Saturday, February 11, 2023

ముక్తికి మార్గం సాధన

 ముక్తికి మార్గం సాధన 

మానవ జీవితంలో ముక్తి మార్గం సాధన ఎలా వుండాలి అది ఏలా చేయాలి...  అంటే మానవ జన్మ విత్తనం వంటిది, విత్తనానికి పూర్వం చెట్టు ఉంది, విత్తనం తరువాత కూడా చెట్టు ఉండొచ్చు! అయితే విత్తనము తరువాత చెట్టు ఉండాలా లేదా అనేది విత్తనం యొక్క సామర్ధ్యం మీద అధారపడి ఉంటుంది.

విత్తనములో మొలకెత్తే గుణం ఉన్నట్లయినా అది మొక్కగా మారి పెద్ద వృక్షం అవుతుంది. మళ్ళీ విత్తనాలు పుట్టి మళ్ళీ చెట్లు.ఇలా విత్తనం, చెట్టు తిరుగుతూ ఉంటాయి. 

మన జన్మలు కూడా ఇంతే! గత జన్మలో ఉన్నాం. ఇప్పుడు కూడా ఉన్నాం.ఇక ముందు కూడా ఉండవచ్చు.అయితే ఇక ముందు జన్మ ఉండాలా, లేదా అనేది నేటి మన సాధన మీద ఆధారపడి ఉంది!

విత్తనంలో మొలకెత్తే గుణం ఉన్నంత వరకూ అది మొలకెత్తుతూనే ఉంటుంది. ఆ మొలకెత్తే గుణం లేకపోతే ఎంత మట్టి వేసినా, ఎన్ని నీళ్ళు పోసినా మొలకెత్తదు. అలానే మనలో ఉండే అజ్ఞాన, అహంకార, మమకారాలు ఉన్నంత వరకూ చావు పుట్టుకల చక్రంలో తిరుగుతూనే ఉంటాం. 

మనలో ఇవి ఎప్పుడైతే  నశించుకుపోతాయో అప్పుడు సహజముగానే పునర్జన్మ నుండి విముక్తులం అవుతాం. అయితే వీటిని వదలడం అంత సులువైన పని కాదు!  అలా అని కష్టమూ కాదు!...

నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే మనసులో ఒక విధమైన కంపనం కలిగి అజ్ఞాన, అహంకార మమకారాలు క్రమేపీ తగ్గుముఖం పడతాయి. అలా నిరంతరం చేస్తూ చేస్తూ ఉంటే ఏదో ఒక సమయంలో ఆయా గుణాలు పూర్తిగా నశించుకుపోతాయి.

ఇక ముక్తికి మార్గం దొరికినట్లే! అయితే అంతవరకు గట్టి సాధనే చేయాలి!!    

ఎన్ని ఆటంకాలు వచ్చినా మద్యలో ఆపడానికి వీల్లేదు. మరొక ఆలోచన లేకుండా భగవంతుని ప్రేమించు. ఆయన లేనిదే దేనికీ విలువలేదు అని నమ్ము , ఆయనే సర్వస్వము అని గాఢ విశ్వాసము కలిగియుండు. అప్పుడు నీవు భగవంతునివాడవు అగుదువు, భగవంతుడు నీవాడగును. అంతకన్న ఆప్యాయత వేరులేదు. ఎంతమందో వంటింటిలో తిరుగవచ్చు, భోజనశాలలో ఎదురుచూడవచ్చు. 
కానీ నీవు ఆ యజమాని కుమారుడవైన, నీకే ముందు వడ్డింతురు. వడ్డించేవాడు మనవాడయినప్పుడు కడపంక్తినైనా కూర్చొనవచ్చును కదా!

ఓం నమో నారాయణాయ

No comments:

Post a Comment