జాగ్రదావస్థ ఒక స్వప్నం లాంటిది. ప్రపంచాన్ని స్వప్నంగా చూడాలి. నిద్రపోతున్నప్పుడు వచ్చే కలలో అన్నీ నిజంగానే జరుగుతున్నాయని అనుకుంటాం. ఒక వ్యక్తి చిన్ననాటి స్నేహితులను ఇంటికి పిలిచాడు. వారికి మంచి పదార్థాలు పెట్టాడు. అందరూ పడుకున్నారు... ఇదంతా కలలో జరుగుతోంది. ఇంతలో అలారం మోగింది. ‘మిగిలిన స్నేహితులు లేచి వెళ్ళిన తరువాత నేను లేస్తాను’ అనుకున్నాడు. అలారం మోగుతూనే ఉంది. వాళ్ళందరూ లేచిన తరువాత మనం లేద్దాం అనుకుంటే... అది ఎన్నటికీ జరగదు. ఎందుకంటే... ఆ స్నేహితులందరూ అతని సృష్టే. ప్రపంచం స్వప్నతుల్యం. అది స్వప్నం అని తెలియాలంటే దాని నుంచి మనం మేలుకోవాలి. ‘పదిమంది స్నేహితులను ఆహ్వానించడం కల’ అని అతను లేస్తే కాని తెలీదు. అలాగే ఈ జగత్తు అనే కలలోంచి బయటికి వస్తే కాని సుఖం అనేది మనం పొందలేం. అందుకే... ‘‘ఈ కనిపించే ప్రతీదీ ఆధారంలేని దానితో కనిపిస్తోంది’’ అంటారు శ్రీ రమణ మహర్షి. స్వామి తత్త్వానికి కొన్ని కొలమానాలు ఉన్నాయి. సాధారణమైన కొలమానాలతో ఆ తత్త్వాన్ని అర్థం చేసుకోలేం. దేహ భ్రాంతి మనకు కలిగినా, కలగకపోయినా.దేహం అనేది ఒకటి ఉన్నదని తెలిసినా తెలియకపోయినా... ఆ విషయంతో మనకు సంబంధం లేదు.
ఎందుకంటే మనం ఎప్పుడూ హృదయంగానే ఉన్నాం. ఆ హృదయంగా ఉన్నప్పుడే ఆనందం మనకు కలుగుతుంది. కానీ హృదయంగా ఉంటూనే దాని నుంచి వేరుగా ఉన్నామనే భావన మనకు కలుగుతుంది. ‘‘ఒకసారి నీకు బేధ దృష్టి కలిగిందా... ఆత్మ విచారణ చేసుకోవడానికి నువ్వు అనర్హుడివి’’ అంటారు భగవాన్. ఇలా బేధ దృష్టి కలిగితే... దేహాత్మ బుద్ధి కూడా కలుగుతుంది, ప్రపంచం అనేది ఒకటి ఉందనే భావన కూడా కలుగుతుంది. కానీ అది బేధ దృష్టి వల్ల కలిగింది. నాకు అన్యంగా... అంటే నేను కానిది ఏదో ఉందనే ఆలోచన వల్ల ఈ దృష్టి దోషం కలుగుతుంది.
ఇక్కడ భగవాన్ చెప్పేదేదేమిటంటే... దేహంతో నువ్వు సమమైతే... ఎప్పుడూ కూడా దేహం మనకు కనిపించాలి. మరి సుషుప్తిలో దేహం ఎందుకు కనిపించడం లేదు? సుషుప్తిలో ‘దేహం’ అనే ఆలోచన మనకు ఎందుకు కలగడం లేదు? ‘‘ఒక విషయంతో మనం సమం అయినప్పుడు... అది ఎప్పుడూ ఉంటుంది. నీకన్నా తక్కువైన దానితో నువ్వు విడిపడొచ్చు. నీకు సమానంగా ఉన్నదానితో నువ్వు విడిపడలేవు’’ అంటారు భగవాన్. మరి గాఢ నిద్రలో మనకు దేహ బుద్ధి లేదు. దేహం కనిపించడం లేదు అంటే అప్పుడు మనం లేమా? గాఢ నిద్రలో కూడా మనం ఉన్నాం. ఎలా ఉన్నామంటే... దేహం, దాని భ్రాంతి లేకుండా ఉన్నాం. మరి జాగ్రదావస్థలో కనిపించే, దేహం, దేహాత్మ బుద్ధి.. వీటన్నిటితో మనం ఉండడం నిజమా? దేహ భ్రాంతి లేకుండా, దేహం అనే భావన లేకుండా ఉండే సుషుప్తి అనే ఆ స్థితి నిజమా?
అభాసకాంతి పర్యవసానంగా... మనం హృదయంగానే ఉన్నా ప్రత్యేకంగా ‘నేను ఉన్నాను’ అనే ఒక అహంకార భావన మొదవుతుంది. దానికి ‘నేను’ అని పేరు పెట్టుకుంటాం. ఆ అహంకార భావనతో పుట్టినమాయా భ్రాంతి వల్ల హృదయంలో ఒక చలనం వస్తుంది. ‘నాలో ఏదో జరుగుతోంది’ అనే ఒక ప్రత్యేకమైన భావన మొదలవుతుంది..
ఒకసారి ఆ భావన కలిగిందంటే, రాత్రి నిద్రలో... సుషుప్తిలోకి వెళ్ళేవరకూ అది విడిచిపెట్టదు. నిజానికి ఇక్కడ ఏదీ కలగడం లేదు. మొదటి నుంచీ తాడు మాత్రమే ఉంది. పాము అనేది ఎన్నడూ లేదు. కానీ, కనీకనిపించని వెలుతురు వల్ల... పాము అనే భావన కలగడం వల్ల మనకు భయం వేయడం మొదలైంది. మన భయానికి కారణం ఏమిటి? భౌతికంగా ఉన్న పాము కాదు... మానసికంగా ఊహించుకున్న పాము. పాము అనే భావనే మనకు భయం కలిగిస్తుంది కానీ నిజమైన పాము అక్కడ లేదు. మనం పరిశీలించవలసింది పామును, తాడును కాదు... కనీకనిపించని వెలుతురును. కటిక చీకటిలో కానీ, పట్టపగటి వెలుతురులో కానీ ఈ సమస్య ఉండదు.
అభాస కాంతి వల్లనే ప్రత్యేకంగా ‘నేను ఉన్నాను’ అనిపిస్తోంది పరిపూర్ణమైన వెలుగు ఉండే హృదయం దగ్గర... మనకు అన్యంగా ఏదో ఉందనే భావన ఉండదు, అలాగే అజ్ఞానంలో కూడా మనకు ఆ భావన ఉండదు. విజ్ఞానానికీ, అజ్ఞానానికీ మధ్యలో ఉండడమే సమస్య. మందబుద్ధి ఉన్నవాడికీ, తననుతాను తెలుసుకున్నవాడికీ శాస్త్రం అక్కర్లేదు. ఈ మధ్యలో ఉన్నవారికే కావాలి. ‘నేను ఎవరు’ అనే విచారం ద్వారా తనను తాను తెలుసుకోవడానికి ఏదైతే ఉపయోగపడుతుందో అదే శాస్త్రం. రమణ మహర్షి పద్ధతిలో శాస్త్రానికి ఇదే అసలైన నిర్వచనం. ఇది తెలుసుకోవడానికి గురువు అనుగ్రహం ముఖ్యం. ఇక్కడ గురువు అంటే హృదయం.
‘‘ఉన్నది ఉన్నట్టు ఉండడమే ఉండడం’’ అన్నారు భగవాన్. దాన్ని ‘హృదయం’ అన్నారు. అలా ‘ఉన్నాను’ అన్నా ఉన్నట్టు కాదు. ‘ఉన్నది ఉన్నట్టు’ అంటే ఏమిటి? ‘నాకు అన్యంగా ఏదీ లేదు’ అనే జ్ఞానాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవడం.
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏👏
No comments:
Post a Comment