Friday, April 21, 2023

శ్రీ రమణీయం - 25🌹 👌మనసు పవిత్రం - ఆలోచనలే వికారం👌

 [4/21, 08:16] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం - 25🌹
👌మనసు పవిత్రం - ఆలోచనలే వికారం👌
 ✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, 
అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️✳️🌻🌻🌻🌻✳️

🌈  25. మనసు పవిత్రం - ఆలోచనలే వికారం 

✳️  వరద వచ్చినప్పుడు నదిలో నీరు బురదగా కనిపిస్తుంది. అంటే నీటిలో బురద చేరింది. నీరే బురదగా మారిపోలేదు. వచ్చి చేరిన బురద నది పవిత్రతకు భంగం కలిగించలేదు. అలాగే మనసును వేదిక చేసుకొని ఆలోచనలు వస్తున్నాయి. మనసు ఎప్పుడూ తన మూలమైన చైతన్యం తాలూకూ దివ్యత్వాన్ని వీడలేదు. మంచి, చెడు అనేవి ఆలోచనలవే. అవి మనసువి కావు. మనలోని చైతన్యం ఇచ్చిన శక్తితో విషయాలను గ్రహించడం, ప్రతిస్పందించడమే మనసు పని. మిగిలినవన్నీ జీవలక్షణం తాలూకూ వికారాలు. అవి వదిలించుకోవడమే మన ఆధ్యాత్మిక సాధన. మురుగు కాల్వ పక్కనుండి వచ్చే గాలి చెడువాసనను తీసుకొస్తుంది. పూలతోటపై నుండి వీచేగాలి మంచి సుగంధాన్ని తీసుకొస్తుంది. నిజానికి ఆ రెండూ గాలి లక్షణాలు కావు. అలాగే మనసు కూడా మంచి, చెడు ఆలోచనలను మోస్తుంది. మనసు స్వరూపం తెలియని మనం ఇవన్నీ మనసువే అనుకొంటున్నాం. 'నేనెవరు' అని తెలుసుకోవడం అంటే ఈ మనసు స్వరూపం తెలుసుకోవడమే.

✳️ ఏ వికారాలు లేని మనమనసు ఎలా ఉంటుందో చూడాలి. అందుకు జపం, ధ్యానం వంటి ప్రక్రియలు ఉపయోగపడతాయి. వికారాలు లేని మనసు అంటే చైతన్యానికి ప్రతిరూపమే. అది ఎల్లప్పుడూ సహజ ధ్యానస్థితిలోనే ఉంటుంది. అంటే జపం, ధ్యానం సిద్ధిస్తే పొందేది ఆ చైతన్య స్థితితో సమానం. మన ఉనికే ధ్యానస్థితిలో ఉంది. అలాంటప్పుడు కేవలం ధ్యాన ప్రక్రియలను మన ఉనికిగా చేసుకొని ఆగిపోకూడదు. సాధన చేసేందుకు గురువును ఆశ్రయిస్తాం. భక్తితో ఉపదేశం ఇవ్వమని కోరుకుంటాం. కానీ గురువు సూచించే సాధన విధానంపై సంశయాలు ఉంటే ఆ ఉపదేశం ఉపన్యాసంతో సమానం. మనకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో గురువును అంచనా వేయకూడదు. సద్గురువులు జ్ఞానబోధ చేస్తారు. అది ఏ మార్గానికైనా సరిపోయేదిగా ఉంటుంది, గురువు చేసే బోధనలతో సందేహ నివృత్తి చేసుకోవాలి. మన అజ్ఞానంతో కొత్త సంశయాలు రాకూడదు. గురువుపై దృఢ విశ్వాసమే మనకి గురువు నుండి లభించే నిజమైన ఉపదేశం అవుతుంది. అప్పుడే గురుబోధను సహనంగావిని విషయాన్ని స్వీకరించగలుగుతాం. సాధనకు అంతిమలక్ష్యం సత్యదర్శనం. నీలోనే (నీవుగానే) ఉన్న ఆ సత్య వస్తువుపై విశ్వాసం లేకపోయినా పరవాలేదు. కానీ గురువుపై గురి ఉండాలి. నిత్యం సత్యవస్తువుతో అనుసంధానమై ఉండే గురువు మాత్రమే నీకు మార్గం చూపగలరు. సత్యాసత్య వస్తువుల గుర్తులు చెప్పేవారే గురువులు. వ్యాధిని నయంచేసే మందుపై విశ్వాసంలేకపోయినా దాని పని అది చేస్తుంది. కానీ నువ్వు ఆ మందు వాడాలంటే ముందు వైద్యుడిపై విశ్వాసం ఉండాలి. మనకి శరీరం తెలుస్తుంది. మనసులో కలిగే ఆలోచనలు కూడా తెలుస్తూనే ఉన్నాయి. కానీ ఆలోచించే ఆ మనసు యొక్క స్వరూపం తెలియడం లేదు. మనం ఇంట్లో బల్బు వెలిగించుకుంటున్నాం. ఆ బల్బుకి ఉనికి ఉన్నట్లే దాన్ని వెలిగించే కరెంటుకి కూడా ఉనికి ఉంది. బల్బులాగా కరెంటు బాహ్యవస్తువు కాదు కనుక దాన్ని కంటితో చూడలేము. అంతమాత్రాన దానికి ఉనికి లేనట్లు కాదుకదా! కరెంటు చేసే పనులే దాని ఉనికిని తెల్పుతాయి. అలాగే కనిపించే దేహాన్ని కనిపించని చైతన్యం నడుపుతోంది. దేహం లాగానే ఆ చైతన్యానికి కూడా స్పష్టమైన ఉనికి ఉంది. కాకపోతే అది బాహ్య వస్తువులాగా తెలుసుకునేది కాదు. మన గ్రహింపు శక్తితోనే మనసుకు మూలంగా ఉన్న చైతన్యాన్ని తెలుసుకోవాలి. ఈ దేహం రూపంతో ఉన్న ఉనికి కనుక దాన్ని తెలుసుకుంటున్నాం. రూపంలేని చైతన్యాన్ని కూడా తెలుసుకోవడమే మన సాధన లక్ష్యం. మన నిజమైన ఉనికి చైతన్యమా? లేక దేహమా? అన్నది వివేకంతో సాగే ఆత్మవిచారణతో తెలుసుకోవచ్చు. చైతన్యం ఉనికి ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ దేహం ఉనికి అలా ఉండదు. నిద్రలోనూ, విషయంలో లీనమైనప్పుడు గుర్తుకురాని దేహం వ్యవహారిక సత్యం మాత్రమే. నువ్వు ఉండటానికి కారణమైన చైతన్యమే పరమార్థిక సత్యం.

✳️ భగవంతుని సృష్టి ఎంతో విశాలమైనది. బాహ్యంగా కనిపించే ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి వస్తువుకి వస్తువుకి మధ్య తేడా ఉంది. కానీ ఈ జగతికి ఆధార భూతమైన చైతన్యంలో మాత్రం ఆ తేడా లేదు. ఈ సకల చరాచర ప్రకృతిని ఆ చైతన్యమే నడిపిస్తుంది. ఆ చైతన్యం లేనిరోజు ఈ ప్రకృతి అంతా కేవలం జడ పదార్థమే. మనలో ప్రాణం పోయినరోజు మన శరీరం కూడా జడమే. జడ పదార్థానికి సంకల్పం, ఆలోచన, క్రియాకలాపాలు ఏవి ఉండవు. జడవస్తువును నడిపించే చైతన్యానికే ఈ గుణాలు అవసరం. ప్రాణంగా ఉన్న ఆ విశ్వచైతన్యం వల్లనే శరీరం కదులుతుంది. ఆ చైతన్యమే మన జీవనం కోసం మనసుగా వ్యక్తమౌతుంది. ఆ మనసే కన్ను, ముక్కు, చెవుల ద్వారా విషయాలను గ్రహించి ప్రతిస్పందిస్తుంది. ఈ గ్రహింపు, స్పందనలకు ఏ వికారాలు చేరకపోతే మన మనసు స్వచ్ఛంగానే ఉంటుంది.
[4/21, 08:16] +91 73963 92086: ✳️ ఒకే చైతన్య వస్తువు విశ్వమంతా వ్యాపించింది. అది ప్రకృతిలో ఆశ్రయించిన ఉపాధిని బట్టి పనిచేస్తుంది. లౌకిక జీవనం అంతా బాహ్యవస్తువులతో ముడిపడి ఉంది. కనుక వాటిలో ఉన్న తేడాను గుర్తించక తప్పదు. ఆధ్యాత్మిక జీవితాన్ని కోరుకునేవారు మాత్రం బాహ్యవస్తువులలో భేదాన్ని, అంతరంగా ఒక్కటిగా ఉన్న చైతన్యాన్ని గమనించాలి. మన దేహంలోని ఒకే చైతన్యం రకరకాల పనులు చేయించడం మనకి తెలుసు. అలాగే ఈ సృష్టిలో కూడా దాని పనులు వేరువేరుగా ఉన్నాయి. కేవలం బాహ్యమైన ప్రక్రియలను పరికిస్తూ సాగటం లౌకిక వ్యాపారం. అంతరంగా ఉన్న చైతన్యాన్ని సదాస్మరించడం ఆధ్యాత్మిక వ్యాపకం. మనలో ప్రాణశక్తిగా ఉన్న చైతన్యం జీవనం కోసం మనసు ద్వారా ఐదు ఇంద్రియాలుగా మారుతుంది. నిద్రలో ఇంద్రియాలనుండి ఉపసంహ రించుకొని తిరిగి ఒకే ప్రాణశక్తిగా ఉంటుంది. ఈ సృష్టి అంతటినీ ప్రేరేపించే ప్రాణశక్తిని గుర్తించడమే గాయత్రిమంత్రంలోని మర్మం. మననీ, ఈ విశ్వాన్ని నడిపించే చైతన్యానికే బ్రహ్మపదార్థమనీ, శివుడనీ, విష్ణువు అని, అమ్మవారని పనిని బట్టి పేర్లు పెట్టుకుంటున్నాం. ప్రకృతిగా ఉన్నది అమ్మవారైతే అంతరంలో ఆధారంగా ఉన్నది శివచైతన్యమే. ప్రాణం శివుడైతే మన దేహమే అమ్మవారు. ప్రాణానికి, దేహానికీ ఉన్న తేడా తెలుసు కోవడమే ఆత్మానాత్మ వివేకం. మన ప్రాణ స్వరూపం ఎలా ఉంటుందో తెలియజేసేందుకు భిన్నమైన వస్తువు ఒకటి కావాలి. అందుకు మన దేహం ఉపయోగపడాలి. అంతేగానీ ఈ శరీరం కేవలం దేహభావనలో పడి కొట్టుకు పోవడానికి కాదు. అన్ని ప్రాణుల్లో కేవలం జీవించేందుకు అవసరమైన గ్రహింపుఉంది. పరిమితమైన ప్రతిస్పందన మాత్రమే ఉంటుంది. కానీ అనుగ్రహిస్తుంది. నేను ఈ దేహాన్ని కాదని తెలియడం వైరాగ్యం. నేను చైతన్యాన్ని అని తెలియడం ఆత్మానుభవం. నిరంతరం ఆ స్ఫురణలో ఉండటం ఆత్మజ్ఞానం. ఆధ్యాత్మికతలో ఆత్మానుభవం తొలిమెట్టు. ఆత్మజ్ఞానం తుదిమెట్టు. 

✳️ దైవాన్ని బాహ్యరూపంగా దర్శించాలని అనుకోవడం కోటి సూర్యులను ఒకే సారి చూడాలని అనుకోవడమే. ఆ కోరికలో పరిపూర్ణత ఉండదు. ఎందుకంటే బాహ్యంగా దైవం యొక్క పూర్ణస్వరూపం మనకి కనిపించదు. ఒక్క సూర్యుడినే పూర్తిగా చూడలేని మనం కోటి సూర్యుల్ని ఎలాచూస్తాం. ఒక ఒడ్డునుండి నిలబడి చూస్తే సముద్రాన్ని పూర్తిగా చూసినట్లా? నేను సముద్రాన్ని చూశానని అంటాం. మనం చూసింది దానిలో లక్షవ వంతు కూడా ఉండదు. దైవం రాముడిగా, కృష్ణుడిగా అవతరించింది మనకి జీవన విధానం నేర్పడానికి. చైతన్యం యొక్క శక్తి సామర్థ్యాలు ఈ మానవజాతికి తెలియడానికి. ఆ చైతన్య ప్రతిరూపాలను మనం తప్పక ఆరాధించాలి. కానీ ఆ రూపాలే శాశ్వతమని భావించడం సరికాదు. ఆ రూపాలకు ఆధారంగా ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలి. 

✳️ తనతో వాదనకు దిగిన ఒక విజ్ఞానితో 'శ్రీకృష్ణుడిని ఒక్కడిని పట్టుకుంటే చాలని' శ్రీరమణభగవాన్ అన్నారు. ఎన్నో గ్రంధాలు చదివిన ఆ వ్యక్తి 'ఇప్పుడు కృష్ణుడు లేడుకదా' అంటూ సంశయించారు. శాస్త్రాలను ఔపోసన పట్టిన విజ్ఞానం కృష్ణుడిని కూడా కేవలం దేహమాత్రుడిగా భావించేలా చేసింది. గురువును కేవలం దేహంగా చూసే వ్యక్తికి తత్వం ఎలా తెలుస్తుంది. గురువాక్యం మనకి శాసనం. అది సంశయం కాకూడదు.

✳️ శ్రీరమణ భగవాన్ బోధనలను బట్టి మురుగనార్ అనే భక్తుడు శాస్త్రాలను సరిచేసేంత విశ్వాసంతో ఉండేవారు. అలా ఉండగలిగితే చైతన్య స్వరూపుడైన గురువే మనకు దివ్య చక్షువుగా సహకరిస్తారు. ప్రతి పంచదార పలుకులోనూ ఒకే తియ్యదనం ఉంటుందన్నది సత్యం. అలాగే నీలోని చైతన్యం అంతటా వ్యాపించిఉంది. అది నీ అవగాహనలోకీ, అనుభవంలోకి రావాలి. మనిషిలో, పాములో, గబ్బిలంలో ఉన్నది ఒకే ప్రాణం. అయినా ఒక్కో ప్రాణి ఒక్కొక్క ఉపాధి ద్వారా వింటుంది. విషయాన్ని తెలుసుకునే గ్రహింపు లక్షణంగా చూస్తే ఏకత్వం కనిపిస్తుంది. అవి వినే విధానాన్ని చూస్తే వేరువేరుగా కనిపిస్తుంది. మన దృక్పథాన్ని బట్టి సత్యం తెలుస్తుంది.

సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️✳️🌻🌻🌻🌻✳️

No comments:

Post a Comment