🕉️ *శ్రీ గురుభ్యోనమః* 🕉️
*1. ఆత్మ స్వరూపము*
*ప్రశ్న: ఆత్మసాక్షాత్కారం పొందినవారికి మెలకువ, స్వప్నం, సుషుప్తి అనే మూడు అవస్థలూ ఉండవంటారు నిజమేనా?*
*జవాబు:* ఆ మూడూ ఉండవని ఎట్లా అంటున్నావు? *నేను కల కన్నాను, నేను గాఢ నిద్రపోయాను, నేను మేల్కొని ఉన్నాను* అని నువ్వన్నప్పుడే ఆ మూడు స్థితులలోనూ నువ్వు ఉన్నట్టేనని ఒప్పుకోవాలి. అంటే ఎల్లప్పుడూ నువ్వున్నావనే స్పష్టమౌతోంది.
ఇప్పుడు నువ్వు జాగ్రత్ అవస్థలో ఉన్నట్టు. స్వప్నావస్థలో ఇది మరుగున పడుతుంది. అట్లాగే సుషుప్తిలో స్వప్నావస్థ మాయమవుతుంది. నువ్వు అప్పుడూ ఉన్నావు, ఇప్పుడూ ఉన్నావు, ఎప్పుడూ ఉంటావు. ఆ మూడు అవస్థలూ వస్తుంటాయి, పోతుంటాయి. కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ ఉంటావు.
ఇదొక సినిమా వంటిది. తెరవీ ఎప్పుడూ ఉంటూనే ఉంది. కాని దాని మీద ఎన్నో రకాల బొమ్మలు వస్తుంటాయి, పోతుంటాయి. తెరకి ఏదీ అంటుకోదు. తెర తెరగానే ఉంటుందెప్పుడూ! అట్లాగే ఆ మూడు స్థితులలోనూ నువ్వు ఆత్మగానే ఉంటావు. ఈ విషయం తెలిస్తే, తెరకి చిత్రాలు అంటుకోనట్టు ఈ మూడు అవస్థలూ నిన్నేమీ ఇబ్బంది పెట్టవు. తెరమీద ఒక్కొక్కసారి పెద్దపెద్ద కెరటాలతో మహా సముద్రం కనబడుతుంది... అది పోతుంది. ఇంకోసారి చుట్టూ రేగిపోతున్న మంటకనబడుతుంది... అదీ పోతుంది. రెండుసార్లూ తెర అక్కడే ఉంది. నీటివల్ల తెర తడిసిపోయిందా? మంటవల్ల తెర కాలిపోయిందా? తెరన ఏదీ ఏమీ చేయలేదు. అట్లాగే, మెలకువగా ఉన్నప్పుడు గాని, స్వప్నంలో ఉన్నప్పుడు గాని, సుషుప్తిలో ఉన్నప్పుడు గాని జరిగేవాటికి వేటికీ నీ మీద ప్రభావముండదు. నువ్వు నీ ఆత్మగానే ఉంటావు.
*ప్రశ్న: అంటే, ఆ మూడు అవస్థలూ ఉన్నా, మనుష్యులపై వాటి ప్రభావముండదంటారా?*
*జవాబు:* అవును. ఈ అవస్థలన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. ఇవేవీ ఆత్మకి పట్టవు. దానికి ఒకే ఒక అవస్థ ఉంటుంది.
*"నీ సహజస్థితిలో ఉండు"*
🌷🙏🌷
No comments:
Post a Comment