Friday, February 17, 2023

సత్సంగం వల్ల మోక్షం వస్తుందా?

 *సత్సంగం వల్ల మోక్షం వస్తుందా?* 

సత్సంగం మోక్షానికి మొదటి మెట్టు. దాన్నే సాధన సమాగమం అంటారు. సత్పురుషులతో సంభాషించడం, వారిని ప్రార్థించి, ప్రశ్నించి, ధర్మసాధనలను, సాధనాలను తెలుసుకోవాలి. శ్రవణ, మనన, నిధి ధ్యాసనాలు (ధ్యానం) శ్రద్ధగా అభ్యసించి, భగవానుని కళ్యాణగుణాలపై అనురాగము కలగాలి. 

ఈ గుణశ్రవణంలో ప్రీతి ఏర్పడ్డంవల్ల, నీకు భగవానుని పై ఎప్పటికీ వేరొక ఫలం కోరని భక్తి స్థిరంగా వుండగలదు. అదే మనసునకంటిన పూర్వ పాపకర్మల్ని, వాసనల్ని తొలగించి, అంతమొందిస్తుంది. 

మానవులు మోక్షం పొందడానికి సాధనం భక్తే అని శాస్త్రాల్లో సిద్ధాంతం చేయబడింది. భగవంతునిపై భక్తి దృఢంగా వుండాలి. ఇతరమైన విషయాలపై అనురక్తి వుండరాదు. దీనినే పరభక్తి, పరజ్ఞానము, పరమభక్తి అని పేర్కొంటారు. పరభక్తి- భగవంతునిపై మిక్కిలి ప్రీతి గలిగి, వాడినే స్మరించడం పరభక్తి. దీని చేత భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. 

దీన్నే పరజ్ఞానం అంటారు. ఈ స్థితిలో రెప్పపాటుకూడ మానసిక సాక్షాత్కార దివ్య అనుభవాన్ని వదిలి వుండలేని తన్మయం కలుగుతుంది. అదే పరమభక్తి. ఇదే *ముక్తిః మోక్షో మహా నందః* అని మోక్షమును శాశ్వతమయిన బ్రహ్మానందాన్నిస్తుంది.
============================

No comments:

Post a Comment