్వకమైన ఈ సేవ ఏదో ఒక ఫలితాన్ని ఆశిస్తుంది. మనది అవ్యాజమైన కరుణ కాదు. 

అలాంటి కరుణ, లేక ఆత్మ, మనిషికి సాక్షాత్కరించిన తర్వాతనే, అంటే తనను తాను తెలుసుకొని నందువల్లనే, మానవుడెవరో అర్థమవుతుంది. అది అర్థమైనప్పుడు, ఆశ మిగలదు; కరుణ మాత్రమే ఉంటుంది. ఆ కరుణకు కారణం ఉండదు.

*మోక్షప్రాప్తి*

మోక్షమనగా నీవు పుట్టనివాడవని తెలుసుకోవడమే. నిశ్చలత్వము పొంది ‘నేనే బ్రహ్మము’నని తెలుసుకో. నిశ్చలత్వము పొందడమంటే మనోభావన లేవీ లేకుండా ఉండడం. కావలసినది 'తెలుసుకోడం' గాని 'భావించడం' కాదు 

No comments:

Post a Comment