2512. 1-3. 210123-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*ఆలయాన్ని విడిచి, భక్తునిదగ్గరికి వచ్చి సమయాన్ని గడిపిన…*
*వెంకటేశ్వరస్వామి...!!*
➖➖➖✍️
*హాథీరాంజీ, .1500 కాలంలో ఉత్తర భారత దేశంనుండి తిరుమలకు వచ్చిన భక్తుడు.*
*ఇతడు స్వామివారితో పాచికలాడేంత సన్నిహిత భక్తుడని కథనాలున్నాయి.*
*పాచికలాటలో వెంకటేశ్వరుడు ఓడిపోయాడని అందుకే తిరుమలలో హథీరాంజీ మఠం, ప్రధాన ఆలయం కన్నా వంద మీటర్ల ఎత్తులో ఉన్నదని ఒక కథనం!*
*కథ ప్రకారం ఇతనిగురించి అర్చకులు రాజుకు ఫిర్యాదు చేశారు. అతనిని శిక్షించడానికి ముందు రాజు ఒక పరీక్ష పెట్టాడు.*
*ఒక బండెడు చెఱకు గడలు అతనిగదిలో పెట్టి తాళం వేశారు. ఆ చెఱకు గడలను తినగలిగితే అతనిని శ్రీవారి సన్నిహితునిగా అంగీకరిస్తానని రాజు అన్నాడు.*
*స్వామి ఏనుగు రూపంలో వచ్చి చెఱకు గడలన్నీ తినేశాడు. అప్పటినుండి బావాజీని హాథీరాం బాలాజీ అని పిలువసాగారు. అలాంటి బావాజీ, వెంకటేశ్వర స్వామి వారి బంధం గురించి తెలుసుకుందాం…*
*ఇప్పుడంటే కొంతమందికి కష్టం వచ్చినపుడే దేవుడు గుర్తొస్తాడు కానీ పూర్వ కాలంలో అలా ఉండేది కాదు.*
*పూర్వం భక్తులు తమతమ ఇష్టదైవాల పట్ల ఎంతగా తమ భక్తిని చాటుకున్నారంటే.. సాక్షాత్తూ దేవుళ్ళే స్వయంగా భువికి దిగివచ్చి వారి కోర్కెల్ని నెరవేర్చేవారు. అలా తన భక్తితో వెంకటేశ్వరున్ని మెప్పించిన అపరభక్తుడు బావాజీ.*
*ఆయనతో కలిసి పాచికలు ఆడాడు. తిరుమలలోని మాడవీథులలోని ప్రధాన గోపురానికి కుడివైపున్న మఠం ఆ భక్తుడు బావాజీదే! ఆ మఠంపై శ్రీ వెంకటేశ్వరుడు తన భక్తుడు బావాజీతో పాచికలాడుతున్న దృశ్యం వుంటుంది. ఈ మఠాన్ని హాథీరాం మఠం అంటారు.*
*కొన్ని వందల ఏళ్ల క్రితం బావాజీ తీర్థయాత్రలు చేస్తూ ఉత్తరాది నుంచి తిరుమలకు చేరుకున్నారు.*
*అక్కడ శ్రీ వేంకటేశ్వరుని దివ్య మంగళ విగ్రహాన్ని చూసిన ఆయన మనసు అక్కడే లగ్నమైపోయింది. తోటి యాత్రికులంతా వెళ్లిపోయినా, ఆయన తిరుమలలోనే ఉండి నిత్యం వేంకటేశ్వరుని దర్శించుకునేవారు. ఆలయంలో గంటల తరబడి బావాజీ నిలబడి ఉండటం, అర్చకులకు అనుమానాస్పదంగా మారింది.*
*అలాంటి వ్యక్తి నిరంతరం గుడిలో ఉండటాన్ని అనుమానాస్పదంగా భావించిన అర్చకులు ఆయనను బయటకు గెంటివేశారు. ఇకపై ఆలయంలోకి రాకూడదంటూ కట్టడి చేశారు.*
*దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన.. శ్రీనివాసుని దర్శనభాగ్యం కోసం చిన్నపిల్లవాడిలా విలపించాడు. రాత్రింబవళ్ళు కన్నీరుమున్నీరయ్యాడు. అప్పుడు అతనిని ఓదార్చేందుకు సాక్షాత్తూ శ్రీనివాసుడే దిగిరాక తప్పలేదు.*
*నిన్ను నా సన్నిధికి రానివ్వకపోతే ఏం! నేనే రోజూ నీతో సమయం గడిపేందుకు వస్తుంటానని బావాజీకి అభయమిచ్చాడు.*
*అలా నిత్యం రాత్రిపూట పవళింపు సేవ ముగిసిన తరువాత, ఆలయం ఎదురుగా ఉన్న బావాజీ మఠానికి చేరుకునేవాడు శ్రీనివాసుడు.*
*అక్కడ వారిద్దరూ పొద్దుపొడిచేవరకూ కబుర్లతో కాలం గడిపేవారు. కొన్నిసార్లు కాలక్షేపం కోసం పాచికలు ఆడుకునేవారు. అలా సరదాగా గడుపుతున్న తరుణంలో ఓ పరిణామం చోటు చేసుకుంది.*
*అలా ఒకసారి… బావాజీతో స్వామివారు పాచికలాడుతూ కాలాన్ని గమనించనేలేదు. సుప్రభాతవేళ సమీపించింది… జగన్నాథునికి మేల్కొలుపు పాడేందుకు అర్చకులు ఆలయాన్ని సమీపించసాగారు. ఆ చప్పుళ్లను విన్న వేంకటేశ్వరుడు వెంటనే లేచి అక్కడి నుంచి ఆలయం లోపలికి వెళ్లిపోయాడు.*
*ఆ హడావుడిలో ఆయన కంఠాభరణం ఒకటి మర్చిపోవడంతో అది బావాజి మఠంలోనే ఉండిపోయింది.*
*ఆ ఉదయం మూలవిరాట్టుని అలంకరిస్తున్న అర్చకులు, ఆయన ఒంటి మీద అతి విలువైన కంఠాభరణం మాయమవ్వడం గమనించారు.*
*అదే సమయంలో తన మఠంలో ఉండిపోయిన కంఠాభరణాన్ని తిరిగి ఇచ్చేందుకు బావాజీ ఆలయం లోపలకి ప్రవేశించగా… అతని చేతిలో ఉన్న ఆ ఆభరణాన్ని చూడగానే అర్చకులు మరేమీ ఆలోచించకుండా దాన్ని లాక్కొని ఆయనను దూషిస్తూ స్థానిక నవాబు దగ్గరకు తీసుకుపోయారు.*
*ఆ ఆభరణాన్ని ఎందుకు, ఎలా దొంగలించావని ప్రశ్నించగా.. తానేమీ దాన్ని దొంగలించలేదని బావాజీ పేర్కొన్నాడు.*
*సాక్షాత్తూ శ్రీనివాసుడే తనతో రాత్రంతా పాచికలు ఆడాడని, అర్చకులు రావడంతో హడావుడిగా ఆలయంలోకి వచ్చేయడంతో తన కంఠాభరణాన్ని తన మఠంలోని మర్చిపోయాడని వివరించాడు.*
*కానీ.. ఎవ్వరూ అది నమ్మలేదు. బావాజీని కారాగారంలో పడేశారు. నిజంగానే ఆ శ్రీనివాసుడు ప్రతి రాత్రి నీకోసం వచ్చిన మాట నిజమే అయితే.. నీకు ఒక పరీక్షను పెడుతున్నాం. ఈ కారాగారం నిండా బండెడు చెఱకు గడలు వేస్తాం. ఉదయం సూర్యుడు పొడిచే వేళకి అవన్నీ పొడిపొడిగా మారిపోవాలి!’ అని నవాబు అతనికి పరీక్ష పెడతాడు. *
*ఆరోజు అర్ధరాత్రి బావాజీని బంధించిన గది నుంచి ఏనుగు ఘీంకారాలు వినిపించాయి. అవేమిటా అని లోపలికి తొంగిచూసిన సైనికుల ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది.*
*ఆ గదిలో నామాలు ధరించిన ఒక ఏనుగు, బండెడు చెఱుకుగడలను సునాయాసంగా పిప్పి చేయసాగింది. మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి. ఎక్కడి కావలివాళ్లు అక్కడే ఉన్నారు. అయినా ఒక ఏనుగు లోపలికి చక్కగా ప్రవేశించగలిగింది. ఆ కార్యక్రమం జరుగుతున్నంతవరకూ బావాజీ రామనామస్మరణ చేస్తూనే ఉన్నారు.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
No comments:
Post a Comment