సధ్గురుపరబ్రహ్మణేనమః🙏🙏🙏
కేవలకుంభకయోగాన్ని... కాలాన్ని గుర్తించని స్థితిలో, అంటె పగలా, రాత్రా, రోజా, నెలా, సంవత్సరమా అనే విభజన, కాలంలో ఉన్న విభజనలన్నీ మాసిపోయినట్లుగా, కలాతీత స్థితిని గుర్తించేటట్లుగా మార్చగలిగే శక్తి ఈ కేవలకుంభకయోగానికి ఉన్నది.
ఈ కేవలకుంభకయోగాన్ని అనుష్టించిన మహానుభావులు అనేకమంది చిరంజీవులై ఇప్పటికీ భారతభూమియందు నడయాడుతున్నారు. వారందరూ అశరీరులై అశరీరపధ్ధతిగా ఎదిగే సాధకులకు సహాయం చేసేటటువంటి సధ్గురుమూర్తులు. అట్టి కేవలకుంభకయోగాన్ని సాధకులందరూ తప్పక అనుష్టించాలి.
అనుష్టానం అనే పదం చాలా లోతైన శబ్దం. నీ మూలాన్ని నీవే గుర్తెరిగి, నీ మూలాన్ని నీవే పెకిలించి పారవేయడానికి అనుష్టానమని పేరు. నీకు అన్యమైన దానిని గుర్తించడానికి చేసే పని కాదది. నీ మూలాన్ని నీవు గుర్తెరిగే పనిగా, కనపడుతున్న శరీరాన్ని నేను కాదని, కనపడని ప్రాణం దానికి మూలమని, ప్రాణమూలం హృదయమనీ, హృదయమూలం ప్రకాశమని, ప్రకాశ మూలం శూన్యమని, శూన్యమూలం మూలా ప్రకృతియని, మూలా ప్రకృతికి ,మూలంలేనిదని బయలు స్థితియందు నిలకడ చెందించే దానికి కేవలకుంభకయోగమని పేరు.
ఈ రీతిగా కేవలకుంభకయోగాన్ని అనుష్టించేటటువంటి ఉత్తమ సాధకులకే జన్మరాహిత్యం సిద్ధం. మాటలతో విచారణ చేసి తెలియవచ్చునేమో కానీ, స్వానుభవ నిర్ణయం కానేరదు. మాటల చాటున, మాటల ఉనికికి మూలమైన నిశ్శబ్దబ్రహ్మము ఎరుగవలయును. అట్టి నిశ్శబ్దబ్రహ్మమే తానై తనకు మూలములేనిదని తనను తాను పోగొట్టుకోగలిగిన వారికి జన్మరాహిత్యము. తనను తాను గుర్తరిగి తన మూలమును తాను పోగొట్టుకోగలిగిన వారికే జన్మరాహిత్యము.
కనుక మానవులందరూ తప్పక తన మూలమును తాను గుర్తెరిగేటటువంటి ఉత్తమమైన కార్యక్రమములో, ఉత్తమమైన కర్తవ్యముతో, తన మూలమును తాను పోగొట్టుకోగలిగేటటువంటి కేవలకుంభకయోగాన్ని ఆందరూ అభ్యసించాలి. నాలుగు సంధ్యలలో వచ్చేటటువంటి ఈ సాధన కేవలకుంభకయోగంగా పరిణమించినపుడు మాత్రమే నీకు జన్మరాహిత్య స్థితిని అందిస్తుంది.నాలుగు సంధ్యలనే కాలమితి లేకుండా, సంధ్య అనే గుర్తింపు లేకుండా పోతుంది. ఎరుక - గుర్తింపు రెండూ ఒకటే. ఈ రెండూ కూడా సమానార్థకాలు. నిరంతరాయంగా దృష్టిని భూమా, బ్రహ్మరంధ్రస్థానంలో నిలిపి ఉంచి, కిందికి దిగి రాకుండా అష్టదళపద్మాన్ని గుర్తించాలి. అష్టదళపద్మమందు కర్ణిక, కర్ణికామధ్యమందు బిందువందందు కంపించుచుండును. బిందు మధ్యంబున చూడ పరమాత్మ చెలువై ఉండును. అట్టి పరమాత్మను అనుభవాసక్తి తెలిపిన వాడే నిజగురువు.
మీరందరుఈ నిజగురు స్థానాన్ని ఆశ్రయించాలి. జన్మరాహిత్యం పొందాలనే ప్రతీ ఒక్కరూ ఈ నిజగురు స్థానాన్ని ఆశ్రయించాలి. ఈ కేవలకుంభకయోగం వీరికి మాత్రమే ఉద్ధేశించబడిందనే. నిజగురు కరుణ ద్వారా మాత్రమే ఎరుక విడిపించబడుతుంది. ఎరుక విడిపించవలెనే కానీ, తనకు తాను పోగొట్టుకోవడం సాధ్యపడదు. అందుకని కేవలకుంభకయోగానికి చరమముండదు. పరమావధిగా కైంకర్యం చెప్పబడింది. ఏ తెలివితో అయితే బిందువందందు కంపించుచుండునని గుర్తించాడో, ఏ తెలివితో అయితే బిందుమధ్యంలో ఉన్నటువంటి పరమాత్మను గుర్తించాడో, అట్టి పరమాత్మ స్థితి యందు తానుండి, తాను లేనివాడిగా కైంకర్యం చేయబడే ఆత్మనివేధన చాలా ముఖ్యమైనటువంటిది. ఇట్టి ఆత్మనివేధన స్వానుభవపూర్వకంగా తాను లేనివాడిననే నిర్ణయాన్ని పొందినటువంటివాడు ఎవడైతే ఉన్నాడో వాడే నిజ శిష్యుడు.
అన్ని దేవాలయాలలో స్థూలమూర్తులకు, ధృవబేరానికి అందించేటటువంటి అన్నింటికి కైంకర్యములని పేరు. సుప్రభాత సేవనుంచి పవళింపు సేవ వరకు చేయబడే అన్ని సేవలు కూడా కైంకర్యములే. ఆ పనులు నీ నిజ జీవితంలో కూడా రోజూ నీవు చేస్తూనే ఉంటావు. ఆ చేసేటువంటి వాటిని, నేను చేయడంలేదు, నేను లేనివాడిని, నేను లేనివాడిని, న ఇతి..న ఇతి..నాహం అస్తి...న కించన...నాహం అస్తి... న కించన... నేతి నేతి...న ఇతి న ఇతి అనేటువంటి నిర్ణయాత్మకమైన భావనలో నిలకడ చెంది, పిండాండభావనలో ఉన్నటువంటి 25, బ్రహ్మండభావనలో ఉన్నటువంటి 25, ఈశ్వరీయభావనలో ఉన్నటువంటి 25... 75 తత్వాలను నేను కాదు, నేను లేనివాడను అనే నిర్ణయం చేయగలిగే విధానానికి కేవలకుంభకయోగమని పేరు.
వాయుధారణతో ప్రారంభమై తనను తాను పోగొట్టుకునేటువంటి ఉన్మనీ స్థితి. ఈ ఉన్మత్తత ఒకసారి ప్రాప్తిస్తే పోయేది కాదు. దీనిని మించినటువంటి ఉన్మత్తత లేదు. అనేకరకములైన ఉన్మత్తతలు మానవజీవితంలో కనపడుతూ ఉంటాయి. కాని దివ్యత్వమనే ఉన్మత్తత ఒకసారి ప్రాప్తిస్తే తిరిగి పోదు. మరల రాదు. దివ్యమనే అహం ఈశ్వరుడుగా, బ్రహ్మముగా పిలవబడుతున్నాడు. దివ్యాహం నిరంతరాయంగా, సర్వవ్యాపకమై ఆశ్రయించిన వారందరిపై, అన్ని జీవులపై మౌనంగా పనిచేస్తుంది. అట్టి మౌనాన్ని గుర్తెరిగే వాడెవడో వాడు మాత్రమే కేవలకుంభకయోగానికి అధికారి. నిరంతరాయంగా నిశ్శబ్దస్థితిని నిలబెట్టుకోగలిగిన వాడెవడో తను మాత్రమే కేవలకుంభకయోగానికి అధికారి. మానసిక మౌనం... ఈశ్వరీయమౌనంగా పరిణమించేటువంటి ఉత్తమమైన సాధన కేవలకుంభకయోగం.
No comments:
Post a Comment