Sunday, February 5, 2023

 *"ఏమండీ! మన పెళ్లి అయిన దగ్గర నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను పేరు మార్చుకోరా మీరు?" కోపంగా అడిగింది సుప్రియ.*

*"నువ్వు ఎన్ని సార్లు అడిగావో నేనూ అన్ని సార్లు చెప్పాను మార్చుకోనని. నా పేరు మా నాయనమ్మ పెట్టింది మా తాతగారి పేరుట", అంతే కోపంగా చెప్పాడు అప్పారావు.* 

*"మరీ అప్పారావు ఏమిటండీ? అప్పుల అప్పారావు లాగ. మీ వాళ్లు అందరూ 'ఒరేయ్ అప్పిగా అప్పిగా' అని పిలుస్తుంటే నాకూ ఒళ్లంతా కారం రాసుకున్నట్టుగా భగభగ మండి పోతోంది."* 

*"ఇప్పుడు ఏమీ చేయమంటావ్ నన్ను! ఎంతో అభిమానంతో పిలుస్తున్నారు. వాళ్లతో అలా పిలవద్దని చెప్పలేను. ఈ విషయంలో నేనూ ఏమీ చేయలేను."* 

*"అయితే నా కొడుక్కి మాత్రం నాకు ఇష్టమైన పేరు పెట్టుకుంటాను. అందులో మీరు తల దూర్చకండి.*
*ఖరాఖండిగా చెప్పింది సుప్రియ."*

*"సరే నీ ఇష్టం" ముఖం మాడ్చుకుని చెప్పాడు అప్పారావు.*
 
*చాలా బుక్స్ లో, ఇంటర్నెట్ లో వెదికి ఒక మంచి లేటెస్ట్ పేరు సెలెక్ట్ చేసి ప్రజ్వేష్ అని పెట్టింది సుప్రియ. ఆ పేరుతోనే పిలవమని ముద్దు పేర్లతో పిలవద్దని అప్పారావుకు మరీ మరీ చెప్పింది.*

*ఒకసారి అప్పారావు దగ్గర బంధువుల ఇంట్లో పెళ్లికి భార్యని కొడుకుని తీసుకు వెళ్లాడు.  అందరూ పిల్లాడిని ఎత్తుకుని 'మన అప్పిగాడి కొడుకు' మన 'అప్పిగాడి కొడుకు' అనుకుంటూ పిల్లాడిని ఒకరి తరువాత ఒకరు ఎత్తుకుంటూనే వున్నారు. అందులో ఒక్కరు కూడా ఆ పిల్లాడిని అసలు పేరుతో పిలవలేదు.*
 
*ఆ పెళ్లికి వెళ్లి వచ్చిన దగ్గరనుండి 'నీ పేరేమిటి' అని ఆ పిల్లాడిని ఎవరైనా అడిగితే వచ్చీరానీ మాటలతో  'అప్పిగాడి కొడుకుని' అని చెప్పడం మొదలు పెట్టాడు.* 

తల కొట్టుకుంటూ సుప్రియ అలా 'అప్పిగాడి కొడుకు' అని చెప్పకురా! మీ నాన్నతో పోట్లాడి అందమైన పేరు పెట్టాను నీకు. ఎవరైనా అడిగితే నీ పేరు చెప్పరా అంటూ కొడుకును బ్రతిమాలి, ఆ అలవాటు మార్చడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తోంది పాపం సుప్రియ.* 

*కొన్ని రోజుల తరువాత ఊరునుంచి అప్పారావు మేనమామ వచ్చాడు. "నువ్వు మా అప్పిగాడి  కొడుకువు కదూ"? చిన్నప్పుడు ఎప్పుడో చూసాను అంటూ ఆ పిల్లాడిని దగ్గరకు తీసుకున్నాడు.*  

*"అవునండీ! అప్పిగాడి కొడుకునే! కానీ మా అమ్మ ఒప్పుకోవట్లేదు..... కాదంటోంది.....*

*ఆ మాట విని ఆ పెద్దాయన షాక్....తిన్నారు.* 😃🙃😁😃😉😃😁😃

No comments:

Post a Comment