Sunday, April 23, 2023

శ్రీ_రమణ_మహర్షి_73వ ఆరాధన దినోత్సవ సందర్భంగా గ్రూప్ లోని సభ్యులందరికీ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ

 #శ్రీ_రమణ_మహర్షి_73వ ఆరాధన దినోత్సవ సందర్భంగా
గ్రూప్ లోని సభ్యులందరికీ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ
అది 1879 సం. డిసెంబర్‌ 29 వ తేదీ. స్థలం దక్షిణభారతం తమిళనాడులోని తిరుచ్చుళి క్షేత్రం. శివుని పంచమూర్తులలోని నటరాజ ఆనందమూర్తి ఆవిర్భావాన్ని పురస్కరించుకొని పెద్ద వేడుకతో జరిపే ‘ఆరుద్ర దర్శనం’ అనే వుత్సవ సమయం… గొప్ప సందడితో కోలాహలంగా ఉంది. అక్కడి శ్రీభూమినాథేశ్వర ఆలయంలోని ఉత్సవమూర్తులను అలంకరించి రథంపై వీధుల వెంబడి నడిపే ఊరేగింపు రోజంతా సాగి రాత్రికూడా కొనసాగుతుంది. అర్థరాత్రి దాటి డిసెంబర్‌ 30వ తేది ప్రవేశించింది. సరిగ్గా ఒంటిగంటకు కోవెలను ఆనుకుని ఉన్న ఇంట్లో ఒక మగశిశువు జన్మించాడు. సుందరం అయ్యర్‌, అళగమ్మ అనే పుణ్య దంపతులు ఆ బిడ్డకు తల్లిదండ్రులు. వేంకటేశ్వరన్ అని నామకరణం చేయబడిన ఆ శిశువే కాలక్రమంలో స్కూల్‌లో వేంకటరామన్ అయి భగవాన్‌ శ్రీరమణమహర్షి అని ఖ్యాతిగాంచాడు. ప్రసవ సమయంలో ఉన్న ఒక అంధురాలికి ఆ దివ్యశిశువు తేజోరాశి మధ్యలో ఉన్నట్లు కనబడింది!

వేంకట్రామన్‌ బాల్యారంభం సాధారణం. తోటివారితో ఆటలు పాటలు… హాయిగా గడిచింది. ఆరేళ్ళ ప్రాయంలో ఓసారి అతడు తండ్రిగారి కోర్టు కాయితాలతో పడవలు చేసి ఆడుకోగా తండ్రి మందలించారు. అంతే, బాలుడు కనబడకుండా పోయాడు. ఎంతో వెతుకులాట అయ్యాక, పక్క గుళ్ళో జగన్మాత ప్రతిమ వెనుక కనబడ్డాడు పూజారికి. అలా తెలియని వయసులో కూడా ప్రాపంచిక సంకటాలనుంచి ఉపశమనానికై దైవసన్నిధినే ఆశ్రయించడం అతని భవిష్యత్‌ జీవితానికి సంకేతం.

వీధిబడి చదువు తిరుచ్చుళిలో పూర్తిచేసి తరువాత క్లాసులకు దిండిగల్‌ చేరాడు.1892 లో తండ్రి మరణం కుటుంబాన్ని కొంత అస్తవ్యస్తం చేసింది. వేంకట్రామన్‌, అన్నతో కలిసి, మధురైలో ఉంటున్న పినతండ్రి సుబ్బయ్యర్‌ ఇంటికి చేరుకున్నారు. మిగిలిన ఇద్దరు పిల్లలు తల్లితో ఉండిపోయారు. మధురలో వేంకట్రామన్‌ చదువు ముందు స్కాట్స్‌ మిడిల్‌ స్కూల్‌లోను, తరువాత అమెరికన్‌ మిషన్‌ హైస్కూల్లోను సాగింది.

స్కూల్‌ చదువులకంటే ఆటలంటేనే పిల్లవాడికి ప్రీతి. తనకున్న అద్భుత జ్ఞాపకశక్తితో విన్న పాఠాలు వెంటనే అప్పచెప్పేవాడు. అయితే, అతనికున్న వింత లక్షణం ఒకటే – మొద్దునిద్ర. ఎంత గాఢం అంటే, అతన్ని లేపడం ఓ బ్రహ్మ ప్రళయం! అతన్ని ఎదరించలేని తోటి కుర్రాళ్ళు, కక్షకట్టి రాత్రివేళ గాఢనిద్రలో ఉండగా, అతన్ని దూరంగా ఈడ్చుకెళ్ళి తనివితీరా బాదేవారట. అయినా, అతనికి రవంత కూడా ఎరుక ఉండదు. ఏం చోద్యం?!

ఓసారి బంధువొకరు రాగా వేంకట్రామన్‌, ”ఎక్కడనుంచి వస్తున్నారు?” అని వారిని అడిగాడు. ”అరుణాచలం” అన్నారాయన. గొప్ప ఆశ్చర్యంతో బాలుడు, ”అరుణాచలమా, అదెక్కడండీ?” అంటాడు. బాలుని అమాయకతకు జాలిపడి ఆయన ”అరుణాచలం అంటే తిరువణ్ణామలయే” అన్నారు. ఇదే సంఘటనను తరువాత కాలంలో స్వామి తన రచనలో పేర్కొన్నారు.

ద్వి|| 1. అరయరాని గిరిగ నమరియుం డహహ;

అతిశయ మీ సేత లరయు వా రెవరు?

అరయరాని చిరువయసు మొద లరుణ

గిరి చాల ఘనమని యెఱుకలో మెఱయ

నరయ లే దది తిరువణ్ణామల యని

దెలిసియు నొకరిచే దీని యర్థమును

ఎఱుకను మఱుగిడి యీడ్వ దాపునకు

నరిగిన సమయమం దచలమై గంటి. (అరుణాచల అష్టకం)

అనతికాలంలోనే, పెరియపురాణం (శివభక్తవిలాసం) అనే గ్రంథాన్ని మొదటిసారిగా చదివాడు యువకుడైన వేంకట్రామన్‌. పరమేశ్వరునికి ‘తను మన ధన ప్రాణ మానము’లను అర్పించుకున్న 63 నాయనార్ల అద్భుత గాథలవి. వారి భక్తి, విశ్వాసం, దివ్యావేశాలకు ముగ్ధుడై, అసలట్టి భక్తి తీవ్రత ఎలా సాధ్యం? అని ఆశ్చర్యపడేవాడు. త్యాగభరితమై, పరమేశ్వర సాయుజ్యానికి దారితీసే ఆ గాథలతనిని పరవశమొనర్చి, సాధుమార్గమును అనుసరించుటకై ఉరకలెత్తించేవి. నాటినుంచి అతనిలో ఓ దివ్యప్రేరణ వికసించసాగింది. దాని అనుభూతిని వారే, తన సహజ చమత్కార సరళ సరళిలో వివరించారు: ”ముందు అదో జ్వరం కాబోలు అనుకున్నాను. అయితే ఏం, హాయిగా ఉంది కదా, ఉండనిమ్మని ఊరుకున్నాను” అన్నారు.

వేంకటరామన్‌ జీవితంలోని గొప్ప మలుపు సంభవించింది 1896 జులై మధ్యలో. ఓ మిట్టమధ్యాహ్నపు వేళ అకస్మాత్తుగా, ఊహించని విధంగా అతనిని దుర్భరమైన మరణభయం విచలితం చేసింది. తరువాత కాలంలో ఆయనే దానినీ విధంగా వర్ణించారు.

”నేను మధురైకి శాశ్వత వీడ్కోలు పలుకడానికి ఆరువారాల ముందు నా జీవితానికెల్లా గొప్ప మార్పు సంఘటించింది. అది జరిగింది చాలా అనూహ్యంగా, హఠాత్తుగా. మా పినతండ్రి గారింటి మేడపై గదిలో ఒక్కణ్ణీ కూచున్నాను.మామూలుగానే నాకు అనారోగ్యం అరుదు; ఇక ఆవేళ నేను ఏతేడా లేకుండా, నిక్షేపంలా ఉన్నాననే చెప్పాలి. అయితేనేం, ఓ ప్రచండమైన మరణభయం ఒక్కసారిగా నన్ను ముంచెత్తింది. ఇక, నాలోని ఏ అస్వస్థతను దానికి కారణంగా చెప్పను? దాన్ని వివరించాలని గానీ, కారణం అన్వేషించాలని గానీ నాకప్పుడు లేదు. తోచింది ఒక్కటే – ”నేను చనిపోతున్నాను”, ఇపుడేం చేయాలి. ఓ డాక్టరును సంప్రదించాలని గానీ, పెద్దలకో స్నేహితులకో చెప్పుకోవాలని గానీ తోచలేదు. ఆ సంకటాన్ని నా అంతట నేను, స్వయంగా, పరిష్కరించు కోవాలనుకున్నాను – అప్పుడే, అక్కడే!

మరణభయ తీవ్రతతో మనసులోనికి మునిగి అంతర్ముఖం కాగా నాలో నేనే ఇలా తర్కించుకున్నాను, ప్రత్యేకంగా మాటలతో పనిలేకుండానే:-

సరే చావు వచ్చిపడింది. అంటే? మరణించేదేమిటి? చనిపోయేది శరీరమే కదా’ అంటూ చావు స్థితిని అభినయించాను. వెల్లకిలా పడుకొని చేతులు చాచి కట్టెల్లా బిగించి, సన్నివేశం రసవత్తరమయేలా శవంలాగే తయారయ్యాను. ఊపిరి బిగపట్టాను. ఎటువంటి మాటా, కనీసం నేననే శబ్దం కూడా, పైకి రానట్లుగా పెదవులును బిగించాను. విచారణ కొనసాగించాను. ‘సరే, ఈ దేహం మరణించింది. దీన్ని శ్మశానానికి తీసుకెళ్ళి కాల్చి బూడిద చేస్తారు. మరి, శరీర మరణంతో ‘నేను’ అంతమైనట్లేనా? శరీరం నేనేనా? అది నిశ్శబ్ద, నిశ్చల జడపదార్థం. మరి ‘నేనో’… నా యొక్క ఎరుకను, స్ఫురణను దేహంతో పనిలేకుండా సంపూర్ణంగా కలిగియున్నాను. అంచేత నేను శరీరానికి అతీతమైన తత్త్వాన్ని. దేహం గతించినా, దానికి భిన్నమైన ఆత్మతత్త్వాన్ని చావు తాకనైనా తాకలేదు. అంటే నేను ‘చావని తత్త్వాన్ని’ అన్నమాట – ఇదంతా ఉత్తుత్తి ఆలోచన కాదు. ఈ సజీవ సత్యం నాలో స్ఫురించగానే ఆలోచనల ప్రసక్తి లేకుండా నేను దానిని సూటిగా గ్రహించాను. ‘నేను’ అనేదే నిజం. నా వర్తమాన ఉనికిని గూర్చిన ఏకైక సత్యం. ఈ ‘నేను’ కేంద్రంగానే శరీరానికి సంబంధించి ఎరుకతో కూడిన కార్యకలాపమంతా సంభవించేది. తత్‌క్షణం నుంచి నేను లేక ఆత్మ ఒక ప్రగాఢమైన ఆకర్షణతో తన దృష్టినంతనూ తన పైనే కేంద్రీకరించింది. చావు భయం సమూలంగా అంతరించిoది. మనసును లోపలే నిలిపి ఉంచే ఆత్మనిష్ఠ అప్పటినుంచి అప్రతిహతంగా, నిర్విరామంగా కొనసాగింది. సంగీతంలోని సప్తస్వరాల్లా ఇతర తలపులు వచ్చిపోవచ్చుగాక, కానీ ఆధార శ్రుతివలె ఈ ‘నేను’ యొక్క ఎరుక స్పష్టం, ప్రస్ఫుటం! శరీరం మాట్లాడటం, చదవడం వంటి ఏ పనుల్లో ఉన్నా ‘నేను’ పైనే ‘నా’ దృష్టి. ఈ సంఘటనకు ముందు ‘నేను’ను గూర్చి నా అవగాహన అంతంత మాత్రం. ఆకర్షణ సుంతైనా లేదు. ఇక దానిని తెలిసికొని నిష్ఠచెందే అవకాశమేదీ?”

ఈ మరణానుభవం వేంకట్రామన్‌ దృక్పథంలోను, నిత్యజీవితంలోను స్పష్టమైన మార్పు తెచ్చింది. అతడు సాధువులా, అణగిమణగి ఉండసాగాడు. పక్షపాత ధోరణిని ఎదిరించేవాడు కాదు. తరువాతి కాలంలో ఆయనే ఇలా వర్ణించారు:

“నాలో సంభవించిన మార్పులలో మీనాక్షీ ఆలయాన్ని గూర్చిన నా ధోరణి ఒకటి. పూర్వం స్నేహితులతో సరదాకో, మొక్కుబడికో వెళ్ళి, దేవీదేవతా మూర్తులను దర్శించి, విభూతి కుంకుమలను ధరించి ఇంటికొచ్చేవాణ్ణి. ఎటువంటి భక్తిభావం లేదు. మరిప్పుడో, ప్రతి సాయంత్రం వెళ్ళేవాణ్ణి – ఒక్కణ్ణీ. శివుడు, మీనాక్షి, నటరాజు లేదా 63 నాయనార్లు – ఏదో ఓ విగ్రహం ముందు నిశ్చలంగా నిలబడి చాలాసేపు ఉండిపోయేవాణ్ణి. భావావేశ తరంగాలు నన్ను ముంచెత్తేవి.

ఆగస్ట్‌ 29న వేంకట్రామన్‌ ఇంగ్లీష్‌ గ్రామర్‌ ఎస్సైన్‌మెంట్‌ చేసుకొంటున్నాడు. ఒక్కసారి ఈ చదువుల డొల్లతనం తోచి పుస్తకాలు పక్కకు తోసేసాడు. బాసింపెట్టి గాఢ ధ్యానావస్థుడైనాడు. ఇదంతా ఓకంట కనిపెడుతున్న అన్న నాగస్వామి విసుగ్గా “ఇటువంటి వానికివన్నీ ఎందుకో?” అని కసురుకున్నాడు. అన్న మాటల్లో సత్యాన్నే తీసుకున్న వేంకట్రామన్‌ ఈ తంతులన్నీ చాలించి, చెప్పాపెట్టకుండా ఇల్లువీడి పోదామనే నిశ్చయానికొచ్చాడు. స్కూల్‌లో స్పెషల్‌ క్లాసుందనే మిషతో లేచాడు. అలా అయితే తన స్కూల్‌ఫీజు కట్టమని అన్న 5రూ. తీసుకెళ్ళమన్నాడు. ప్రయాణానికి పైనుండి సహాయం మొదలైంది. టికెట్‌కు 3 రూ.లు లెక్కకట్టి, మిగిలిన 2 రూ.లు, దానితోపాటు ఈ కింది చీటీ, పెట్టెలో ఉంచి గడప దాటాడు. “నేను నా తండ్రి ఆదేశంపై ఆయనను వెతుక్కుంటూ బయలుదేరుతున్నాను. ఓ ఉదాత్తమైన ఆశయం కోసం ఈ నిష్క్రమణ. కాబట్టి ఈ విషయమై ఎవరూ బాధపడవద్దు. దీనిని వెతికించేందుకు డబ్బు ఖర్చుపెట్టవద్దు.

నీ కాలేజ్‌ ఫీజు కట్టబడలేదు. రెండురూపాయిలు ఇక్కడున్నాయి.

ఇట్లు,

….

వేంకటరామన్‌ ప్రయాణానికి పరదైవమే మార్గదర్శి. స్టేషన్‌కు ఆలస్యంగా చేరిన అతనికి ట్రైన్‌ కూడా ఆలస్యంగా రావడం కలిసొచ్చింది. తిరువణ్ణామలైకు సమీప స్టేషన్‌ దిండివనంగా అట్లాస్‌లో గుర్తించి అక్కడికి టికెట్‌ కొన్నాడు. రైల్లో ఓ ముస్లిం సాధువు మౌల్వీ గాఢధ్యానంలో మునిగివున్న ఈ బ్రాహ్మణ యువకుని చూసి, ముచ్చటపడి కబుర్లు మొదలెట్టాడు. ప్రయాణ వివరాలడిగి, విల్లుపురం నుంచి తిరువణ్ణామలైకు వేసిన కొత్త రైలుమార్గం గురించి చెప్పాడు.

తెల్లవారుజామున 3 గం.కు రైలు విల్లుపురం చేరింది. మిగిలిన దూరాన్ని నడుద్దామని తలపోసి, మార్గంకోసం ఊళ్ళో తిరుగుతుండగా అతనికి ఆకలి వేసింది. ఓ హోటల్‌ కెళ్ళగా, మధ్యాహ్నం వరకు వేచి ఉండమన్నారు. కూచున్న యువకుని గమనించాడు హొటల్‌ యజమాని. చక్కటి వర్చస్సు, నల్లని కురులు, బంగారు చెవిపోగులు, జ్ఞానశోభతో మెరిసే మోము; మూటా-ముల్లె లేదు. ముగ్ధుడైపోయి, అతనికి భోజనం పెట్టించి, అతడీయబోయిన రెండు అణాలను స్వీకరించలేదు. మళ్ళీ స్టేషన్‌ చేరిన వేంకట్రామన్‌ మిగిలిన డబ్బుతో మాంబలపట్టు వరకు టికెట్‌కొని రైల్లో మధ్యాహ్నానికి అక్కడికి చేరుకున్నాడు.

అక్కడినుండి సుమారు 20 కి.మీ నడిచి తిరుక్కోయిలూర్‌ చేరుకునేటప్పటికి సాయంత్రమైంది. దాపులోనే చిన్న గుట్టమీద ఉన్నది అరయనినల్లూరు గుడి. ఆవరణలోంచి దూరంగా లీలగా గోచరించే అరుణగిరి. వేంకట్రామన్‌ కోవెలలోపల ఓ మూలకూచుని ధ్యానమగ్నుడయాడు. కళ్ళు తెరవగానే మిరుమిట్లు గొలిపే పెద్ద కాంతిమేఘం, గుడిని ముంచేస్తూ. కాసేపటికది మాయమైంది.

తిరిగి ధ్యానమగ్నుడైన అతనిని అర్చకులు లేపారు, గుడి మూస్తామంటూ. వేంకట్రామన్‌ ప్రసాదం కోసం అర్థించగా వారు నిరాకరించారు. కొంచెం దూరంలో కీలూర్‌ అగ్రహారంలోని గుడికి వెళ్ళారందరూ. అక్కడకూడా అతనికి ప్రసాదం లభించకపోతే, ఆలయ వాద్యగాడు తన భాగాన్నిచ్చాడు. నీళ్ళకోసం దాపులోని ఇంటిని ఆశ్రయించబోయి దారిలోనే స్పృహతప్పి పడిపోయాడు. లేచి చూస్తే చుట్టూ గుంపు. తెప్పరిల్లి, చుట్టూ చెల్లాచెదరైన ప్రసాదం ఏరుకుని తిని, నీళ్ళుతాగి సేదతీరాడు.

మరునాడు 31 ఆగష్టు, శ్రీకృష్ణాష్టమి. కొంత నడచి, ముత్తుకృష్ణ భాగవతార్‌ ఇంటికి చేరాడు. ఇంటి ఇల్లాలు అతనికి అన్నం పెట్టి ఆదరించింది. వేంకట్రామన్‌ తన చెవిపోగులు యజమానివద్ద కుదువబెట్టి 4 రూపాయలు అప్పు తీసుకున్నాడు. గృహలక్ష్మి బాలకృష్ణునికోసం సిద్ధంచేసిన నైవేద్యాలను అభ్యాగత కృష్ణునికి సమర్పించి మరీ సాగనంపింది. స్టేషన్‌ చేరిన వేంకట్రామన్‌ అక్కడే నిద్రపోయాడు. మరునాడుదయమే ప్రయాణం. లేచి టికెట్‌కొని రైలెక్కాడు.

సెప్టెంబర్‌ 1, 1896. వేంకట్రామన్‌ ఇల్లు వదలిన మూడురోజుల తరువాత అరుణోదయవేళలో అరుణాచలంలో మంగళవారంనాడు మంగళప్రదంగా పాదం మోపాడు. అడుగు వడివడి … గుండె దడదడ. ఎక్కడా ఆగక, ఎటూ చూడక తిన్నగా శ్రీఅరుణాచలేశ్వర ఆలయాన్ని ప్రవేశించాడు. ప్రియభక్తునికి ప్రత్యేక స్వాగతచిహ్నంగా అన్ని ప్రాకార ద్వారాలు, గర్భాలయంతో సహా, బార్లా తెరచి ఉన్నాయి. భక్తుడు, భగవంతుడు మినహా వేరెవ్వరూ లేరక్కడ! అరుణాచలేశ్వర మహాలింగాన్ని ఆలింగనం చేసుకున్నాడు. ”నాయనా, నీ పిలుపుపై వచ్చాను. తీసుకో. నీ యిష్ట ప్రకారమే కానీ” అంటూ ఆత్మసమర్పణ చేసుకొన్నాడు. ప్రయాణం ముగిసింది. అసలు కథ ప్రారంభమైంది.3

తిరువణ్ణామలైగా పిలిచే అరుణాచలంలో శ్రీరమణులు పలుచోట్ల, పెద్దగుడిలోను, గిరి గుహలలోను నివాసముంటూ చివరగా గిరి దక్షిణపాదంలో స్థిరపడగా అదే నేటి శ్రీరమణాశ్రమంగా రూపుదిద్దుకొంది. వారు సన్న్యాసాది దీక్షలు తీసుకోలేదు. ఎవరికీ ఇచ్చి శిష్యులుగా చేసుకోనూ లేదు. 1896 సెప్టెంబర్‌ 1న అరుణాచల ఆగమనం నాటినుంచి ఏప్రిల్‌ 14, 1950లో మహానిర్వాణం వరకు – సుమారు 54 సం.లపాటు వారికి అత్యంత ప్రియమైన అరుణగిరి పొలిమేర దాటిపోలేదు.

ఊళ్ళోకి వచ్చిన కొత్తలో బ్రాహ్మణస్వామిగా పిలువబడే కాలంలో వారి తొలి స్థావరం పెద్ద ఆలయమే. వేయిస్తంభాల మంటపంలో కొద్ది వారాలుండి, తుంటరి మూకల దాడులను తప్పించుకొనేందుకు అక్కడే భూగృహంగా వున్న పాతాళలింగం గుహకు చేరుకున్నారు. సూర్యరశ్మి చొరరాని ఈ గుహలో రోజుల తరబడి గాఢసమాధిలో వుండగా క్రిమికీటకాలు వారి తొడలను గాయపరిచేవి. అయితే, అల్లరిమూక ఈ స్థావరాన్ని కనిపెట్టి ఇబ్బందిని కొనసాగించారు. ఆ కాలంలోనే శేషాద్రిస్వామిగా పిలువబడే ఓ మహాత్ములు బ్రాహ్మణస్వామి మహిమనెరిగి వారి రక్షణ బాధ్యత వహిస్తుండేవారు. ఓనాడిలాగే తుంటరిదండు దాడిచేయగా, వారిని తరిమివేసి, ఇతరుల సాయంతో వొళ్ళెరగని బ్రాహ్మణస్వామిని పక్కనే వున్న సుబ్రహ్మణ్య స్వామి సన్నిధికి తెచ్చారు. పరవశంలో వున్న స్వామికేమీ తెలియదు. అక్కడివారు బలవంతంగా వారిచేత తినిపించేవారు. స్వామి తమకు తెలియకనే అక్కడి తోటలలోను, రథాల కింద కూచుండి పోయేవారు.

తరువాత, వారు గుడికి కొంతదూరంలో వున్న మామిడితోపులోకి మకాం మార్చారు. ఇక్కడ స్వామిని వారి పినతండ్రి (బాబాయి) నెల్లియప్ప అయ్యర్‌ కనుగొని, ఇంటికి తీసుకొని పోవుటకు ప్రయత్నించగా స్వామి స్పందించలేదు. గత్యంతరం లేని బాబాయి నిరాశగా మానామదురైకి వెళ్ళి, ఈ సమాచారాన్ని తల్లి అళగమ్మకు నివేదించారు. అమ్మకీ వార్త ఎడారిలో సరోవరమే అయింది.

పెద్దకొడుకు నాగస్వామిని తీసుకొని అళగమ్మ తిరువణ్ణామలై వచ్చింది. స్వామి అపుడు పెద్దగుడి పక్కనే వున్న గిరిశిఖరం పవలకున్రు (ప్రవాళగిరి) పై శివాలయంలో ఉన్నారు. కన్నీళ్ళతో కొడుకును అర్థించింది, ఇంటికి పోదామని. గిరిసమంగా ఉన్న స్వామిని ఎవరు కదిలించగలరు? అమ్మ ఆరాటాన్ని చూచిన అక్కడివారు స్వామిని ఆమెకు సమాధాన మీయమని కాగితం, పెన్సిల్‌ ఇవ్వగా వారిట్లా రాసారు.

“కర్త వారివారి ప్రారబ్ధానుసారము జీవుల నాడించును. జరుగనిది ఎవరెంత ప్రయత్నించినను జరుగదు; జరుగునది ఎవరెంత యడ్డుపెట్టినను జరుగనే జరుగును. ఇది సత్యము. కనుక మౌనముగ నుండుటయే ఉత్తమము.”

బరువెక్కిన గుండెతో తల్లి వెనుతిరిగింది. ఈ సంఘటన తర్వాత, రమణులు గిరిపైనే పలుతావులలో రమించారు. వాటిలోకెల్లా విరూపాక్షగుహలో సుదీర్ఘంగా 17 సం.లున్నారు. తొలినాళ్ళలో స్వామి చాలావరకు మౌనంగా ఉండేవారు. అప్పటికే వారిచుట్టూ జిజ్ఞాసువుల, సేవక భక్తుల బృందం ఏర్పడింది – పిల్లలు, పెద్దలు కడకు జంతువులతో సహా. హృదయ మధురమైన దృశ్యం ఏమంటే, ఊళ్ళోని చిన్నవాళ్ళు సైతం శ్రమకోర్చి కొండెక్కి విరూపాక్షగుహవద్ద వున్న స్వామిని చేరి, కొంత తడవు వారివద్ద కూచొని, సరదాగా ఆడుకొని, తాయిలాలను ఆనందాన్ని పంచుకొని, తిరిగి వెళ్ళేవారు. వారికి స్వామి తమలో ఒకరు.

ఉడుతలు, కోతులు వచ్చి వారి చేతినుంచి ఆహారాన్ని స్వీకరించేవి. ఇలాటి అద్భుత దృశ్యాలెన్నో, ఎన్నెన్నో.

మానామదురైలో మరిది వద్ద వుంటున్న తల్లి అళగమ్మ స్వామికోసం చాలాసార్లు వచ్చివెళ్ళారు. ఓసారి ఆమె టైఫాయిడ్‌ వంటి జ్వరంతో చాలారోజులు బాధపడ్డారు. అంతా దైవేచ్ఛ అని ఉపదేశించిన స్వామి ఈసారి ఆమెకెంతో ఉపచరించి, ఆమె స్వస్థత కొరకు అరుణాచలేశ్వరునికి ఒక స్తోత్రం సమర్పించారు. దానిలోని మొదటి చరణం:

“తరంగములు పరంపరవలె వచ్చు సంసార సంకటములను కుదుర్చుటకు గిరిరూప ఔషధమువలె ఉద్భవించిన అరుణశైలవిభూ! నీ పాదములే శరణు. ఆమె అనారోగ్యమును నిర్మూలించుట నీ ధర్మము!”

అళగమ్మ కోలుకొని మానామదురై తిరిగివెళ్ళారు. ఇక 1916లో తిరువణ్ణామలై వచ్చిన ఆమె, రమణుల వద్దనే స్థిరపడాలని నిశ్చయించారు. త్వరలోనే కొడుకు నాగసుందరం కూడా తల్లిబాట పట్టాడు. ఈ సమయంలోనే రమణులు తమ నివాసాన్ని విరూపాక్ష నుంచి స్కందాశ్రమానికి మార్చారు. ఇక్కడే వారు తమ తల్లికి అనునిత్యం వైరాగ్యాన్ని నూరిపోసారు. అక్కడున్న కొద్దిమందికి ఆమె ఆహారం వండిపెట్టేవారు. సన్న్యాసం స్వీకరించిన నాగసుందరం నిరంజనానంద స్వామి అయ్యారు.

1920లో అళగమ్మ తల్లి ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. రమణులకు ఆమెను కంటికి రెప్పలా కాపాడటంలో పలురాత్రులు కంటిమీద కునుకు ఉండేది కాదు. 1922లో భగవాన్‌ రమణుల హస్తమస్తక సంయోగ దీక్షతో అళగమ్మ విదేహముక్తి నందారు. ఆమెకు స్పృహ వున్నంత వరకు స్వామి వేదాంత బోధ చేసి చివరగా తమ కుడిచేతిని ఆమె హృదయంపైనా, ఎడమచేతిని శిరస్సుపైన వుంచి తదేక దృష్టితో ఆమెను వీక్షిస్తూ మోక్షాన్ని ప్రసాదించారు. ఆచారం ప్రకారం కైవల్యాన్ని పొందిన ఆమె శరీరాన్ని దహనం చెయ్యకుండా, గిరి దక్షిణపాదంలో సమాధి చేసారు. స్కందాశ్రమం నుంచి 20 నిమిషాల దూరంలో ఉన్న ఈ స్థానాన్ని రమణులు తరచు సందర్శించేవారు. ఓ రోజున వచ్చి అక్కడే స్థిరపడ్డారు. అప్పటినుంచి అంచెలంచెలుగా ఆ సమాధి చుట్టూ రూపుదిద్దుకొన్న నిర్మాణాల సమాహారమే నేటి శ్రీరమణాశ్రమం. “నాకుగా నేనిక్కడకు రాలేదు. అరుణాచలానికి తీసుకొని వచ్చిన శక్తియే నన్నిక్కడకు చేర్చింది” అన్నారు స్వామి.

ఆశ్రమం వెంటనే రూపుదిద్దుకోలేదు సుమా! మొదట అమ్మ సమాధిపై ఒక తాటాకు (కొంజా) పందిరి ఉండేది. క్రమేపీ, దాతల సహకారంతో శాశ్వత నిర్మాణములు మొదలై రమణులు కూర్చుండే హాల్‌ ధ్యానమందిరం, ఆఫీసు, పుస్తకాలయం, ఆసుపత్రి, అతిథి గృహం, రెండు చిన్న బంగళాలు రూపొందాయి. ఆశ్రమంలో అనుమతి మగవారికి పరిమితమై ఉండేది. స్త్రీలు సాయంత్రం ఊరిలో మకాం చూసుకొనేవారు. ఆశ్రమానికి, కొండకు మధ్య పల్లాకొత్తు అనే తోపులో కొందరు సాధు పుంగవులు నివాసాలు ఏర్పరుచుకున్నారు. కామధేను అపర అవతారమైన గోవు లక్ష్మి ఆగమనంతో ఆశ్రమం నవ్యశోభ సంతరించుకొంది. ఆమెకొరకు గోశాల ఏర్పాటు కాగా అది క్రమాభివృద్ది చెందింది. గో సంపద సమకూర్చే పాడితో ఆశ్రమ సందర్శకుల, నివాసకుల సందడి దినాదినాభివృద్ధి కాగా, ఆశ్రమం ఒక ఆధ్యాత్మ కేంద్రమే కాక, అన్నక్షేత్రం కూడా అయింది. గోసంరక్షణ, సాధుపోషణ రమణుల ప్రియ కార్యాలయ్యాయి. కాలక్రమంలో ఆగమోక్త విధానంలో నిర్మితమైన శ్రీమాతృభూతేశ్వరాలయం అళగమ్మ సమాధిపై సుప్రతిష్ఠమైంది. మహాలింగం, రెండు శ్రీచక్రాలకు నిత్యపూజలు కొనసాగుతున్నాయి నేటికీ.

ప్రత్యేకతను రమణులు ఆమోదించేవారు కారు. ఈ విషయాన్ని భోజనాల వద్ద నొక్కి వక్కాణించేవారు. ఔషధాలుగానీ, టానిక్‌వంటి బలవర్ధకాల విషయాలలో గానీ ఇదే నియమం పాటిస్తూ, అన్నీ అందరికీ సమంగా అందేలా చూసేవారు. ఈ విషయంలో వారికి వారే సాటి. అంతేకాదు. ఆశ్రమ నిర్వహణలో ఎన్నడూ కల్పించుకోరు. నిర్వాహకుల నియమావళిని పాటించడానికి ఆయనే ముందుండేవారు, కానీ వారెన్నడూ నియమావళిని ఏర్పరచేవారు కారు. వారి లీలాకార్యం కేవలం ఆధ్యాత్మికం – తమ ఆశ్రయంలోకి నిత్యం వచ్చిచేరే సాధక శ్రేణులకు మౌనంగా మార్గదర్శనం చేయడం. చిన్నస్వామిగా పిలువబడే రమణుల తమ్ముడు నిరంజనానంద స్వామి ఆశ్రమ నిర్వాహకులు లేక సర్వాధికారి. నిత్యం మహర్షి సన్నిధిన జరిగే సత్సంగానికి వేదిక – ధ్యానమందిరం (పాతహాల్‌). ఆధ్యాత్మ క్రియాశీలకమైన ఈచోటు స్వామి కరుణతో అలరారుతుంది. వారి కన్నులు అలౌకిక ప్రేమతో తొణికిసలాడుతూ, ఆవశ్యకమైన మధుర గంభీర వాక్కులతో అభ్యాసకులకు ఉద్దీపన కల్గించేవి. ఒక క్రమపద్ధతిలోనో, సమయంలోనో ధ్యానాదులు చేయాలనే పట్టింపులేదు. తొలినాళ్ళలో తలుపులు సందర్శకులకు ఎప్పుడూ తెరచి వుండేవి. రాత్రులు కూడా భక్తులు వచ్చి స్వామిని దర్శించేవారు.

భక్తులకు తామెప్పుడూ అందుబాటులో ఉండాలన్నదే వారి ఆశయం. అందుకోసం ఎక్కువ ఎక్కడికీ వెళ్ళేవారు కారు. పగలు, సాయంత్రం కొంచెంసేపు కొండమీదకో, పల్లాకొత్తుకో వెళ్ళే విహారాలు మినహా. తొలిరోజుల్లో తరచు గిరిప్రదక్షిణ చేసేవారు. భక్తుల సంఖ్య, సత్సంగ సమయాలు పెరిగిన కొద్దీ క్రమేపీ మానుకున్నారు.

1949లో మహర్షుల ఎడమ మోచేతిపై సార్కొమా (క్యాన్సర్‌) వచ్చింది. ఎన్ని వైద్యాలు చేసినా లొంగక, ఏప్రిల్‌ 14, 1950న వారి భౌతికయాత్రకు అంతిమ ఘడియ సమీపించింది. ఆనాడు సాయంత్రం మాతృభూతేశ్వరాలయం ఎదుట ప్రస్తుతం నిర్వాణ రూమ్‌గా పిలిచే గది వరాండాలో భక్తులంతా కూచుని స్వయంస్ఫూర్తితో ‘అరుణాచల శివ’ అంటూ రమణులు రాసిన ‘అక్షర మణమాల’ను ఎలుగెత్తి అరుణగిరిని నినదించారు. గదిలో కనులు మూసి పడుకొన్న రమణుల నేత్రాలు ఆనంద భాష్పాలతో విప్పారాయి. అనిర్వచనీయమైన మార్దవాన్ని వెదజల్లే చిరునవ్వు చిందించింది వారి మోము. కనుకొలుకులనుండి ధారగా భావాశ్రువులు. ఒకే ఎగశ్వాస …. అంతే …. నిశ్శబ్దం!

అది రాత్రి 8.47 సమయం. ఒక పెద్ద కాంతిగోళం దక్షిణంగా ఆకాశంలో మెరసి, నెమ్మదిగా ఈశాన్యదిశగా పయనించి అరుణశైల శిఖరంలో అంతర్హితమైంది. బొంబాయి, శ్రీలంక వంటి సుదూర ప్రాంతాలకు కూడా కనిపించిందీ దివ్యజ్యోతి. మహర్షుల భౌతిక యాత్ర ముగింపుకు ఇది సుస్పష్ట సంకేతమని ఎలుగెత్తి చాటారంతా!

రమణుల ఆధ్యాత్మిక శక్తివిలాసం వారి దేహయాత్ర అనంతరం క్షీణించకపోగా నానాటికీ ఉజ్జ్వలంగా భాసిస్తోంది. తమ ఆధ్యాత్మ ప్రగతి కోసం వారు ఇంకొన్నాళ్ళు తమ జీవితాన్ని పొడిగించుకోవాలని భక్తులు ప్రార్థిస్తే, ”పోతానా? నేనెక్కడికి పోయేది, ఇక్కడే ఉంటానెప్పుడూ” అంటూ ధీమగా చెప్పేవారు. దాని అర్థమిదే.
                  🙏శివోహం 🙏

No comments:

Post a Comment