🌹పురాణాలలో రాజనీతి తెలిసిన గొప్ప మహిళ!🌹
🔥🔥🔥🔥🔥🔥🔥
సుషేణుడి కుమార్తె తార. వానర రాజ్యం కిష్కింధకు రాజైన వాలితో ఈమె వివాహం జరుగుతుంది. వాలి మహా బలశాలి. అతనిది వజ్రతుల్య శరీరం. వాలి, అతని తమ్ముడైన సుగ్రీవుడు ఎంతో స్నేహంగా ఉండేవారు.
కాగా, ఒకసారి మాయావి అనే రాక్షసుడి మీదకు వాలి యుద్ధానికి వెళ్ళాడు. వాలి ఎంతకూ తిరిగిరాకపోవడంతో, అందరూ వాలి మరణించాడని భావించారు. దాంతో, వాలి స్థానంలో సుగ్రీవుడికి పట్టాభిషేకం జరిపారు. అప్పుడు స్థానిక ఆచారం ప్రకారం తార, సుగ్రీవుడికి భార్య అయింది. ఇంతలో కొన్నాళ్ళకు యుద్ధం నుంచి వాలి తిరిగి వచ్చాడు. సుగ్రీవుణ్ణి తరిమివేసి, మళ్ళీ తానే రాజయ్యాడు. వాలి తిరిగి రావడంతో, తార కూడా మళ్ళీ తన విధేయతను అతనికే ప్రకటించింది. సుగ్రీవుని పట్ల తీవ్ర కోపావేశాలు ప్రకటించిన వాలి, అతణ్ణి తరిమివేయడమే కాక, అతని భార్య అయిన రుమను తాను బలవంతాన చేపట్టాడు. అటు రాజ్యాన్నీ, ఇటు కుటుంబాన్నీ పోగొట్టుకున్న సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై తలదాచుకున్నాడు.
సీతాన్వేషణలో ఉన్న శ్రీరాముడు ఋష్యమూక పర్వతానికి వచ్చినప్పుడు సుగ్రీవుడితో స్నేహం కుదిరింది. సీతామాత జాడ తెలుసుకోవడంలో శ్రీరాముడికి సాయపడతామంటూ సుగ్రీవుడు వాగ్దానం చేశాడు. అందుకు ప్రత్యుపకారంగా, వాలి వల్ల తాను కోల్పోయిన రాజ్యాన్ని తనకు తిరిగి ఇప్పించడంలో శ్రీరాముడి సహాయం కోరాడు. రాముడు అందుకు అంగీకరించడంతో, సుగ్రీవుడు వెళ్ళి, వాలిని యుద్ధానికి పిలిచాడు. ఆ సమయంలో సంయమనంతో వ్యవహరించాల్సిందిగా వాలికి తార సలహా ఇచ్చింది. కోపాన్ని విడనాడి, సుగ్రీవుడితో పోరు మానుకోవాల్సిందిగా హితం చెప్పింది. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించాల్సిందిగా ఆమె తన భర్తను కోరింది. గతంలో ప్రాణరక్షణ నిమిత్తం పారిపోయిన సుగ్రీవుడు. ఇప్పుడిలా వచ్చి, కయ్యానికి కాలు దువ్వుతున్నాడంటే, అందులో ఏదో మర్మం ఉందని తార పేర్కొంది.
బలవంతులైన మిత్రులెవరో అతణ్ణి కావు కాస్తూ, సహాయపడడానికి వచ్చి ఉంటారనీ, కాబట్టి తొందరపడి యుద్ధానికి దిగవద్దనీ తార, తన భర్త వాలికి సూచించింది. అయోధ్యకు రాకుమారు లైన రామ లక్ష్మణులతో చేసిన స్నేహం వల్ల సుగ్రీవునిలో విశ్వాసం నెలకొందని తనకు అందిన గూఢచర్య నివేదికల ద్వారా ఆమె తెలుసుకుంది. నిజానికి, వాలికి తార చేసిన అభ్యర్థన ఎంతో తెలివైనది,
ఇవేవీ వాలి పట్టించుకోలేదు. కోపావేశాలు అతని బుద్ధి కుశలతను కమ్మేశాయి. సుగ్రీవుడికి గుణపాఠం నేర్పుతానంటూ వాలి ప్రకటించాడు. దాంతో, తార ఇంకేమీ చేయలేకపోయింది. అయితే, ఆమెకు మంత్ర తంత్రాల జ్ఞానం ఉంది. ఫలితంగా, ఆమె కొన్ని రక్షణ కర్మలు చేసి, విజయం సిద్ధించాల్సిందిగా ప్రార్థనలు జరిపి, ఆ పైన వాలిని యుద్ధానికి పంపింది.
వాలి, సుగ్రీవుల యుద్ధం సాగుతున్నప్పుడు పుష్పహారం కారణంగా సుగ్రీవుడెవరో, వాలి ఎవరో రాముడు గుర్తించగలిగాడు. చెట్టు చాటు నుంచి బాణం వేసి, వాలిని నేలకూల్చాడు. వానర రాజైన వాలిని శ్రీరాముడు నేలకూల్చాడనే వార్త వినగానే, వానర మూకలు భయంతో పారిపోసాగాయి. సరిగ్గా అప్పుడు తార సందర్భోచితంగా ప్రవర్తించింది. వానరులందరినీ గద్దించి, వారందరినీ వెంట తీసుకొని, ముందుకు సాగింది. రాజు నేలకూలినప్పుడు ఏ రాణి అయినా చేయాల్సిన పద్ధతిలో వారందరినీ వెంట తీసుకొని, ఆఖరి క్షణాల్లో ఉన్న వాలి వద్దకు వెళ్ళింది. భార్య తెలివి తేటలు, సుగుణాలు బాగా తెలిసిన వాలి, తన అంతిమ ఘడియల్లో సుగ్రీవుణ్ణి పిలిచి, కీలక సందర్భాల్లో ఆమెను సంప్రతించి, ఆమె సలహాలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాడు. మొత్తం మీద నేర్పు, కుశాగ్రబుద్ధి పుష్కలంగా ఉన్న ధైర్యవంతురాలిగా తార మన ఇతిహాసాల్లో కనిపిస్తుంది.
🍁సర్వేజనాసుఖినోభవంతు 🍁
No comments:
Post a Comment