శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన స్థితప్రజ్ఞుడి లక్షణాలు!!
ప్రస్తుతం మనిషి ప్రతి నిమిషాన్ని కూడా తన కోణం నుండే, తనకు ఏ విధంగా లాభం చేకూరుతుంది?? అనే ఆలోచనతో చేస్తాడు. మనకు ఎవరైనా అడ్డు అనిపిస్తే ఏదోలా తొలగించుకోవాలని చూస్తాడు. ఇంకా తన గురించి అందరూ మంచిగా చెప్పుకోవడానికి ఇతరులను చెడుగా మార్చేస్తాడు. కానీ శ్రీకృష్ణ భగవానుడు స్థితప్రజ్ఞుడి గురించి చెబుతూ భగవద్గీత రెండవ అధ్యాయంలో యాభై ఏడవ శ్లోకాన్ని ప్రస్తావిస్తూ ఇలా భోదిస్తాడు.
【శ్లోకం:- యః సర్వతానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభమ్।
నాభినన్దతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా!
దేనిమీదా, ఎవరిమీదా ఎక్కువగా మమతానురాగములు లేని వాడు, శుభమును, అశుభమును సమానంగా చూసేవాడు, ఒకరిని అభినందించడం, మరొకరిని ద్వేషించడం చేయనివాడు, అటువంటి వానిలో ప్రజ్ఞ అంటే బుద్ధి చక్కగా ప్రతిష్ఠితమై ఉంటుంది.】
ఈ శ్లోకంలో యః అని వాడారు. య: అంటే ఎవరైతే అని అర్థం. అంటే స్థితప్రజ్ఞుని లక్షణాలు ఒకరి సొత్తుకావు. ఆడవారు, మగవారు, ఉన్నత కులస్థులు, నీచకులస్థులు ఎవరైనా స్థిత ప్రజ్ఞుని లక్షణములు కలిగి ఉండవచ్చు అని పరమాత్మ ఉద్దేశ్యము. కిందటి శ్లోకంలో చెప్పినట్టు, అతడు ఈ జన్మలో జ్ఞానం కలిగి ఉండవచ్చు. కాని ఇంతకు ముందు జన్మల వాసనలు అతనిని అంటిపెట్టుకొని ఉంటాయి. వాటి ప్రభావం చేత అతనిలో ప్రాపంచిక విషయముల మీద అభిమానము, స్నేహము, సంగము కలిగే అవకాశం ఉంది. కాని ఈ జన్మలో అతని బుద్ధి స్థిరంగా ఉండటం వలన, అటువంటి ప్రలోభాలకు లోను కాడు. స్థిరంగా, నిశ్చలంగా ఉంటాడు. శుభం కలిగినా అశుభం కలిగినా అతడు చలించడు. అతడు ఎవరినీ ద్వేషించడు. అలాగని ఎవరినీ పూజించడు. సర్వులయందు సమత్వభావము కలిగి ఉంటాడు.
ఎందుకంటే అతని బుద్ధి, ప్రజ్ఞ ఈ జన్మలో నిశ్చలంగా ఉంటుంది. ఎటువంటి ప్రలోభాలకు లోను కాదు. ఈ శ్లోకంలో అభిస్నేహము అనే పదం వాడారు. స్నేహము అంటే సాధారణ స్నేహం. ఇందులో మనుషుల మధ్య దగ్గరితనం అంత లోతుగా ఉండదు. అభిస్నేహము అంటే గాఢమైన స్నేహము. ఇదే లోతైన స్నేహం. ఇద్దరి మధ్య ఎంతో దగ్గరితనం, దేన్నైనా పంచుకోగల (పంచుకోగల అంటే ఏదో ఇచ్చేయడం కాదు. మనసు విప్పి చెప్పుకోగలగడం. మంచి చెడు, తప్పు, ఒప్పు, మనసులో సమస్త భావాలు) దగ్గరితనం. మనం అందరితో స్నేహంగా ఉన్నా, మనకు ఇష్టమైన కొంతమందితో మాత్రమే సౌకర్యవంతంగా ఉంటాము. కొంత మందితో అయితే, అతడు లేకపోతే నేను బతకలేను అనే విధంగా ఉంటాము. మరి కొంత మందితో అంటీ ముట్టనట్టు ఉంటాము. కాని స్థితప్రజ్ఞుడు అందరినీ ఇష్టపడతాడు, కాని ఎవరూ లేకపోయినా ఏమీ అనుకోడు. ఎందుకంటే అతడు ఎవరి మీదా ఆధారపడి లేడు. మనం ఇతరులతో స్నేహం చేస్తున్నాము అంటే వారి స్నేహం కోసం వారి మీద ఆధారపడుతున్నాము అని అర్థం. కాని స్థితప్రజ్ఞుడు అయిన వాడు అందరితో స్నేహంగా ఉంటాడు కానీ అతనిది ఎవరి మీద ఆధారపడే స్నేహం కాదు.
ఎల్లప్పుడూ స్వతంత్రంగా ఉంటాడు. ఎవరిమీదా ఆధారపడడు. అనుకూలము ప్రతికూలము ఏది వచ్చినా సుఖము, దుఃఖము పొందడు. అన్నిటినీ సమంగా చూస్తాడు. దేనికీ అనవసరంగా స్పందించడు. అనవసరమైన పనులను చేయడు. అవసరమైన పనులనే చేస్తాడు. (ఇక్కడ అవసరం అంటే స్వార్థం అని కాదు. అవసరం అంటే మరొకరికి ఇబ్బంది కలిగించనిది. ప్రయోజనం చేకూర్చేది. అది తనకే కావచ్చు ఇతరులకు అయినా కావచ్చు. కానీ దానిని పనిగానే చేస్తాడు తప్ప మెప్పు కోసమో, మరి ఏదో ఆశించో కాదు) ఏ పని చేసినా బాగా ఆలోచించి చేస్తాడు. ఏ విధమైన వికారములకు లోను కాడు. అటువంటి వ్యక్తి యొక్క ప్రజ్ఞ, జ్ఞానము స్థిరంగా, అచలంగా ఉంటుంది.
దీనిని బట్టి మనిషి ఎలా ఉండాలి. తనలో ఉన్న ఏ గుణాలను వధులుకోవాలి?? వీటిని పెంపొందించుకోవాలి అనేది అర్థం చేసుకోవచ్చు.
ఓం నమో నారాయణాయ
No comments:
Post a Comment