Saturday, February 18, 2023

****చిన్న కథ

 సమయం రాత్రి 10 గంటలు !
ఇంటికి ఆలస్యంగా వచ్చిన కొడుకుని చదువు మీద ధ్యాస పెట్టమని , ఇలాంటివి మానుకొమ్మని తల్లిదండ్రులు మందలించారు.
"చిన్నప్పటి నుండి చూస్తున్నాను, నాకు మీరు అస్సలు స్వేచ్చ ఇవ్వడం లేదు. ఎంత సేపు చదువు చదువు అని నా ప్రాణం తోడేస్తున్నారు . నేను మిత్రులతో గడపకూడదా ? సినిమాలకి షికార్ల కి వెళ్లకూడదా ? అందరు వెళ్ళడం లేదా ? మొబైల్ లో ఒక గంట సేపు మాట్లాడితే తప్పా ? ఫేస్బుక్ లో చాటింగ్ తప్పా ? " అని నిలదీసాడు కొడుకు .
"సరే నీకు కావలసినంత స్వేఛ్చ ఇస్తాను. ఒక్క సారి నా మాట వింటావా ? వొచ్చే శుక్రవారం మనం ఒకసారి మన సొంత ఊరికి వెళ్లి వద్దాము . అక్కడ రెండు రోజులు ఉందాము . తిరిగి వొచ్చిన తర్వాత నీ ఇష్టం " అని తండ్రి బదులిచ్చాడు.కొడుకు సరే అన్నాడు . అనుకున్నట్టు గానే సొంత ఊరికి బయలు దేరారు.
తండ్రి కొడుకుతో కలిసి వారి మామిడి తోట కి తీసుకెళ్ళి "నేను ఇక్కడే కుర్చుంటాను . ఈ తోటలో నువ్వు ఒక గంట సేపు తిరిగి రా అని బదులిచ్చాడు"కొడుకు ఒక గంట తర్వాత తిరిగొచ్చాడు.తోటలో నువ్వు ఏమి చూసావు అని ప్రశ్నించాడు తండ్రి."అన్ని చెట్లు పెద్దగా బాగానే ఉన్నాయి. కానీ ఒక చెట్టు మాత్రం పొట్టిగా, పురుగులు పట్టి, కాయలు లేకుండా ఉంది . ఆరోగ్యం గా లేదు . మిగిలిన అన్ని చెట్లు బాగున్నాయి. దీనికి కారణం ఏమిటి ? " అని అడిగాడు
దానికి తండ్రి "మామిడి చెట్టు పెంచేటప్పుడు కొంత ఎత్తు పెరిగిన తర్వాత అవసరం లేని కొమ్మలను, కిందకు వేలాడే కొమ్మలను కత్తిరిస్తారు . లేదంటే ఈ వేలాడే కొమ్మలకు సూర్య రశ్మి తగలక, పెరుగుదల ఆగిపోయే అవకాశం ఉంది. అంతే కాకుండా పురుగులు చేరే అవకాశం కూడా ఎక్కువ . అన్ని చెట్లకి కొమ్మలు కత్తిరించాము. అందుకే అన్నీ ఆరోగ్యం గా ఉన్నాయి. కానీ ఆ చెట్టు కి కత్తిరించలేదు. మొదట నాటిన చెట్టు కదా స్వేఛ్చ గా పెరగనిద్దాము అని వదిలేసాము" అని బదులిచ్చాడు.కొడుకుకి విషయం అర్ధమయ్యింది
"అనవసరంగా పెరిగే కొమ్మలు ఎలాగైతే వృక్షాన్ని నాశనం చేస్తాయో .. అదే విధంగా చదువుకునే వయసులో చేసే అనవసరమైన పనులు విద్యార్ధుల జీవితాలను నాశనం చేస్తాయి. మీ నాన్న కేవలం కొమ్మలు కత్తిరించే ప్రయత్నం చేస్తున్నాడు , చెట్టంత కొడుకు చల్లగా ఉండాలని. అంతే కానీ స్వేఛ్చని అడ్డుకోవాలని కాదు " అని భుజం మీద చెయ్యి వేసి ఇంటికి తీసుకొచ్చాడు .
బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే ప్రతి తల్లి దండ్రుల మనోభావాలను ఈ యువతరం అర్ధంచేసుకోవాలని
ఆశిస్తూ.............

ఈ చిన్న కథ మీ మనసుని తాకితే నలుగురితో షేర్ చేసుకోగలరు..

No comments:

Post a Comment